అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు, యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఓ ఇంటి వాడయ్యారు. తన ప్రేయసి జైనాబ్ రవ్జీని అఖిల్ పెళ్లాడారు. నేటి (జూన్ 6) తెల్లవారుజామున జూబ్లిహిల్స్‌లోని నాగార్జున నివాసంలో అఖిల్, జైనాబ్ వివాహం వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు సన్నిహితులు, కొందరు సినీ సెలెబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యారు.
అఖిల్ - జైనాబ్ వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ హాజరయ్యారు. వారితో పాటు రామ్‍చరణ్, ఉపాసన దంపతులు కూడా పెళ్లికి వచ్చారు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, శర్వానంద్, దర్శక ధీరుడు రాజమౌళి, అతడి కుమారుడు కార్తికేయతో పాటు మరికొందరు సినీ సెలెబ్రిటీలు హాజరయ్యారు. భారత క్రికెటర్ తిలక్ వర్మ కూడా పెళ్లికి వచ్చారు. వివాహంలో అఖిల్ సోదరుడు, హీరో నాగచైతన్య సందడి చేశారు. చైతూ భార్య శోభితా ధూళిపాళ్ల చీరకట్టులో మెరిశారు. సుశాంత్, సుమంత్ కూడా ఉత్సాహంగా కనిపించారు.
అఖిల్, జైనాబ్ మధ్య ఎనిమిది ఏళ్ల గ్యాప్ ఉంది. అఖిల్ వయసు ప్రస్తుతం 31 కాగా.. జైనాబ్‍ది 39. వీరిద్దరు సుమారు రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ముంబైకు చెందిన పారిశ్రామిక వేత్త జుల్ఫి రవ్జీ కుమార్తెనే జైనాబ్ రవ్జీ. పెయింటింగ్ ఆర్టిస్టుగా, సోషల్ మీడియా ఇన్‍ఫ్లుయెన్సర్‌గా జైనాబ్ పాపులర్ అయ్యారు. ఓ చిత్రంలోనూ నటించారు.
అఖిల్ - జైనాబ్ వివాహ రిసెప్షన్ వేడుక జూన్ 8వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్‍లో జరగనుంది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో సినీ, రాజకీయ, వ్యాపార సహా పలు రంగాల ప్రముఖులు హాజరుకాన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నాగార్జున ఆహ్వానించారు.
అక్కినేని అఖిల్, జైనాబ్‍ల ఎంగేజ్‍మెంట్ గతేడాది నవంబర్ 26వ తేదీన జరిగింది. ఆరు నెలల తర్వాత వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి చాలా మంది సెలెబ్రిటిలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు.
గతంలో శ్రేయా భూపాల్‍తో అఖిల్ ఎంగేజ్‍మెంట్ జరిగింది. అయితే, ఆ తర్వాత అది క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత జైనాబ్‍ను అతడు ప్రేమించారు. ఆమెతో ఇప్పుడు ఏడడుగులు వేశారు అఖిల్.
సంబంధిత కథనం