OTT Crime Thriller Series: ఐశ్వర్య రాజేశ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍కు సీక్వెల్.. ఉత్కంఠగా ట్రైలర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Suzhal The Vortex Season 2: సుడల్ 2 ట్రైలర్ వచ్చేసింది. ఎన్నో అంచనాలు ఉన్న సీక్వెల్ సిరీస్ ట్రైలర్ ఉత్కంఠభరితంగా సాగింది. సస్పెన్స్ కొనసాగించింది. ఈ రెండో సీజన్ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.

హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్ర పోషించిన ‘సుడల్: ది వర్టెక్స్’ వెబ్ సిరీస్ చాలా పాపులర్ అయింది. 2022 జూన్‍లో వచ్చిన ఈ సిరీస్ భారీ వ్యూస్ సాధించింది. సూపర్ సక్సెస్ అయింది. దర్శకులు పుష్కర్ - గాయత్రి తెరకెక్కించిన ఈ సిరీస్‍కు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు సుమారు మూడేళ్లకు సుడల్ వెబ్ సిరీస్‍కు రెండో సీజన్ వచ్చేస్తోంది. ఈ సుడల్ సీజన్ 2 ట్రైలర్ నేడు (ఫిబ్రవరి 19) రివీల్ అయింది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.
ట్రైలర్ ఇలా..
తన చెల్లిని హత్య చేసిన వ్యక్తిని చంపిన నందిని (ఐశ్వర్య రాజేశ్) జైలు పాలైన షాట్‍తో సుడల్: ది వర్టెక్స్ సీజన్ 2 ట్రైలర్ మొదలైంది. తన చెల్లిని చంపినందుకే ప్రతీకారం తీర్చుకున్నాననే డైలాగ్ ఉంటుంది. నందినిని బయటికి తీసుకొచ్చేందుకు ఆమె ఫ్రెండ్, ఎస్ఐ చక్రవర్తి (ఖాతిర్) ప్రయత్నిస్తుంటాడు. నందిని తరఫున సీనియర్ లాయర్ చెల్లప్ప (లాల్) కేసును వాదిస్తుంటాడు. ఇంతలో న్యాయవాది చెల్లప్ప హత్యకు గురవుతాడు. ఈ కేసును ఎస్ఐ చక్రవర్తి దర్యాప్తు చేయాల్సి వస్తుంది.
ఈ హత్యకేసులో ఎనిమిది మంది అమ్మాయిలు అనుమానితులుగా ఉంటారు. ఒకరితో ఒకరికి సంబంధం లేదని చక్రవర్తి అంటాడు. మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తుంటాడు. తమిళనాడులోని ఓ గ్రామంలో జరిగే అష్టకాళి పండుగ బ్యాక్‍డ్రాప్‍లో ఈ సీజన్ సాగుతుంది. లాయర్ చెల్లప్ప హత్య కేసు విచారణలో చక్రవర్తికి మరిన్ని చిక్కు ముడులు ఎదురవుతాయి. చెల్లప్ప గురించి నిజం బయటికి వస్తే కష్టమేలా ఓ పోలీసు ఉన్నతాధికారి చెబుతాడు. దీంట్లోనూ ఏదో ట్విస్ట్ ఉన్నట్టే కనిపిస్తోంది.
ఈ కేసు మరింత జఠిలం కావడంతో ఎస్ఐ చక్రవర్తి మదన పడుతుంటాడు. మరోవైపు నందిని జైలులో సతమతం అవుతుంటుంది. విచిత్ర వేషధారణలో ఓ వ్యక్తి కనిపించగా.. “ఒకటే మార్గం.. ఆ రాక్షసుడిని కనుగొని వాడి తల నరకడమే” అనే డైలాగ్‍తో ట్రైలర్ ఎండ్ అవుతుంది. మొత్తంగా సుడల్ 2 ట్రైలర్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ సీజన్ మరింత ట్విస్టులతో సాగుతుందనేలా అనిపిస్తోంది. ఆ నేరం వెనుక మిస్టరీ ఏంటనేది ఆసక్తికరంగా కనిపిస్తోంది.
సుడల్ సీజన్ 2 ట్రైలర్‌లో దర్శక ద్వయం పుష్కర్ - గాయత్రి మార్క్ కనిపించింది. మరోసారి థ్రిల్లింగ్ నరేషన్‍తో మ్యాజిక్ చేశారనిపిస్తోంది. ఈ సిరీస్‍లో ఐశ్వర్య రాజేశ్, ఖాతిర్, లాల్‍తో పాటు శరవణన్, మంజినా మోహన్, కాయల్ చంద్రన్, గౌరి జీ కిషన్, సంయుక్త విశ్వనాథన్, మోనిషా బ్లెస్సీ, శిరీష, అభిరామి బోస్, నిఖిల శంకర్, కళావాణి భాస్కర్ కీలకపాత్రలు పోషించారు.
సుడల్ 2 ట్రైలర్లో సామ్ సీఎస్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంటెన్స్‌గా ఉంది. తొలి సీజన్‍లో బీజీఎంతో మెప్పించి సామ్.. మళ్లీ అదే రిపీట్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ సిరీస్‍కు అబ్రహాం జోసెఫ్ సినిమాటోగ్రఫీ చేశారు. వాల్‍వాచర్స్ ఫిల్మ్స్ పతాకం ఈ సిరీస్‍ను ప్రొడ్యూజ్ చేసింది.
సుడల్ 2 స్ట్రీమింగ్ డేట్
సుడల్: ది వర్టెక్స్ 2వ సీజన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఫిబ్రవరి 28వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళంలో రూపొందిన సిరీస్ తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ స్ట్రీమింగ్‍కు రానుంది.
సంబంధిత కథనం