Ajay Gadu OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన సరికొత్త రొమాంటిక్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులో తెలుసా?
Ajay Gadu OTT Streaming: బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ కంటెస్టెంట్ అజయ్ కతుర్వర్ హీరోగా బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ అజయ్ గాడు. తాజాగా ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఆ వివరాల్లోకి వెళితే..
Ajay Gadu OTT Streaming: బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ ఫేమ్ అజయ్ కతుర్వర్ హీరోగా బిగ్ బాస్ ద్వారా సూపర్ క్రేజ్ అందుకున్న భాను శ్రీతోపాటు టీవీ షో రోడీస్ విన్నర్ శ్వేత మెహతా కీలక పాత్రలు పోషించిన సినిమా అజయ్ గాడు. ప్రాచీ టక్కర్, అభయ్ బేతిగంటి, జయశ్రీగారు, యద్దం రాజు తదితరలు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. అజయ్ కతుర్వర్ స్వీయ దర్శకత్వంలో అజయ్ గాడు మూవీని తెరకెక్కించాడు.
అజయ్ కుమార్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించారు. చందన కొప్పిశెట్టి సంయుక్తంగా నిర్మించారు. అజయ్ గాడు సినిమా అజయ్ అనే వ్యక్తికి సంబంధించిన కథ. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి అజయ్. రోజురోజుకీ మారిపోతున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, డబ్బు, పేరు, ప్రేమ వంటి వాటిని తెలుసుకోవడానికి ఇబ్బందిపడుతుంటాడు. వీటన్నిటినీ వదిలేయాలనుకున్న అతను ఒకానొక సందర్భంలో శ్వేతను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు.
ఆమె డ్రగ్స్‌కి బానిస అయిన మెడికో. అలాంటి ఆమెను సక్రమ మార్గంలో ఉంచటానికి చేసే ప్రయత్నాల్లో బాహ్య ప్రపంచంతో అజయ్ ఎలాంటి యుద్ధం సాగించాడనేదే అజయ్ గాడు కథ. ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడూ పూర్తయినప్పటికీ థియేటర్లలో విడుదల కాలేదు. అనేక కారణాలతో పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన అజయ్ గాడు సినిమా ఎట్టకేలకు విడుదల అయింది. అయితే, అది థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ జీ5లో జనవరి 12 నుంచి అజయ్ గాడు సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. జీ5లో అజయ్ గాడు మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోన్నట్లు మేకర్స్ తెలిపారు. కాగా మూవీని జీ5లో రిలీజ్ చేసే సందర్భంగా "ఒక సినిమాలో నటిస్తూ, నిర్మాతగా, దర్శకుడిగా పనిచేయడం మామూలు విషయం కాదు. చాలా థ్రిల్లింగ్ జర్నీ ఇది. ఈ ప్రాజెక్టుకు నా మనసులో ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ అద్భుతమైన అనుభవాన్ని ప్రతి ఒక్కరితోనూ పంచుకోవాలని అనుకుంటున్నాను" అని అజయ్ కతుర్వర్ తెలిపాడు.
"ఈ సినిమాలో ట్రైలర్‌లో చూపించినవాటికి మించిన విషయాలు చాలా ఉంటాయి. స్టంట్స్, ఎమోషన్స్, రొమాన్స్ వీటన్నిటిని కలగలిపి అద్భుతంగా తెరకెక్కించాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులకు ఈ సినిమాను అందించడమే నా ధ్యేయం. జీ5తో కలిసి ఈ సినిమాను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను ఒకే రోజు పలకరించడానికి జీ5 చక్కటి వేదిక అయింది. అజయ్‌గాడు సకుటుంబంగా చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరికీ నచ్చే అంశాలు ఇందులో ఉంటాయి. ఈ అద్భుతమైన సినిమాను ప్రేక్షకులతో కలిసి ఆస్వాదించాలని అనుకుంటున్నాను" అజయ్ అన్నాడు.
"అజయ్ కతుర్వర్‌తో కలిసి పనిచేయడం అత్యద్భుతమైన అనుభవం. తను మంచి కోస్టార్. ఈ సినిమాలో ఆయన పాత్ర, కథనం డిఫరెంట్‌గా ఉంటుంది. అజయ్ తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తారనటంలో సందేహం లేదు. ఆయన కథ చెప్పగానే నాకు నచ్చింది. ఈ సినిమాలో నేను ప్రియ అనే పాత్రలో నటిస్తున్నాను. స్వేచ్ఛగా ఉండే యువతి పాత్ర అది. తన జీవితానికి తనకు నచ్చిన సిద్ధాంతాన్ని అమలు చేసుకునే అమ్మాయి పాత్ర అది. బోల్డ్ రిలేషన్‌షిప్స్‌ని చూపిస్తూ సాగే, అందమైన ప్రేమ కథ ఇది. మూవీలో అజయ్‌తో నా కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ఈ సినిమాను ప్రేక్షకులు జీ5లో ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను" అని భానుశ్రీ చెప్పుకొచ్చింది.