Allu Arjun: అల్లు అర్జున్ నా రోల్ మోడల్.. అతని నుంచి ఎంతో నేర్చుకున్నా: వైరల్ అవుతున్న సమంత కామెంట్స్
Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించింది సమంత. ఓ ఈవెంట్లో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. బన్నీయే తన రోల్ మోడల్ అని ఆమె చెప్పడం విశేషం.
Allu Arjun: అల్లు అర్జున్ పై సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన ఓ ఈవెంట్లో సమంత మాట్లాడింది. ఈ సందర్బంగా బన్నీపై సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అతడే తన రోల్ మోడల్ అని ఆమె అనడంతో అక్కడున్న స్టూడెంట్స్ అంతా పెద్దగా అరిచారు. సమంత ప్రస్తుతం బ్రేక్ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది.
అల్లు అర్జున్ నా రోల్ మోడల్: సమంత
తమిళనాడులోని వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన కల్చరల్ కార్నివాల్ కు సమంత వెళ్లింది. ఈ ప్రైవేట్ యూనివర్సిటీకి ముఖ్య అతిథిగా వెళ్లిన సమంత స్ఫూర్తిదాయక ప్రసంగం చేసింది. ఈ సందర్భంగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. "అల్లు అర్జున్ నా యాక్టింగ్ రోల్ మోడల్. అతడు ఓ పవర్ హౌజ్ పర్ఫార్మర్ గా మారాడు. అతని నుంచి నేర్చుకోవడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తాను" అని సమంత చెప్పింది.
అల్లు అర్జున్ యాక్టింగ్ లో ఓ బీస్ట్ గా మారాడని కూడా ఆమె పొగడ్తల వర్షం కురిపించింది. గతంలో ఈ ఇద్దరూ కలిసి సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో నటించిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఈ సినిమా వచ్చింది. ఇక బన్నీని పాన్ ఇండియా స్టార్ ను చేసిన పుష్ప ది రైజ్ మూవీలో ఊ అంటావా ఉఊ అంటావా మావా పాటలోనూ వీళ్లు నటించారు. అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి చేసినా.. పుష్పలోని ఈ పాటనే సమంత ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం.
నా ఛాలెంజింగ్ రోల్ ఇదే
ఇక తాను ఇప్పటి వరకూ పోషించిన పాత్రల్లో సవాలుతో కూడుకున్నది ఏది అన్న ప్రశ్నకు కూడా సమంత భిన్నంగా స్పందించింది. నిజ జీవితంలోని పాత్రను ఆమె ఎంచుకోవడం గమనార్హం. "అత్యంత సవాలుతో కూడుకున్న పాత్ర నా నిజ జీవితంలో పోషిస్తున్నదే. ఎందుకంటే దీనికి స్క్రిప్ట్ లేదు. ప్రతి రోజూ కొత్త సవాలును ఎదుర్కొంటూనే ఉంటాను. ప్రతి ఒక్కరూ ఇలాంటి సవాళ్లే ఎదుర్కొంటున్నారు. ఎవరికీ స్క్రిప్ట్ లేదు. అందుకే ఇది చాలా సవాలుతో కూడుకున్నది" అని సమంత చెప్పింది.
మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఖుషీ మూవీ పూర్తయిన తర్వాత ఆమె మరో సినిమా అంగీకరించలేదు. ఈ బ్రేక్ లో సామ్ తన వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించింది. వెకేషన్లను ఎంజాయ్ చేసింది. ఈ మధ్యే రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన సిటడెల్ వెబ్ సిరీస్ కోసం డబ్బింగ్ చెప్పింది.
అంతేకాదు ఓ సొంత హెల్త్ పాడ్‌కాస్ట్ ను కూడా సమంత ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ట్రాలాలా పేరుతో ప్రొడక్షన్ హౌజ్ ను కూడా ప్రారంభించింది. దీని కింద ఆమె సినిమాలను నిర్మించనుంది.
టాపిక్