Aishwarya Rajinikanth: ఒంటరితనమే బాగుంది - వైవాహిక జీవితంపై ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Aishwarya Rajinikanth: ధనుష్‌తో వైవాహిక బంధానికి ముగింపు పలికిన తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పులపై ఐశ్వర్య రజనీకాంత్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఒంటరితనమే బాగుందని అన్నది. ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
Aishwarya Rajinikanth: లాల్ సలామ్ మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత డైరెక్టర్‌గా కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ . 2015లో రిలీజైన వాయ్ రాజా వాయ్ తర్వాత కుటుంబ బాధ్యతల కారణంగా సినీ పరిశ్రమకు దూరంగాఉంది. లాల్ సలామ్‌తో తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టింది. రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన ఈ మూవీలో విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా కనిపించారు.
ఫిబ్రవరి 9న రిలీజైన ఈ మూవీ తమిళంలో మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది. తెలుగులో ఫస్ట్ డేనే ఐశ్వర రజనీకాంత్ మూవీకి టాలీవుడ్ ఆడియెన్స్ షాకిచ్చారు. థియేటర్లలో జనాలు లేకపోవడంతో తొలిరోజు చాలా చోట్ల షోలు రద్దయ్యాయి. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా తొమ్మిది కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ మూవీ డిజాస్టర్ దిశగా సాగుతోంది.
లాల్ సలామ్ ప్రమోషన్స్‌తో బిజీ...
రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఐశ్వర్య రజనీకాంత్ బిజీగా ఉంది. లాల్ సలామ్ ప్రమోషన్స్‌లో భాగంగా ధనుష్‌కు దూరమైన తర్వాత గత రెండేళ్లలో జీవితంలో వచ్చిన మార్పులపై ఐశ్వర్య ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఒంటరితనమే బాగుందని, సోలో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు ఐశ్వర్య తెలిపింది. ఈ రెండేళ్లు ఎలా గడిచిపోయాయో కూడా తెలియదని అన్నది. బోర్ అన్నదే లేకుండా ప్రతి క్షణాన్ని ఏంజాయ్ చేసినట్లు తెలిపింది. ఈ ప్రయాణంలో ఒంటరిగా బతకడమే చాలా సేఫ్ అని అర్థమైందని తెలిపింది.
పిల్లల కోసమే...
వాయ్ రాజా వాయ్ తర్వాత దర్శకురాలిగా చాలా అవకాశాలు వచ్చాయని, కొన్ని కథలను సొంతం కూడా సిద్ధం చేసుకున్నానని ఐశ్వర్య రజనీకాంత్ తెలిపింది. కానీ పిల్లల కోసం టైమ్ కేటాయించాలనే సినిమాలకు దూరంగా ఉన్నానని చెప్పింది.
త్రీ సక్సెస్‌కు పాట ఉపయోగపడలేదు...
ధనుష్ హీరోగా నటించిన త్రీ మూవీ ఫ్లాప్‌పై కూడా ఐశ్వర్య రజనీకాంత్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ధనుష్ పాడిన వై దిస్ కొలవెర్రీ పాట పెద్ద హిట్టయిన సినిమా విజయానికి మాత్రం హెల్ప్ కాలేకపోయిందని చెప్పింది. త్రీ మూవీతో ఆడియెన్స్‌కు డిఫరెంట్ స్టోరీ చెప్పాలని అనుకున్నానని ఐశ్వర్య అన్నది. వై దిస్ కొలవెర్రీ సాంగ్ ప్రభంజనం ముందు కథ మొత్తం తేలిపోయిందని చెప్పింది.
పాట గురించి తప్ప తన స్టోరీ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని అన్నది. ఈ పాటతోనే ధనుష్ క్రేజ్ పాన్ ఇండియన్ లెవెల్‌కు చేరుకోవడంపై కూడా ఐశ్వర్య రియాక్ట్ అయ్యింది. సినిమా హిట్ కాకపోయినా వై దిస్ కొలవెర్రీ పాట మరొకరి కెరీర్ ఎదుగుదలకు తోడ్పడటం ఆనందంగా ఉందని అన్నది. ధనుష్ పేరు మాత్రం ఆమె చెప్పలేదు.
2004లో పెళ్లి...2022లో విడాకులు...
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ను ప్రేమించిన ఐశ్వర్య అతడిని 2004లో పెళ్లాడింది. వీరిద్దరికి యాత్ర రాజా, లింగ రాజా అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. 18 ఏళ్ల పాటు సాఫీగా సాగిన వైవాహిక బంధానికి ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ 2022లో ముగింపు పలికారు. తాము విడిపోతున్నట్లుగా ప్రకటించారు.