Heart of Stone: ఆలియా భట్ తొలి హాలీవుడ్ మూవీ ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ ట్రైలర్ రిలీజ్.. తెలుగులోనూ! నేరుగా ఓటీటీలోకే సినిమా-alia bhatt first hollywood movie heart of stone trailer released film set to premiere on netflix on august 11 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Alia Bhatt First Hollywood Movie Heart Of Stone Trailer Released Film Set To Premiere On Netflix On August 11

Heart of Stone: ఆలియా భట్ తొలి హాలీవుడ్ మూవీ ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ ట్రైలర్ రిలీజ్.. తెలుగులోనూ! నేరుగా ఓటీటీలోకే సినిమా

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 18, 2023 05:50 PM IST

Heart of Stone: ఆలియా భట్ నటిస్తున్న హాలీవుడ్ చిత్రం హార్ట్ ఆఫ్ స్టోన్ ట్రైలర్ విడుదలైంది. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.

ఆలియా భట్ (Photo: Netflix)
ఆలియా భట్ (Photo: Netflix)

Heart of Stone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్.. తొలిసారి ఓ హాలీవుడ్‍లో చిత్రం చేస్తోంది. హార్ట్ ఆఫ్ స్టోన్ అనే సినిమాలో నటిస్తోంది. ఆలియా ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తుండడం ఆసక్తికరమైన అంశంగా ఉంది. కాగా, హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమా ట్రైలర్ నేడు విడుదలైంది. ఈ ట్రైలర్‌లో ఆలియా భట్ కనిపించేది తక్కువసేపే అయినా.. యాక్షన్ లుక్‍తో ఆకట్టుకుంది. వివరాలివే..

హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమాకు టామ్ హార్పర్ దర్శకత్వం వహించాడు. గ్రెగ్ రుకా, అలీసన్ స్క్రోడెర్ కథను అందించారు. ఆలియా ఈ సినిమాలో విలన్‍గా నటించగా.. గాల్ గాడోట్, జామీ డోర్నాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ట్రైలర్.. సావో పాలోలోని నెట్‍ఫ్లిక్స్ యాన్యువల్ టాడెమ్ ఈవెంట్‍లో లాంచ్ అయింది. హార్ట్ ఆఫ్ స్టోన్ మూవీ తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులోకి రానుంది. తెలుగు ట్రైలర్ కూడా విడుదలైంది.

ట్రైలర్‌ను బట్టి చూస్తే.. చార్టర్ సీక్రెట్ ఏజెన్సీని ముందుకు నడిపిస్తుంటుంది గాల్ గాడోట్ (పాత్ర పేరు రేచల్ స్టోన్). ప్రపంచాన్ని ప్రమాదాల నుంచి ఆమె టీమ్ రక్షిస్తుంటుంది. అయితే, గాల్ గాడోట్ ప్రయత్నాలను విలన్ పాత్ర పోషించిన ఆలియా భట్ (పాత్ర పేరు కేయా ధావన్).. వారి టీమ్ అడ్డుకుంటూ ఉంటుంది. చివరికి ఏమైందన్నదే ఈ సినిమాగా ఉండనుంది. ఈ ట్రైలర్‌లో ఆలియాకు స్క్రీన్ టైమ్ తక్కువగానే ఉన్నా.. కనిపించినంత సేపు ఆకట్టుకుంది. మూవీలో ఆలియా పాత్ర ఎక్కువగానే ఉండే ఛాన్స్ ఉంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోంది.

హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమా నేరుగా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనే విడుదల కానుంది. ఆగస్టు 11న నెట్‍ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ ట్రైలర్‌ను తన ఇన్‍స్టాగ్రామ్ ఖాతాలోనూ ఆలియా పోస్ట్ చేసింది. ఆగస్టు 11 అని క్యాప్షన్ పెట్టింది. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం భాషల్లో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది.

కాగా, ఆలియా భట్ ప్రస్తుతం బాలీవుడ్‍లో రెండు మూవీలు చేస్తోంది. రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ, జీ లే జరా సినిమాల్లో హీరోయిన్‍గా నటిస్తోంది. రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ చిత్రానికి కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తుండగా.. రణ్‍వీర్ సింగ్ హీరోగా ఉన్నాడు.

IPL_Entry_Point