Vidamuyarchi OTT: మరోసారి అజిత్ త్రిష అర్జున్ కాంబో.. ఫస్ట్ లుక్‌తోనే విడాముయర్చి ఓటీటీ డీల్ క్లోజ్.. ఏ ఓటీటీ అంటే?
Ajith Kumar Trisha Arjun Sarja Vidamuyarchi OTT: తమిళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ గ్యాంబ్లర్ కాంబినేషన్ రిపీట్ కానుంది. అజిత్ కుమార్, త్రిష, అర్జున్ సర్జా మరోసారి కలిసి నటిస్తున్న సినిమా విడాముయర్చి. తాజాగా విడాముయర్చి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతోనే విడాముయర్చి ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయి.
Ajith Kumar Vidamuyarchi OTT Rights: తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ లైకా ప్రొడక్షన్స్ కలయికలో నటిస్తున్న కొత్త సినిమా విడాముయర్చి. దీనికి తెలుగులో పట్టుదల అనే అర్థం వస్తుంది. ఈ సినిమాకు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో క్రేజీ కాంబో రిపీట్ కానుంది. దీంతో ఈ సినిమాపై అభిమానులు సహా అందరిలో భారీ అంచనాలు మొదలయ్యాయి.
అసలు సినిమాలో అజిత్ లుక్ ఎలా ఉంటుంది.. మూవీ ఎలా ఆకట్టుకోనుందంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూడసాగారు. ఆ సమయం రానే వచ్చేసింది.. అందరి అంచనాలను మించేలా ‘విడాముయర్చి’ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
విడాముయర్చి సినిమా ప్రారంభం నుంచి కోలీవుడ్ సహా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టాప్ స్టార్స్, టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాలో భాగమయ్యారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్స్‌తో భారీ బడ్జెట్ చిత్రాలు, డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ సినిమాలను నిర్మిస్తోన్న టాప్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్. ఈ సంస్థ అధినేత సుభాస్కరన్..‘విడాముయర్చి’ సినిమాను నిర్మిస్తున్నారు.
ఆద్యంతం ఆకట్టుకునే ఎంటర్‌టైన్మెంట్ చిత్రాలతో పాటు విలక్షణమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా పేరున్న మగిళ్ తిరుమేని అజిత్‌తో భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అజిత్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ ‘మంగాత’ (తెలుగులో గ్యాంబ్లర్)లో అజిత్ కుమార్, త్రిష, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా త్రయం తమదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మరోసారి వీరు ముగ్గురు ఆడియెన్స్‌ను మెప్పించనున్నారు.
వీరితోపాటు ఈ విడాముయర్చి సినిమాలో ఆరవ్, బ్యూటిఫుల్ హీరోయిన్ రెజీనా కసాండ్ర, నిఖిల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. అయితే, తాజాగా అజిత్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా విడాముయర్చి సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకుంది. అలాగే విడాముయర్చి ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ అవడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ హెడ్ జీకేఎం తమిళ్ కుమారన్ మాట్లాడుతూ "మా బ్యానర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడాముయర్చి చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఇప్పుడు విడుదల చేయటం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. అజిత్‌తో సినిమా చేస్తున్నామని ప్రకటించినప్పటి నుంచి అభిమానులు, ప్రేక్షకులు వారి సపోర్ట్‌ను అందిస్తున్నారు. వారికి చక్కటి సినిమాను అందించటమే మా లక్ష్యం. అందుకనే మా టీమ్ ఎంతగానో కష్టపడుతుంది" అని అన్నారు.
"ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్ట్ నెలలో సినిమా చిత్రీకరణను పూర్తి చేస్తాం. తర్వాతే సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందనే దాని గురించి అధికారికంగా తెలియజేస్తాం" అని లైకా ప్రొడక్షన్ హెడ్ తమిళ్ కుమారన్ అన్నారు. ఇదిలా ఉంటే, విడాముయర్చి సినిమా కోసం కోలీవుడ్ మ్యూజికల్ రాక్ స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ ఇప్పటికే చార్ట్ బస్టర్ ఆల్బమ్‌ను సిద్ధం చేశారు.