Hyper Adi on Allu Arjun: అల్లు అర్జున్‍పై ట్రోలింగ్ గురించి స్పందించిన హైపర్ ఆది
Hyper Adi on Allu Arjun: కొంతకాలంగా ఐకాన్ స్టార్ అర్జున్‍పై సోషల్ మీడియాలో కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. ఇది తీవ్రమవుతోంది. ఈ తరుణంలో కమెడియన్, పవన్ కల్యాణ్ వీరాభిమాని హైపర్ ఆది ఈ విషయంపై స్పందించారు.
జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్ హైపర్ ఆది చాలా పాపులర్ అయ్యారు. తన మార్క్ పంచ్‍లతో దుమ్మురేపారు. ఇటీవలి కాలంలో చాలా సినిమాల్లోనూ నటిస్తున్నారు. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‍కు హైపర్ ఆది వీరాభిమాని. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున ఆది ప్రచారం చేశారు. పవన్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో విస్తృతంగా తిరిగారు. ఎన్నికల ముందు వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడం వివాదాస్పదమైంది. అప్పటి నుంచి కొందరు మెగా అభిమానులు అల్లు అర్జున్‍ను ట్రోల్స్ చేస్తున్నారు. ఈ వివాదంపై నేడు (జూలై 23) స్పందించారు హైపర్ ఆది.
వాళ్లంతా ఒక్కటే.. ట్రోలింగ్ ఆపేయండి
అశ్విన్ బాబు హీరోగా నటించిన శివంభజే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍కు హైపర్ ఆది నేడు హాజరయ్యారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆది ఈ ఈవెంట్‍లో మాట్లాడారు. అయితే, అల్లు అర్జున్ గురించి చెప్పాలని అతడికి ప్రశ్న ఎదురైంది. దీంతో స్పందించారు. నేషనల్ అవార్డు సాధించిన అల్లు అర్జున్‍ను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని, ఆపేయాలని హైపర్ ఆది చెప్పారు.
పవన్ కల్యాణ్ సహా మెగా ఫ్యామిలీలో అలాంటి ఫీలింగ్ ఏమీ లేదని హైపర్ ఆది చెప్పారు. మెగా, అల్లు కుటుంబాలు ఎప్పుడూ ఒక్కటే అనేలా మాట్లాడారు. “అల్లు అర్జున్ ఒక నేషనల్ అవార్డు విన్నర్. ఆయన మీద ట్రోల్స్ చేసే వారికి చెబుతున్నా. కల్యాణ్ గారికి కానీ.. మెగా ఫ్యామిలీ వాళ్లకు కానీ.. ఎవరికి కూడా అలాంటి ఫీలింగ్ ఎప్పటికీ ఉండదు. వాళ్లంతా ఎప్పుడూ ఒక్కటే. అల్లు అర్జున్‍పై కావాలనే కొందరు ట్రోల్ చేయడం, థంబ్‍నైట్స్ చేయడం లాంటివి కొందరు చేస్తున్నారు. ఇక నుంచైనా వాటిని ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అని హైపర్ ఆది అన్నారు.
వివాదం ఏంటి?
ఈ ఏడాది ఏపీ ఎన్నికల పోలింగ్‍కు ముందు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి అల్లు అర్జున్ మద్దతు తెలిపారు. ఆయన ఇంటికి వెళ్లి సపోర్ట్ చేశారు. జనసేనాని, తన మామ పవన్ కల్యాణ్ వ్యతిరేకంగా పోరాడుతున్న వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దుతు తెలపడంపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అన్నట్టు యుద్ధం సాగుతోంది. అల్లు అర్జున్‍పై కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని, స్నేహం కోసమే తాను శిల్పా రవికి మద్దతు ఇచ్చానని అల్లు అర్జున్ చెప్పినా వివాదం సద్దుమణగలేదు. ఆ తర్వాత మెగా బ్రదర్ నాగబాబు చేసిన ఓ ట్వీట్ మరింత దుమారం రేపింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో కొందరు మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తూనే ఉంది. ఈ తరుణంలో ట్రోలింగ్ ఆపాలంటూ హైపర్ ఆది చెప్పారు.
శివంభజే గురించి..
శిభంభజే సినిమా సోషియో ఫ్యాంటసీ మిస్టరీ థ్రిల్లర్‌గా వస్తోంది. అశ్విన్‍బాబు హీరోగా నటించిన ఈ మూవీకి అప్సర్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 1వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది.