Allu Arjun: ముగ్గురు కలిపి శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు: అల్లు అరవింద్.. ఆసుపత్రికి వెళ్లిన అల్లు అర్జున్ తండ్రి
Allu Aravind: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‍ను చూసేందుకు ఆసుపత్రికి వెళ్లారు అల్లు అరవింద్. శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు ప్రకటించారు. ఎవరెంత ఇవ్వనున్నారో తెలిపారు.
‘పుష్ప 2: ది రూల్’ సినిమా ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్‍ను చూసేందుకు, అతడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ నేడు (డిసెంబర్ 25) హైదరాబాద్‍లోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. బాలుడి పరిస్థితిని వైద్యులను, అతడి తండ్రి భాస్కర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి అందించనున్న ఆర్థిక సాయం గురించి చెప్పారు.
రూ.2కోట్లు
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లను అందించనున్నట్టు అల్లు అరవింద్ ప్రకటించారు. ఇందులో అల్లు అర్జున్ రూ.కోటి, దర్శకుడు సుకుమార్ రూ.50లక్షలు, మైత్రీ మూవీమేకర్స్ రూ.50లక్షలు అందించనున్నట్టు తెలిపారు. ఇలా ముగ్గురు కలిపి ఆ కుటుంబానికి రూ.2కోట్లు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‍మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‍డీసీ) చైర్మన్, నిర్మాత దిల్‍రాజుకు ఈ మొత్తాన్ని అందిస్తామని చెప్పారు. శ్రీతేజ్ కోలుకున్నాక అతడి భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఈ మొత్తాన్ని అందిస్తున్నట్టు అరవింద్ తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఇప్పటికే మృతురాలు రేవతి భర్త ప్రభాకర్‌కు చెక్ అందించారు.
శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కళ్లు తెరుస్తున్నాడని, కానీ తనను గుర్తు పట్టడం లేదని బాలుడి తండ్రి ప్రభాకర్ తాజాగా చెప్పారు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి అల్లు అర్జున్ టీమ్ ప్రతీ రోజూ అడుగుతోందని వివరించారు. అల్లు అర్జున్‍పై తాను కేసు వెనక్కి తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఇటీవలే రేవతి కుటుంబానికి రూ.25లక్షలు అందించారు.
అల్లు అర్జున్ విచారణ
పుష్ప 2 ప్రీమియర్ షో కోసం డిసెంబర్ 4న అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వెళ్లగా ఆ సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి కన్నుమూయగా.. ఆమె కుమారుడు శ్రీ తేజ్ గాయపడ్డాడు. ఈ కేసులో అల్లు అర్జున్ ఒక రోజు జైలులో కూడా ఉన్నారు. మధ్యంతర బెయిల్ రావడంతో బయటికి వచ్చారు. పోలీసుల నోటీసుల మేరకు అల్లు అర్జున్ మంగళవారం (డిసెంబర్ 24) చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‍కు కూడా వెళ్లారు. సుమారు మూడున్నర గంటల పాటు అల్లు అర్జున్‍ను పోలీసులు ప్రశ్నించారు. విచారణ సమయంలో తొక్కిసలాట వీడియోలు చూపిస్తున్న సమయంలో ఆయన ఎమోషనల్ అయ్యారని కూడా సమాచారం.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ తొక్కిసలాట జరిగేందుకు అల్లు అర్జునే కారణం అనేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో మాట్లాడారు. తొక్కిసలాట తర్వాత కూడా అల్లు అర్జున్ చేతులు ఊపుతూ ర్యాలీలా వెళ్లారని విమర్శించారు. దీనికి అల్లు అర్జున్ వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఇది ప్రమాదం మాత్రమేనని చెప్పారు. తనపై కొన్ని తప్పుడు ఆరోపణలు వస్తున్నాయని, ర్యాలీ చేయనే లేదని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఇంటిపై కొందరు ఓయూ జేఏసీ చెందిన వారు దాడి చేశారు. ఇంటిపై రాళ్లు రువ్వడంతో పాటు పూలకుండీలను పగులగొట్టారు. ఈ అంశంలోని పరిణామాలన్నీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. మరోవైపు పుష్ప 2: ది రూల్ చిత్రం రూ.1,600కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటి బిగ్గెస్ట్ బ్లాక్‍బస్టర్ అయింది. ఇంకా జోరుగా వసూళ్లను రాబడుతోంది.
సంబంధిత కథనం