Naatu Naatu Step: బాలీవుడ్ సినిమాలో ‘నాటునాటు’ హుక్ స్టెప్.. ఆ ఇద్దరు స్టార్లు కలిసి..
Bade Miyan Chote Miyan - Naatu Naatu Step: ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు హుక్ స్టెప్ సూపర్ పాపులర్ అయింది. అయితే, ఇప్పుడు ఓ బాలీవుడ్ సినిమాలో స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి అలాంటి స్టెప్ వేశారు. ఆ వివరాలివే..
Naatu Naatu Hook Step: గ్లోబల్ హిట్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటలో హుక్ స్టెప్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ కలిసి వేసిన ఆ స్టెప్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. వారిద్దరి సూపర్ డ్యాన్స్, గ్రేస్, కో-ఆర్డినేషన్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ హుక్ స్టెప్‍ను చాలా మంది ట్రై చేశారు. ఈ ‘నాటు నాటు’ స్టెప్ వేసి ఎంతో మంది వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, ఇప్పుడు ఓ బాలీవుడ్ సినిమాలో ఆ ‘నాటు నాటు’ హుక్ స్టెప్‍ను వాడేశారు.
‘బడే మియా చోటే మియా’ సినిమా నుంచి తాజాగా మస్త్ మలంగ్ జూమ్ అనే పాట రిలీజ్ అయింది. ఫుల్ జోష్‍తో ఉన్న ఈ సాంగ్ అలరిస్తోంది. స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, టైగార్ ష్రాఫ్ ఈ పాటలో స్టెప్స్ వేశారు. అయితే, సాంగ్ మధ్యలో ఓ చోట ఇద్దరూ కలిసి హుక్ స్టెప్ వేశారు. ఇది అచ్చంగా నాటు నాటు స్టెప్‍లాగే ఉంది. దాని నుంచి స్ఫూర్తిగా తీసుకొనే.. అక్షయ్, ష్రాఫ్ ఈ స్టెప్ వేసినట్టు అర్థమవుతోంది.
నెటిజన్ల రియాక్షన్ ఇదే..
అక్షయ్, టైగర్ ష్రాఫ్.. ‘నాటు నాటు’ను పోలిన హుక్ స్టెప్ వేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ వెర్షన్ ‘నాటు నాటు’ అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. నాటు నాటు స్టెప్‍ను కూడా బాలీవుడ్ రీమేక్ చేసేసిందని మరికొందరు రాసుకొస్తున్నారు. మరికొందరు ఈ స్టెప్ విషయంలో నెటిజన్లు ఎన్టీఆర్ - రామ్‍చరణ్, అక్షయ్ - టైగర్‌ను పోలుస్తూ ట్వీట్లు చేస్తున్నారు. మొత్తంగా ఈ స్టెప్‍తో బడే మియా చోటే మియా’ సినిమాలోని మస్త్ మలంగ్ జూమ్ సాంగ్ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
బడే మియా చోటే మియా యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వస్తోంది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‍తో పాటు మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించారు. సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్, అలయా, రోనిత్ బోస్ రాయ్, సునీల్ శెట్టి కీలకపాత్రలు చేశారు. ఈద్ సందర్భంగా ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారంలో రిలీజ్ కానుంది.
బడే మియా చోటే మియా సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ రిలీజ్ కానుంది. ఈ యాక్షన్ ప్యాక్డ్ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి విశాల్ మిశ్రా, జులియస్ పాకియమ్ సంగీతం అందించారు. జాకీ భగ్నానీ, వషు భగ్నానీ, దీప్‍శిఖ దేశ్‍ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్, సునీల్ శెట్టి నిర్మాతలుగా వ్యవహరించారు.
కాగా, రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు దక్కింది. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్‍చరణ్, ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్లు అయ్యారు.