Allu Arjun: హిస్టరీ క్రియేట్ చేసిన అల్లు అర్జున్‍.. ఎమోషనల్ అయిన సుకుమార్: వీడియో.. బావ అంటూ ఎన్టీఆర్ ట్వీట్-allu arjun creates history as first actor from telugu movie industry to win best actor national award greeting from all ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun: హిస్టరీ క్రియేట్ చేసిన అల్లు అర్జున్‍.. ఎమోషనల్ అయిన సుకుమార్: వీడియో.. బావ అంటూ ఎన్టీఆర్ ట్వీట్

Allu Arjun: హిస్టరీ క్రియేట్ చేసిన అల్లు అర్జున్‍.. ఎమోషనల్ అయిన సుకుమార్: వీడియో.. బావ అంటూ ఎన్టీఆర్ ట్వీట్

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 24, 2023 08:00 PM IST

Best actor Award for Allu Arjun: 2021కు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ‘పుష్ప: ది రైజ్’ సినిమాకు ఈ పురస్కారం దక్కించుకున్నాడు.

అల్లు అర్జున్‍ను హత్తుకున్న డైరెక్టర్ సుకుమార్
అల్లు అర్జున్‍ను హత్తుకున్న డైరెక్టర్ సుకుమార్

Best actor Award for Allu Arjun: 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో (69th National Film Awards) తెలుగు సినిమాలు దుమ్మురేపాయి. పుష్ప: ది రైజ్ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పురస్కారాన్ని దక్కించుకున్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు దక్కించుకున్న తొలి నటుడిగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు. దీంతో పుష్ప టీమ్‍తో పాటు తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. హిస్టరీ క్రియేట్ చేసిన అల్లు అర్జున్‍కు అభినందనలు తెలుపుతున్నారు. 2021కు గాను జాతీయ చలనచిత్ర అవార్డులను నేడు (ఆగస్టు 24) ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. పుష్ప సినిమాకు సంగీతం అందించిన దేవీ శ్రీ ప్రసాద్‍కు కూడా జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా (పాటలు) అవార్డు దక్కింది. దీంతో పుష్ప టీమ్ సెలెబ్రేట్ చేసుకుంది. అల్లు అర్జున్‍కు కంగ్రాట్స్ చెబుతూ సినీ ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్నారు. ఆ వివరాలివే..

జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‍కు అవార్డు వచ్చిందనే ప్రకటన రాగానే అతడి ఇంటి వద్ద సంబరాలు జరిగాయి. పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్.. అల్లు అర్జున్‍ను గట్టిగా కౌగిలించుకున్నారు. ఎమోషనల్ అయి.. చాలా సేపు అలానే ఉన్నారు. ఈ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ కూడా హర్షం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పట్టరాని సంతోషం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్‍కు ఈ అవార్డు రావడం గర్వంగా ఉందని అరవింద్ అన్నారు. అల్లు అర్జున్ ఇంట్లో పుష్ప టీమ్ సంబరాలు చేసుకున్న వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది.

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది నటులు, సాంకేతిక నిపుణులు.. అల్లు అర్జున్‍కు ట్వీట్ల ద్వారా అభినందనలు తెలుపుతున్నారు. “కంగ్రాచులేషన్స్ అల్లు అల్జున్ బావ. పుష్ప మూవీ కోసం నీవు అన్ని విజయాలకు, అవార్డులకు అర్హుడవు” అని స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ తమకు గర్వకారణమని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇలా అనేక మంది అల్లు అర్జున్‍కు కంగ్రాచులేషన్స్ చెబుతున్నారు.

అల్లు అర్జున్ అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల డ్యాన్సులు చేస్తూ, కేక్‍లు కట్ చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఫేవరెట్ ఐకాన్ స్టార్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు.

ఇక, 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలకు మొత్తంగా పది పురస్కారాలు దక్కాయి. గ్లోబల్ హిట్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆరు అవార్డులు కైవసం అయ్యాయి.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం