Alia Bhatt: తెలుగులోనూ రానున్న ఆలియా భట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. హక్కులను ఎవరు తీసుకున్నారంటే..
Alia Bhatt: ఆలియా భట్ లీడ్ రోల్ చేసిన జిగ్రా చిత్రం తెలుగు డబ్బింగ్‍లోనూ రిలీజ్ కానుంది. ఈ విషయంపై నేడు అప్‍డేట్ వచ్చింది. తెలుగు థియేట్రికల్ హక్కులను ఓ డిస్ట్రిబ్యూషన్ హౌస్ తీసుకుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్‍కు దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. అయితే, గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తెలుగులో ఆమె మరింత ఫేమస్ అయ్యారు. కాగా, ఆలియా భట్ ప్రధాన పాత్ర పోషించిన ‘జిగ్రా’ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 11వ తేదీన రిలీజ్ కానుంది. ఈ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం తెలుగు డబ్బింగ్‍లోనూ రానుంది. హిందీ, తెలుగులో అదే రోజున విడుదల కానుంది.
తెలుగు హక్కులు ఇలా..
జిగ్రా తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‍మెంట్ సంస్థ సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనుంది. జిగ్రా తెలుగు పోస్టర్‌ను నేడు (సెప్టెంబర్ 28) ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‍మెంట్ సోషల్ మీడియాలో వెల్లడించింది.
జిగ్రాను తెలుగులో నిర్మాతలు సునీల్ నారంగ్, దగ్గుబాటి సురేశ్‍కు చెందిన ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‍మెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుండడంతో ఈ మూవీపై ఆసక్తి పెరిగింది. “ధైర్యం, రక్షణకు సంబంధించిన స్టోరీ ఇది. బిగ్‍స్క్రీన్‍లపై చూసేందుకు రెడీగా ఉండండి. జిగ్రా తెలుగు ట్రైలర్ రేపు (సెప్టెంబర్ 29) వస్తుంది. అక్టోబర్ 11న హిందీ, తెలుగులో జిగ్రా రిలీజ్ కానుంది” అని ఆ సంస్థ పోస్ట్ చేసింది.
జిగ్రా చిత్రానికి వాసన్ బాల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆలియా భట్, వేద్‍నాగ్ రైనా లీడ్ రోల్స్ చేశారు. ఆదిత్య నంద, శోభితా ధూళిపాళ్ల, మనోజ్ పహ్వా, రాహుల్ రవీంద్రన్ కీలకపాత్రలు పోషించారు.
జిగ్రా మూవీకి నిర్మాతల్లోనూ ఒకరిగా ఆలియా భట్ ఉన్నారు. ధర్మ ప్రొడక్షన్స్, ఎటర్నల్ సన్‍షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, ఆలియా భట్, షహీన్ భట్, సౌమెన్ మిశ్రా ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రానికి అంచిత్ తక్కర్ సంగీతం అందించగా.. స్వప్నిల్ ఎస్ సోనావానే సినిమాటోగ్రఫీ చేశారు.
జిగ్రా స్టోరీలైన్
సత్య (ఆలియా భట్) చిన్నతనం నుంచి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. సోదరుడు అంకూర్ ఆనంద్ (వేదాంగ్ రైనా) మాత్రమే ఆమెకు తోడుగా ఉంటాయి. అయితే, విదేశాలకు వెళ్లిన అంకూర్ జైలు పాలవుతాడు. చిత్ర హింసలు అనుభవిస్తాడు. అంకూర్‌ను జైలు నుంచి విడిపించాలని సత్య నిర్ణయించుకుంటుంది. పోరాడేందుకు సిద్ధమవుతుంది. సవాళ్లను ఎదుర్కొంటూ ఆనంద్‍ను సత్య జైలు నుంచి బయటికి తీసుకొచ్చిందా అనేది ఈ మూవీ ప్రధానమైన అంశంగా ఉంటుంది.
జిగ్రా మూవీలో ఆలియా భట్ యాక్షన్ స్టంట్స్ చేశారు ఆలియా. ఎంతో డెడికేషన్‍తో ఈ చిత్రాన్ని చేశారు. ఈ మూవీ హిందీ ట్రైలర్ ఇప్పటికే వచ్చేసింది. ఈ ట్రైలర్ ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. హిందీతో పాటు తెలుగులోనూ ఈ మూవీ అక్టోబర్ 11న రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది.
జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్, కరణ్ జోహార్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూ చేశారు. దేవర మూవీ కోసం ఎన్టీఆర్, జిగ్రాకు ఆలియా ప్రమోషన్ కోసం చేసిన ఈ ఇంటర్వ్యూ ఆకట్టుకుంది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో వారిద్దరూ కలిసి నటించారు.