Bachhala Malli: డిఫరెంట్ జోనర్‌లో హనుమాన్ హీరోయిన్ సినిమా బచ్చల మల్లి.. సరికొత్త కథ: నిర్మాత
Bachhala Malli Producer Rajesh Danda: అల్లరి నరేష్, హనుమాన్ హీరోయిన్ అమృత అయ్యర్ నటిస్తున్న సినిమా బచ్చల మల్లి. ఈ మూవీ డిఫరెంట్ జోనర్‌లో సరికొత్తతో ఉంటుందని సినిమా నిర్మాత రాజేష్ దండా ఆసక్తికర విషయాలు చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Allari Naresh Amritha Aiyer Bachhala Malli: అల్లరి నరేష్ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బచ్చల మల్లి. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. మార్చి 19న ఆయన పుట్టిన రోజు సందర్భంగా బచ్చలమల్లి సినిమాతోపాటు సందీప్ కిషన్, అల్లరి నరేష్ సినిమాల గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. పంపిణీదారుని కంటే నిర్మాతగా ప్రయాణం బాగుందనీ, నచ్చిన కథతో ప్రయాణం చేసే వెసులుబాటు నిర్మాతగా ఉందని ఆయన అన్నారు.
ఈసారి బర్డ్ డే గిఫ్ట్‌గా ఏం చేయబోతున్నారు?
స్వామిరారా చిత్రంతో పంపిణీదారునిగా మొదలై దాదాపు 82 సినిమాలను విడుదల చేశా. ఒక్క క్షణం, నాంది సినిమాలకు సహ నిర్మాతగా పనిచేశా. అనిల్ సుంకరతో ప్రయాణం సాగిస్తూ ఊరి పేరు భైరవకోన, సామజవరగమన వంటి సినిమాలను నిర్మించా. అవి హిట్ కావడంతో ఈ బర్త్ డే గిఫ్ట్‌గా మరో కొన్నిసినిమాలు సిద్ధం చేసుకున్నా.
మీ బ్యానర్‌లో స్వంతంగా సినిమా చేస్తున్నారే?
నేను ఇంతకుముందు కూడా చేసినవి స్వంత బ్యానర్‌లోనే. నాకు ఇష్టమైన వారితో నా బ్యానర్‌లో చేయడం నాకు చాలా హ్యాపీ. నాంది సినిమా నా జోనర్ సినిమా. బచ్చల మల్లి కూడా నా జోనర్ సినిమా. ఇలా నాకు ఇష్టమైన కథలతో, మనుషులతో చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. దీనికి సుబ్బు దర్శకుడు.
బచ్చల మల్లి ఎలాంటి కథ. సీరియస్‌గా ఉంటుందా?
బచ్చల మల్లి 90 దశకంలోని కథ. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కథ ప్రకారం సహజమైన లొకేషన్లలో తీయాలని అన్నవరం, తుని చుట్టు పక్కల విలేజ్‌లలో షూటింగ్ చేస్తున్నాం. మే 10 నుంచి సాగే సింగిల్ షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేస్తాం. ఇది ఒక డిఫరెంట్ జోనర్ మూవీ.
మీరు స్పీడ్‌గా చేయడం శాటిటైల్ బిజినెస్ కూడా పొందడం మీకెలా అనిపిస్తుంది?
ఇక్కడ ఒక్కటే కొలమానం. సినిమాలు బాగా ఆడుతున్నాయి కనుక బిజినెస్ జరుగుతుంది. ఇంతకంటే పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతలు అనే తేడా లేదు. ఒకరకంగా పంపిణీదారునిగా ఉన్న అనుభవం చాలా వరకు ఉపయోగపడుతుంది. కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే కొత్తగా ఉండే పాయింట్‌తో వెళ్లాలన్నదే నా పాలసీ. అలాంటి కథలతోనే భైరవ కోన, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, సామజవరగమన వంటి సినిమాలు తీయగలిగాను.
అల్లరి నరేష్, సందీప్ కిషన్ వీరితోనే సినిమాలు చేస్తారా? వేరే హీరోతో చేయరా?
అదేం లేదు. రన్నింగ్‌లో ఉన్న హీరోలతో కంపర్టబుల్‌గా ఉంటుంది. పైగా నేను పంపిణీదారుడిగా ఉన్నప్పటినుంచి వారు నన్ను నమ్మారు. వారితో జర్నీ చాలా హ్యాపీగా ఉంది. అలా అని బయట హీరోతో చేయను అని చెప్పను. త్వరలో బయట హీరోతో చేయబోతున్నా. నాకు కమర్షియల్ సినిమా అంటే ఇష్టం. అందులో నాకు యాక్షన్ సినిమాలంటే మరీ ఇష్టం. అవి నా సినిమాలో ఉండేలా చూసుకుంటాను. అది కూడా కథ ప్రకారం ఉండాలి.
హాస్య మూవీస్‌కు ప్రత్యేకతగా మీరు ఏం చేయబోతున్నారు?
హాస్య మూవీస్‌తో అన్ని మంచి సినిమాలు కొత్త కథలు తీయడమే ప్రత్యేకత. పలు పెద్ద సంస్థలు తీసినట్లే మా బ్యానర్‌లో మంచి కథాంశాలు, కొత్త కథలు తీయాలనుకుంటున్నాం. ఇప్పటివరకు తీసినవి అలాంటికొత్త కథలే. రేపు దర్శకుడు త్రినాథ్‌తో తీయబోయే సినిమా కూడా భిన్నమైన కథతో ఉంటుంది. అల్లరి నరేష్ సినిమా యాభై శాతం పూర్తయింది. తదుపరి సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం సినిమాలు ఉన్నాయి.