Aha ott top trending: సుడిగాలి సుధీర్ షోనే టాప్.. ఆహా ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు, షోలు ఇవే
Aha ott top trending: సుడిగాలి సుధీర్ టీవీలోనే కాదు ఓటీటీలోనూ తానే కింగ్ అని మరోసారి నిరూపిస్తున్నాడు. ఆహా ఓటీటీలో అతడు హోస్ట్ చేస్తున్న షోనే టాప్ ట్రెండింగ్ కావడం విశేషం.
Aha ott top trending: ఆహా ఓటీటీలో సుడిగాలి సుధీర్ షోనే టాప్ ట్రెండింగ్ లో ఉంది. మొత్తంగా ఈ ఓటీటీలోని టాప్ 10 ట్రెండింగ్స్ లో మూడు షోలు కాగా.. మిగిలిన ఏడు సినిమాలు కావడం విశేషం. అయితే సుధీర్ హోస్ట్ చేస్తున్న సర్కార్ షో ఆ ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ మధ్యే నాలుగో సీజన్ తో అతడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
సుడిగాలి సుధీర్ సర్కార్ హవా
ఆహా ఓటీటీ ఈ మధ్యే సర్కార్ అనే షో నాలుగో సీజన్ ను ప్రారంభించింది. అయితే గత సీజన్లకు భిన్నంగా ఈసారి ప్రదీప్ మాచిరాజు బదులు సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వచ్చాడు. ఈ కొత్త సీజన్ ప్రారంభానికి ముందే సుధీర్ వస్తున్నట్లు స్పెషల్ ప్రోమోతో ఆహా ఓటీటీ వెల్లడించింది. కామెడీ టైమింగ్, పంచ్ డైలాగులతో అదరగొట్టే సుధీర్ హోస్ట్ చేస్తే ఈ షో మరో రేంజ్ కు వెళ్తుందని అతని అభిమానులు భావించారు.
అనుకున్నట్లే సర్కార్ కొత్త సీజన్ అదరగొడుతోంది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు పూర్తి చేసుకొని ఈ శుక్రవారం ఐదో ఎపిసోడ్ కోసం రెడీ అవుతున్న ఈ సర్కార్ షో మూడో ఎపిసోడ్ ఆహా ట్రెండింగ్ టాప్ 10లో తొలి స్థానంలో నిలిచింది. ఈ ఎపిసోడ్ లో నలుగురు ముద్దుగుమ్మలతో సుధీర్ చేసే హంగామా చూడొచ్చు. ఇప్పుడు ఐదో ఎపిసోడ్లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఈ షోకి రాబోతుండటంతో ఈ వారం ఎపిసోడ్ కూడా హిట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సర్కార్ సెలబ్రిటీ షో నుంచి ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఓ కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది.
ఆహా టాప్ ట్రెండింగ్ మూవీస్, షోస్
ఇక ఈ సర్కార్ కాకుండా బాలయ్య బాబు హోస్ట్ చేసే అన్‌స్టాపబుల్ షోకి చెందిన రెండు ఎపిసోడ్లు కూడా టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. అందులో రెండో సీజన్ తొలి ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు, లోకేష్ లతో బాలకృష్ణ చేసిన షో ఐదో స్థానంలో ఉంది. ఇక పవన్ కల్యాణ్ రెండో సీజన్ ఫినాలే ఎపిసోడ్ 8వ స్థానంలో ఉంది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో వీళ్ల షోలు టాప్ ట్రెండింగ్ లో చోటు దక్కించుకోవడం విశేషం.
ఇక సర్కార్ షో తర్వాత రెండో స్థానంలో ప్రముఖ కమెడియన్ అభినవ్ గోమటం నటించిన మై డియర్ దొంగ మూవీ ఉంది. ఈ ఆహా ఒరిజినల్ ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచీ ప్రేక్షకుల మనసు దోచుకుంటూనే ఉంది. మూడో స్థానంలో మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమలు ఉంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ మాత్రమే ఆహాలోకి రాగా.. ఇక్కడ కూడా ఆ మూవీ అదరగొడుతోంది.
నాలుగో స్థానంలో సిద్ధార్థ్ రాయ్ మూవీ ఉంది. ఈ బోల్డ్ మూవీని కూడా ఓటీటీలో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆరో స్థానంలో అసుర గురు, ఏడో స్థానంలో హ్యాపీ ఎండింగ్, 9వ స్థానంలో పొలిమేర 2, 10వ స్థానంలో అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాలు ఉన్నాయి.