Allu Arjun Vote: అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నాడా? నంద్యాలో వైఎస్సార్సీపీ అభ్యర్థికి మద్దతుపై ఇదీ అతని సమాధానం
Allu Arjun Vote: అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నాడా? నంద్యాల వెళ్లి అక్కడి వైఎస్సార్సీపీ అభ్యర్థి అయిన రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ఇవ్వడం వెనుక కారణమేంటి? దీనికి అతడే సమాధానం ఇచ్చాడు.
Allu Arjun Vote: అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతివ్వడంపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతున్న విషయం తెలిసిందే. తన మామ పవన్ కల్యాణ్ కూటమి తరఫున నిలబడగా.. బన్నీ మాత్రం ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి వైపు వెళ్లడమేంటన్న చర్చ మొదలైంది. దీనిపై అల్లు అర్జున్ స్పందించాడు. సోమవారం (మే 13) జూబ్లీహిల్స్ లో ఓటేసిన తర్వాత అతడు ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.
అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడంపై ఏమన్నాడంటే?
సోమవారం (మే 13) ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ.. తెలంగాణాలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సినీ నటుడు అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లో ఓటు వేశాడు. అతడు బయటకు రాగానే మీడియా అన్ని చుట్టుముట్టింది. ముఖ్యంగా అతడు నంద్యాల వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతివ్వడంపై జరుగుతున్న చర్చ గురించి మీడియా ప్రస్తావించింది.
దీనిపై అల్లు అర్జున్ స్పందించాడు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, తన స్నేహితులు ఏ పార్టీలో ఉన్నా వారికి మద్దతిస్తానని స్పష్టం చేశాడు. "నాకు అధికారికంగా ఏ పార్టీతో సంబంధం లేదు. అన్ని పార్టీలకు దూరంగా ఉన్నాను. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా వారికి నా సపోర్ట్ ఇస్తాను. మా అంకుల్ పవన్ కల్యాణ్ గారు కావచ్చు, నంద్యాలలో నా ఫ్రెండ్ రవిగారు కావచ్చు, మా మామయ్య చంద్రశేఖర్ రెడ్డిగారు కావచ్చు.. బన్నీ వాస్ గారు కూడా కావచ్చు. పార్టీతో సంబంధం లేకుండా మద్దతిస్తాను" అని అల్లు అర్జున్ స్పష్టం చేశాడు.
రాజకీయాల్లోకి అల్లు అర్జున్?
మీరు రాజకీయాల్లోకి వస్తారా అని అల్లు అర్జున్ ను అడిగితే.. సింపుల్ గా నవ్వుతూ నో అని చెప్పేశాడు. ముఖ్యంగా తను నంద్యాల వెళ్లడంపై జరుగుతున్న చర్చకు అల్లు అర్జున్ ప్రత్యేకంగా మరో వివరణ ఇవ్వడం గమనార్హం. రవిచంద్ర తనకు స్నేహితుడని, తాను ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా మద్దతిస్తానని ఎప్పుడూ చెబుతుండేవాడనని అన్నాడు.
"రవిచంద్ర నాకు 15 ఏళ్లుగా నాకు మంచి స్నేహితుడు. ఆయనతో నేను ఎప్పుడూ ఒక మాట అంటుండే వాడిని. బ్రదర్.. మీరు ఎప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చినా నేను మద్దతిస్తానని చెప్పాను. 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత నేను వెళ్లలేకపోయాను. అప్పుడు ట్వీట్ మాత్రం చేశాను. అప్పటి నుంచీ నేను మాట ఇచ్చాను వెళ్లాలి అని అనుకుంటేనే ఉన్నాను. ఈసారి ఎన్నికల్లో నిలబడుతున్నాడని తెలియగానే నేను ఫోన్ చేసి మరీ వస్తున్నానని చెప్పాను" అని అల్లు అర్జున్ వెల్లడించాడు.
ఈసారి ఏపీ ఎన్నికల్లో అల్లు అర్జున్ మామ పవన్ కల్యాణ్ జనసేన తరఫున పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా పవన్ ఉన్నాడు. అతనికి మెగా ఫ్యామిలీ మొత్తం మద్దతిచ్చింది. ఈ సందర్భంలో ఇటు నంద్యాలలో మాత్రం ప్రత్యర్థి వైఎస్సార్సీపీకి అల్లు అర్జున్ మద్దతివ్వడం పెద్ద చర్చకు కారణమైంది.
టాపిక్