Ajith Kumar Accident: అజిత్‌కు ప్రమాదం.. 180 కి.మీ. వేగంతో గోడను ఢీకొట్టిన కారు.. వైరల్ అవుతున్న వీడియో
Ajith Kumar Accident: తమిళ స్టార్ నటుడు అజిత్ కుమార్ కు ప్రమాదం జరిగింది. అతడు గంటకు 180 కి.మీ. వేగంతో నడుపుతున్న కారు గోడను ఢీకొట్టింది. అయితే ఇంతటి తీవ్రమైన ప్రమాదం నుంచి అతడు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడటం ఓ అద్భుతం కాగా.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Ajith Kumar Accident: రేసింగ్ లో పాల్గొనడం కోసం దుబాయ్ వెళ్లిన తమిళ నటుడు అజిత్ కుమార్ ప్రమాదం బారిన పడ్డాడు. మంగళవారం (జనవరి 7) ప్రాక్టీస్ చేస్తుండగా.. అతడు గంటకు 180 కి.మీ. వేగంతో నడిపిస్తున్న పోర్షె కారు ఒక్కసారిగా గోడను బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత కూడా కారు గింగిరాలు తిరుగుతూ కనిపించింది. కాసేపటికి ఆ కారులో నుంచి అజిత్ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటకు రావడం విశేషం.
అజిత్‌కు తప్పిన ప్రమాదం
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కారు ప్రమాదానికి గురైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దుబాయ్ లో ఈ నెల 11, 12 తేదీల్లో జరగనున్న రేసింగ్ కోసం మంగళవారం (జనవరి 7) అజిత్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతడు ఏకంగా గంటకు 180 కి.మీ. వేగంతో కారు నడుపుతుండగా అది అదుపు తప్పి పక్కన గోడను ఢీకొట్టి రేసింగ్ ట్రాక్ పై గింగిరాలు తిరిగింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన రక్షణ సిబ్బంది అజిత్ ను మరో కారులోకి తరలించారు. నుజ్జునుజ్జయిన ఆ కారు నుంచి అజిత్ ఎలాంటి గాయాలు కాకుండా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అత్యాధునిక ఈ కారులో అన్ని రకాల సెక్యూరిటీ ఫీచర్స్ ఉండటంతో అజిత్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ రేసింగ్ కోసం ఈ మధ్యే అజిత్ దుబాయ్ వెళ్లాడు.
అజిత్ కుమార్ రేసింగ్ టీమ్
స్టార్ హీరో అజిత్‌కు అజిత్ కుమార్ రేసింగ్ అనే ఓ టీమ్ ఉంది. ఈ టీమ్ 24హెచ్ దుబాయ్ 2025లో పాల్గొనడానికి వెళ్లింది. ఈ టీమ్ లో అజిత్ తోపాటు మాథ్యూ డెట్రీ, ఫాబియన్ డుఫీయుక్స్, కామెరాన్ మెక్‌లియోడ్ లాంటి వాళ్లు ఉన్నారు. దుబాయ్ లో రేసు జనవరి 11, 12 తేదీల్లో జరగనుంది. దీనికోసమే అజిత్ తన టీమ్ తో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే అతని కారు ట్రాక్ పై అదుపు తప్పి పక్కనే ఉన్న రక్షణ గోడను ఢీకొట్టింది.
గతేడాది సెప్టెంబర్ లో అజిత్ తన సొంత రేసింగ్ టీమ్ ను లాంచ్ చేశాడు. అజిత్ గతంలో ఫార్ములా బీఎండబ్ల్యూ ఏషియా, బ్రిటీష్ ఫార్ములా 3, ఎఫ్ఐఏ ఎఫ్2 ఛాంపియన్షిప్ లలో పాల్గొన్నాడు. అతని టీమ్ ప్రస్తుతం యూరప్ మొత్తం రేసులలో పాల్గొంటోంది. అజిత్ కు బైక్ రేసింగ్ అంటే కూడా ఇష్టమే. 1990ల్లో మోటార్ సైకిల్ రేసింగ్ ఛాంపియన్షిప్ లలో పాల్గొనే వాడు. ఇప్పుడు పదేళ్ల తర్వాత మరోసారి రేసింగ్ లోకి వచ్చాడు.
అజిత్ త్వరలోనే రెండు సినిమాల్లో కనిపించనున్నాడు. ఇందులో ఒకటి విదాముయర్చి. ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉన్నా.. వాయిదా పడింది. ఇక మరో మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ సోమవారం (జనవరి 6) వెల్లడించారు.