Telugu Indian Idol 3 Auditions: సింగర్ అవ్వాలనుకుంటున్నారా? తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఆడిషన్స్ డేట్, టైమ్ ఖరారు
Telugu Indian Idol Season 3 Mega Audition: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 మెడా ఆడిషన్స్ వివరాలను ఆహా ఓటీటీ వెల్లడించింది. ఆడిషన్స్ డేట్, టైమ్, ప్లేస్‍ను ప్రకటించింది.
Telugu Indian Idol 3 Mega Auditions: ఆహా ఓటీటీలో సింగింగ్ షో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ చాలా పాపులర్ అయింది. తొలి రెండు సీజన్లు చాలా సక్సెస్ అయ్యాయి. ఇక తెలుగు ఇండియన్ ఐడల్ మూడో సీజన్‍ను తీసుకొచ్చేందుకు ఆహా రెడీ అయింది. ఈ సీజన్ కోసం ఆడిషన్స్ కూడా నిర్వహించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‍లో జరిగే మెగా ఆడిషన్స్ వివరాలను ఆహా ఓటీటీ తాజాగా వెల్లడించింది.
తెలుగు ఇండియన్ ఐడల్ మూడో సీజన్‍కు కూడా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్, స్టార్ సింగర్లు కార్తిక్, గీతామాధురి జడ్జిలుగా వ్యవహించనున్నారు. ఆడిషన్స్ వివరాలతో పోస్టర్ కూడా రిలీజ్ చేసింది ఆహా ఓటీటీ.
ఆడిషన్స్ డేట్, ప్లేస్ వివరాలివే
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 హైదరాబాద్ మెగా ఆడిషన్స్ మే 5వ తేదీన జరనుంది. మే 5 ఉదయం 8 గంటల నుంచి ఈ ఆడిషన్స్ మొదలుకానున్నాయి. హైదరాబాద్‍లోని బషీర్‌బాగ్‍లోని సెయింట్ జార్జ్ గర్ల్స్ గ్రామర్ స్కూల్‍లో ఈ ఆడిషన్స్ జరుగుతాయని ఆహా వెల్లడించింది. 14 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న వారికే ఆడిషన్స్‌లో అవకాశం ఉంటుందని పేర్కొంది. నేరుగా రావొచ్చని తెలిపింది.
తొలి సీజన్.. విజేతకు ట్రోఫీ ఇచ్చిన మెగాస్టార్
తెలుగు ఇండియన్ ఐడల్ తొలి సీజన్ 2022 ఫిబ్రవరిలో మొదలైంది. ఈ సీజన్‍కు థమన్, కార్తీక్‍తో పాటు స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ జడ్జిలుగా వ్యవహరించారు. సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్ చేశారు. జూన్‍లో ఈ సీజన్ ఫైనల్ జరిగింది. తొలి సీజన్‍లో విన్నర్‌గా టైటిల్ గెలిచారు వాగ్దేవి. ఫైనల్‍కు అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి వాగ్దేవికి టైటిల్ అందించారు. శ్రీనివాస్, వైష్ణవి రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. తెలుగు ఇండియన్ ఐడల్ తొలి సీజన్ సూపర్ సక్సెస్ అయింది.
రెండో సీజన్.. గెస్ట్‌గా అల్లు అర్జున్
ఇండియన్ ఐడల్ రెండో సీజన్‍లో జడ్జిలుగా థమన్, కార్తీక్, గీతామాధురి ఉన్నారు. ఈ సీజన్‍కు సింగర్ హేమచంద్ర హోస్ట్ చేశారు. రెండో సీజన్ విజేతగా సౌజన్య భాగవతుల నిలిచారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆమెకు ట్రోఫీ అందించారు. జయరాం, లాస్యప్రియ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
తెలుగు ఇండియన్ ఐడల్ రెండు సీజన్లు కలిపి 31 ఎపిసోడ్లు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి. సుమారు 25 మంది సింగర్లు పోటీ పడ్డారు. ఈ సీజన్లలో బాలకృష్ణ, దేవీ శ్రీప్రసాద్, కోటీ, నాని సహా చాలా మంది సెలెబ్రిటీలు గెస్టులుగా హాజరయ్యారు.
తెలుగు ఇండియన్ ఐడల్ మూడో సీజన్‍పై కూడా చాలా అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్‍తో పాటు అమెరికాలోనూ ఆడిషన్స్ పూర్తయి.. కంటెస్టెంట్‍లను సెలెక్ట్ చేశాక ఈ సీజన్ షురూ కానుంది. ఈ సీజన్ ఎప్పుడెప్పుడూ మొదలవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఓవైపు సినిమాలు, వెబ్ సిరీస్‍లను తీసుకొస్తూనే.. రియాల్టీ షోలు, గేమ్ షోలను కూడా ఆహా క్రమంగా ప్రసారం చేస్తోంది. ఆహాలో సర్కార్ సీజన్ 4 ఇటీవలే మొదలైంది. ఈ సెలెబ్రిటీ గేమ్ షోకు సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా ఉన్నారు. ఈ గేమ్‍షోకు సంబంధించి ప్రతీ శుక్రవారం రాత్రి 8 గంటలకు కొత్త ఎపిసోడ్ వస్తోంది.