Allu Arjun Pushpa 2 Shirt: పుష్ప అంటే ఫ్లవర్ కాదు.. వైల్డ్ ఫైర్.. అరెస్ట్ సమయంలోనూ పుష్ప 2 షర్ట్‌లో అల్లు అర్జున్
Allu Arjun Pushpa 2 Shirt: అల్లు అర్జున్ తనను అరెస్ట్ చేసే సమయంలో పుష్ప 2 షర్ట్ వేసుకోవడాన్ని అభిమానులు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. అలాంటి సమయంలోనూ బన్నీ తన మూవీని ప్రమోట్ చేసుకుంటున్నాడా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
Allu Arjun Pushpa 2 Shirt: అల్లు అర్జున్ అరెస్ట్ వార్త శుక్రవారం (డిసెంబర్ 13) తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచింది. పుష్ప 2 మూవీ ప్రీమియర్ సందర్భంగా సంధ్య 70 ఎంఎం థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో అభిమాని మరణానికి సంబంధించిన కేసులో అతన్ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్ట్ సందర్భంగా బన్నీ.. పుష్ప 2 షర్ట్ వేసుకొని ఉండటం విశేషం.
పుష్ప 2 షర్ట్‌లో అల్లు అర్జున్
నిజానికి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడానికి శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అతని ఇంటికి వెళ్లారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. తనకు కనీసం బట్టలు మార్చుకునేందుకు కూడా టైమ్ ఇవ్వలేదని, బెడ్‌రూమ్ లోకి వచ్చేశారని అల్లు అర్జున్ అనడం గమనార్హం. మొదట అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్న సమయంలో అతడు షార్ట్, టీషర్ట్ వేసుకొని కనిపించాడు.
లిఫ్ట్ ఎక్కే సమయంలోనూ అలాగే ఉన్నాడు. అయితే తర్వాత కాసేపటికి తన ఇంటి సెల్లార్ లో తన భార్య స్నేహ, తమ్ముడు శిరీష్, తండ్రి అల్లు అరవింద్ లతో కలిసి కాఫీ తాగుతూ కనిపించాడు. ఆ సమయంలో అతని ఒంటిపైకి పుష్ప 2 మూవీ ప్రమోషన్ల సమయంలో వేసుకున్న షర్ట్ వచ్చింది. ఆ సమయంలోనే తనకు కనీసం బట్టలు మార్చుకునే టైమ్ కూడా ఇవ్వరా అంటూ పోలీసులపై బన్నీ అసహనం వ్యక్తం చేయడం కనిపించింది. ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
భార్యకు ధైర్యం చెప్పి..
అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో అతని భార్య స్నేహారెడ్డికి అతడు ధైర్యం చెప్పాడు. అప్పుడే డల్లయిపోయావేంటి.. ఏం కాదంటూ ఆమెకు ధైర్యం నూరి పోశాడు. అంతేకాదు ఆమెకు ఓ ముద్దు కూడా పెట్టాడు. అటు పోలీసు అధికారితో మాట్లాడుతూ.. “సర్.. నేను మీకు హానర్ చేయను. మీరు నన్ను తీసుకెళ్లడంలో తప్పులేదు. కానీ కనీసం బట్టలు మార్చుకునే టైమ్ ఇవ్వలేదు.
మరీ బెడ్ రూమ్ దగ్గరకు వచ్చి.. టైమ్ కూడా ఇవ్వకుండా తీసుకెళ్లడం అది మరీ టూమచ్. ఇది మీకు తప్పని చెబుతున్నా. అది తప్పే” అని అన్నాడు. ఇక తనతోపాటు పోలీస్ స్టేషన్ కు వస్తున్న తండ్రి అల్లు అరవింద్ ను వారిస్తూ.. ఈ విషయంలో నెగటివ్ క్రెడిట్ అయినా, పాజిటివ్ అయినా తనకే దక్కాలని, మీరు రావద్దని అంటూ పోలీసు జీపు ఎక్కాడు.
అరెస్టులోనూ ప్రమోషనా?
అయితే ఈ వీడియో, ఫొటోలు వైరల్ కావడంతో అల్లు అర్జున్ తన అరెస్టు సమయంలోనూ పుష్ప 2 మూవీని ప్రమోట్ చేస్తున్నాడా అంటూ కొందరు అభిమానులు ప్రశ్నించారు. అరెస్టుకు ముందు బన్నీకి బట్టలు మార్చుకోవడానికి పోలీసులు సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది. అప్పుడే అతడు పుష్ప 2 మెర్చండైజ్ లో కనిపించాడు. అయితే అతడు కావాలనే ఇలా ఆ మూవీ డ్రెస్ వేసుకున్నాడా లేక అనుకోకుండా అలా జరిగిపోయిందా అన్నది తెలియలేదు.
శుక్రవారం అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసినట్లు కమిషనర్ సీవీ ఆనంద్ కూడా కన్ఫమ్ చేశారు. దీంతో బన్నీ వెంటనే హైకోర్టును ఆశ్రయించాడు. శని, ఆదివారాలు ఉండటంతో ఇప్పుడు బెయిల్ రాకపోతే అతడు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో హుటాహుటిన హైకోర్టు గడప తొక్కాడు. పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కాగా.. ఒక రోజు ముందు రాత్రి సంధ్య థియేటర్లో వేసిన ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ వెళ్లాడు. అతన్ని చూడటానికి అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. అందులో రేవతి అనే అభిమాని మరణించింది.
ఆమె మరణంపై ఒక రోజు తర్వాత అతడు స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఆమె కుటుంబానికి అండగా ఉంటామంటూ రూ.25 లక్షలు కూడా అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత పుష్ప 2 సక్సెస్ మీట్ లో క్షమాపణ కూడా చెప్పాడు. అయితే అప్పటికే బాధిత కుటుంబం చేసిన ఫిర్యాదుతో అల్లు అర్జున్ తోపాటు థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలోనే ముగ్గురిని అరెస్ట్ చేయగా.. తాజాగా అల్లు అర్జున్ ను కూడా అరెస్ట్ చేశారు.