Allu Arjun: పుష్ప 2 ప్రీమియర్ వద్ద రేవతి మృతిపై స్పందించిన అల్లు అర్జున్.. ఆర్థిక సాయం కూడా ప్రకటన
Pushpa 2: పుష్ప 2 ప్రీమియర్ చూసేందుకు అల్లు అర్జున్ సడన్‌గా సంధ్య థియేటర్ వద్దకి బుధవారం రాత్రి వచ్చారు. దాంతో అప్పటికే అక్కడ ఉన్న అభిమానులు ఒక్కసారిగా అల్లు అర్జున్‌ను చూసేందుకు ఎగబడ్డారు. దాంతో..?
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందడంపై హీరో అల్లు అర్జున్ స్పందించారు. పుష్ప 2 ప్రీమియర్ చూడటానికి తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి థియేటర్ వద్దకు బుధవారం రాత్రి రేవతి వచ్చారు. అయితే.. ఈ థియేటర్‌కు ముందస్తు సమాచారం లేకుండా అల్లు అర్జున్ కూడా మూవీని చూసేందుకు వచ్చారు. దాంతో అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడగా.. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
20 ఏళ్లుగా ఎప్పుడూ ఇలా జరగలే
రేవతి మృతిపై సంతాపం తెలియజేస్తూ ఎక్స్ వేదికగా అల్లు అర్జున్ ఒక వీడియోను షేర్ చేశారు. అందులో.. ‘‘అందరికీ నమస్కారం.. పుష్ప 2 సినిమా ప్రీమియర్‌ని చూసేందుకు ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌కి వెళ్లాం. క్రౌడ్ ఎక్కువగా వచ్చింది. సినిమా చూసి వచ్చేశాక.. మరుసటి రోజు మాకు తెలిసింది ఏంటంటే.. ప్రీమియర్ చూసేందుకు వచ్చిన ఒక ఫ్యామిలీకి దెబ్బలు తగిలాయని.. ముఖ్యంగా ఇద్దరు పిల్లలున్న రేవతి గారు దురదృష్టవశాత్తు చనిపోయారని తెలిసింది. ఆ విషయం తెలిశాక పుష్ప 2 టీమ్ మొత్తం చాలా బాధపడ్డాం. గత 20 ఏళ్లుగా మేము థియేటర్‌కి వెళ్లి సినిమాలు చూడటం ఆనవాయితీగా వస్తోంది. కానీ.. ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు. కానీ.. మొన్న సడన్‌గా ఇలా జరిగే సరికి చాలా బాధపడ్డాం’’ అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.
లోటు తీర్చలేం.. కానీ?
‘‘రేవతి గారు మృతి చెందిన వార్త తెలియగానే.. మేము పుష్ప 2 సెలబ్రేషన్స్‌లో యాక్టీవ్‌గా పాల్గొనలేకపోయాం. మేము సినిమాలు తీసేదే.. ప్రేక్షకులు థియేటర్లకి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటిది థియేటర్ వద్ద ఇలా జరగడం చాలా బాధించింది. రేవతి గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మేము ఏం చేసినా.. రేవతి గారు లేని లోటుని ఆ ఫ్యామిలీకి తీర్చలేం. కానీ.. ఆ ఫ్యామిలీకి అండగా ఉంటాం. నా తరఫున రేవతి గారి కుటుంబానికి రూ.25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటిస్తున్నా. ఆమె కొడుకు ఆసుపత్రి ఖర్చులు కూడా మేమే భరిస్తాం’’ అని అల్లు అర్జున్ స్పష్టం చేశారు.
‘‘మేమంతా సినిమాలు చేసేది.. మీరు ఫ్యామిలీతో థియేటర్‌కి వచ్చి ఎంజాయ్ చేసి.. సెలెబ్రేషన్స్‌తో ఇంటికి పంపిద్దామని. కానీ.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతాయి. అందరూ థియేటర్‌కి వెళ్లి సినిమా చూడండి.. జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి. థ్యాంక్యూ’’ అని అల్లు అర్జున్ ముగించారు.