Allu Arjun: ఇంట్లో ఎగురు.. బయట పద్ధతిగా ఉండు.. నీ వల్ల ఇండస్ట్రీ తలదించుకోవాల్సి వచ్చింది: బన్నీపై నిర్మాతల ఫైర్
Allu Arjun: అల్లు అర్జున్ పై టాలీవుడ్ నిర్మాతలు సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ్ తీవ్రంగా మండిపడ్డారు. అతని ఒక్కడి వల్ల ఇండస్ట్రీ మొత్తం సీఎం ముందు తలదించుకోవాల్సి వచ్చిందని వాళ్లు అనడం గమనార్హం. బన్నీ సంధ్య థియేటర్ ఘటన, తర్వాత జరిగిన పరిణామాలపై వాళ్లు మాట్లాడారు.
Allu Arjun: అల్లు అర్జున్ వివాదం తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలనూ అసంతృప్తి గురి చేసినట్లు తాజాగా నిర్మాతలు సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ ను బట్టి స్పష్టమవుతోంది. ఆ వివాదం వల్లే సినిమా ఇండస్ట్రీ మొత్తం తలదించుకోవాల్సి వచ్చిందని వాళ్లు అనడం గమనార్హం. వాళ్లు కామెంట్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వివాదంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అల్లు అర్జున్ దే తప్పు అన్నట్లుగా వాళ్లు మాట్లాడారు.
ఇంట్లో ఎగురు.. బయట కాదు: సురేష్ బాబు
అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వివాదం, సినీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై నిర్మాత సురేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ విషయంలో పరోక్షంగా అతడు బన్నీకే క్లాస్ పీకినట్లు కామెంట్స్ చూస్తే స్పష్టమవుతోంది. "పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి. అది తెలిస్తే ఇలాంటివి జరగవు. అది అందరం తెలుసుకోవాలి.
పిల్లలకు కూడా నేర్పించాలి. ఈ సమస్య ప్రజలు సృష్టించింది కాదు. మన తీరు వల్లే ఇలా జరుగుతుంది. అందుకే అలాంటి ప్లేస్ లలో ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఇంట్లో ఎగురు, డ్యాన్స్ చెయ్.. ఏమైనా చెయ్. బయటకు వచ్చినప్పుడు కాస్త పద్ధతిగా ఉండాలి కదా" అని ఓ ఇంటర్వ్యూలో సురేష్ బాబు అంటున్న వీడియో ఎక్స్ లో వైరల్ గా మారింది.
ఒక్కడి వల్లే ఇండస్ట్రీ తలదించుకుంది: తమ్మారెడ్డి
అటు మరో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా అల్లు అర్జున్ వ్యవహారంలో మొదటి నుంచీ అతన్నే తప్పుబడుతున్నాడు. తాజాగా మరోసారి ఈ అంశంపై స్పందిస్తూ.. అతనొక్కడి వల్ల ఇండస్ట్రీ మొత్తం తలదించుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. "ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం వెళ్లి చీఫ్ మినిస్టర్ గారి దగ్గర తలవంచుకొని నిల్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది. ఒక మనిషి కోసం. ఆ వ్యక్తి ఈ తప్పు సొంతం చేశాడా? ఏం జరిగిందో తెలియదు.
మర్డర్ ఆయన చేశాడని నేను అనడం లేదు. ఆయన రోడ్ షో చేయడం లాంటివి తెలియకుండా ఆయన బాధ్యుడయ్యాడు. దానికి ఆయన ప్రేరేపితుడై చేశాడా సొంతంగా చేశాడా నాకు తెలియదు. ఏదైనా తప్పు తప్పే. ఈ తప్పు జరిగిన తర్వాత కూడా దానిని కవర్ చేయడానికి మళ్లీ కొన్ని అబద్ధాలు ఆడటం.. దీనివల్ల మొత్తానికి ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి ఇది ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి అక్కడికెళ్లి కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని రాజీ అంటామో, తలవంపులు అంటామో ఏమంటామో తెలియదు. ఒక మనిషి కోసం, ఒకరి అహం కోసం మనమందరం తలవంచాల్సి వస్తోంది" అని తమ్మారెడ్డి అనడం గమనార్హం.
పుష్ప 2 ప్రీమియర్ షో కోసం అల్లు అర్జున్ డిసెంబర్ 4న సంధ్య థియేటర్ కు వెళ్లడం, అక్కడ రేవతి అనే అభిమాని తొక్కిసలాటలో చనిపోవడం, దానికి అల్లు అర్జున్ చేసిన రోడ్ షోనే కారణమని పోలీసులు తేల్చడంతో ఈ వివాదం ముదిరింది. చివరికి ప్రభుత్వం వర్సెస్ సినిమా ఇండస్ట్రీ అనేంతలా పరిస్థితి మారిపోయింది. ఇదే అంశంపై చర్చించడానికి సినీ పెద్దలంతా దిల్ రాజు నేతృత్వంలో వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.