Allu Arjun@22: 22 ఏళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్న అల్లు అర్జున్.. స్టైలిష్ స్టార్ టు ఐకాన్ స్టార్ ప్రయాణం!-allu arjun completes 22 years of journey in indian cinema by gangotri release stylish star to icon star national award ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun@22: 22 ఏళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్న అల్లు అర్జున్.. స్టైలిష్ స్టార్ టు ఐకాన్ స్టార్ ప్రయాణం!

Allu Arjun@22: 22 ఏళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్న అల్లు అర్జున్.. స్టైలిష్ స్టార్ టు ఐకాన్ స్టార్ ప్రయాణం!

Sanjiv Kumar HT Telugu

Allu Arjun Completes 22 Years Journey In Indian Cinema: అల్లు అర్జున్ 22 ఏళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. హీరోగా గంగోత్రి మూవీ నుంచి పుష్ప 2 ది రూల్ వరకు బన్నీ సినీ ప్రయాణం కొనసాగింది. ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ అనే బిరుదు నుంచి ఐకాన్ స్టార్ వరకు పేరు తెచ్చుకున్నారు.

22 ఏళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్న అల్లు అర్జున్.. స్టైలిష్ స్టార్ టు ఐకాన్ స్టార్ ప్రయాణం!

Allu Arjun Completes 22 Years Journey In Indian Cinema: మెగా కాంపౌండ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో అల్లు అర్జున్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి డాడీ సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిసిన అల్లు అర్జున్ గంగోత్రి మూవీతో హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు.

స్పెషల్ ఇమేజ్

రాఘవేంద్ర రావు 100వ సినిమాగా, అల్లు అర్జున్ డెబ్యూగా వచ్చిన గంగోత్రితో మొదటి మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఆర్య మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని స్టైలిష్ స్టార్‌గా ఎదిగారు అల్లు అర్జున్.

స్టైలిష్ స్టార్ నుంచి ఈ రోజు ఐకాన్‌స్టార్‌ అనే కిరీటం, ప్రపంచస్థాయి గుర్తింపు, ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డు సైతం అందుకున్నారు అల్లు అర్జున్. అయితే, ఇవన్నీ రాత్రికి రాత్రే వరించలేదు. దీని వెనుక 22 ఏళ్ల పట్టుదల, ఆత్మవిశ్వాసం, అనుకున్నది సాధించాలనే తపన అతన్ని కార్యోన్ముఖుడిని చేసింది.

22 ఏళ్లు పూర్తి

'గంగోత్రి' సమయంలో ఆయన ఓ సాధారణ హీరో.. ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపు, భారతదేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న హీరోల్లో ఒకరిగా నిలిచారు. ఇక 'పుష్ప-2- చిత్రంతో భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన తొలిచిత్రంగా సరికొత్త రికార్డును నెలకొల్పి విజయపథంలో దూసుకెళ్లిన ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ తొలి చిత్రం 'గంగోత్రి' విడుదలై నేటికి 22 ఏళ్లు పూర్తి చేసుకుంది.

అంటే నటుడిగా ఐకాన్‌ స్టార్‌ 22 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. గంగోత్రి సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన అల్లు అర్జున్‌, తనపై వచ్చిన విమర్శలను సవాల్‌గా తీసుకున్నారు. మలిచిత్రం 'ఆర్య'లో తన మేకోవర్‌తో అందర్ని ఆశ్చర్యపరిచాడు. ఆ చిత్రంలో వన్‌సైడ్ లవర్‌ ఆర్యగా ఆయన నటనకు వచ్చిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. ఇక ఈ చిత్రమే ఆయన కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌ నిలిచింది.

ఇక సినిమా సినిమాకు ఇంతింతయు, నటుడింతయి అన్న చందాన తన స్టార్‌డమ్‌ను పెంచుకుంటూ ఎవరూ ఊహించని ఉన్నతస్థానంలో నిలిచాడు. ఈ రోజు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ అంటే క్రేజీ పాన్ ఇండియా స్టార్‌, ఆయన డేట్స్‌ కోసం బాలీవుడ్‌లో కూడా ప్రముఖ నిర్మాణ సంస్థలు, దర్శకులు వెయిట్‌ చేస్తున్నారంటే ఆయన క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

వివిధ పాత్రలు

ఇక అల్లు అర్జున్‌ ఆర్య-2, పరుగు, బన్నీ,హ్యపీ, వంటి కమర్షియల్‌ సినిమాల మధ్యలో 'వేదం' వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌ సినిమాలో నటించి యాక్టర్‌గా మరో మెట్టు ఎదిగాడు. గోన గన్నారెడ్డి వంటి చరిత్ర యోధుడి పాత్రలో నటించి ఇలాంటి పాత్రలు కూడా తాను చేయగలనని నిరూపించుకున్నాడు. అంతేకాదు తెలుగు సినీ పరిశ్రమలో మొట్టమొదటి సారి సిక్స్‌ ప్యాక్‌ బాడీ చూపించిన హీరోగా 'దేశ ముదురు'లో కనిపించి అందరిని సంభ్రమశ్చర్యాలకు గురిచేశాడు.

అప్పట్లో ఆయన సిక్స్‌ ప్యాక్‌ హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. డీజే దువ్వాడ జగన్నాథం, బద్రీనాథ్‌ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలో మెప్పించి అల్లు అర్జున్‌ ఏ సినిమా చేసిన ఆ పాత్రలోకి ఒదిగిపోయేవాడు. ఇద్దరమ్మయిలతో, నా పేరు సూర్య వంటి చిత్రాలతో మెప్పించిన ఈ ఐకాన్‌స్టార్‌ సరైనోడు, రేసుగుర్రం చిత్రాలతో కమర్షియల్‌ చిత్రాల పవర్‌ ఏమిటో నిరూపించాడు.

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఆయన నటించిన జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి, అల వైకుంఠపురం చిత్రాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించిన మొదటి రెండు చిత్రాలు కమర్షియల్‌గా మంచి విజయాలు సాధించడమే కాకుండా, నటుడిగా ఆయన స్థాయిని పెంచాయి. అల వైకుంఠపురం చిత్రాన్ని పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా అన్ని వర్గాల వారిని అలరించడమే కాకుండా వసూళ్లలో తెలుగు సినిమా చరిత్ర రికార్డును తిరగరాసింది.

పుష్ప రాజ్‌గా

ఆర్య చిత్రంతో ఆయన కెరీర్‌ను టర్న్‌ చేసిన దర్శకుడు సుకుమార్‌, అల్లు అర్జున్‌ను పుష్ప చిత్రంలో పుష్ప రాజ్‌గా ఓ చరిత్రను తిరగరాసే పాత్రను సృష్టించాడు. ఆ పాత్రలో ఆయన నటించిన విధానంతో ఇండియా లెవల్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్‌ అభిమానులు సంపాందించుకున్నాడు.

పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రంలో తన నటనకు ఉత్తమ నటుడిగా అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ జాతీయ అవార్డను అందుకున్నాడు. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకు దక్కని గౌరవం దక్కించుకున్నాడు.

అత్యధిక వసూళ్లు

ఇక ఇటీవల పుష్ప 2లో ఆయన నటనకు ప్రపంచమంతా ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 రికార్డులు సాధించింది.

అంతేకాదు భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇలా తన నట ప్రస్థానంలో తిరుగులేని రాజుగా పుష్ప రాజ్ నిలిచాడు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం