Aha naa pellanta in zee5: అహ నా పెళ్లంటకు 7.5 కోట్ల వ్యూయింగ్ మినట్స్
Aha naa pellanta in zee5: అహ నా పెళ్లంట వెబ్‌సిరీస్ ఇప్పటి వరకూ 7.5 కోట్ల వ్యూయింగ్ మినట్స్ నమోదు చేయడం విశేషం. జీ5 ఓటీటీలో రిలీజైన ఈ కామెడీ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Aha naa pellanta in zee5: ఈ మధ్యకాలంలో ఓటీటీల్లో వస్తున్న తెలుగు వెబ్‌సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా జీ5 ఓటీటీలో వచ్చిన అహ నా పెళ్లంట సిరీస్ ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వినోదాన్ని పంచుతోంది. నవంబర్ 17న రిలీజ్ కాగా.. ఇప్పటి వరకూ ఈ సిరీస్ 7.5 కోట్ల వ్యూయింగ్ మినట్స్ నమోదు చేయడం విశేషం.
ట్రెండింగ్ వార్తలు
పీటలపై కూర్చోవాల్సిన పెళ్లికూతురు తన బాయ్‌ఫ్రెండ్‌తో లేచిపోవడం, దానికి ఆ వరుడు తీర్చుకునే రివేంజే ఈ అహ నా పెళ్లంట స్టోరీ. సంజీవ్ రెడ్డి ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సిరీస్ సాధించిన మైల్‌స్టోన్‌ను టీమ్ సెలబ్రేట్ చేసుకుంది. రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్‌తోపాటు లావణ్య త్రిపాఠీ, ఆది సాయికుమార్ ఈ సెలబ్రేషన్స్‌లో పాలు పంచుకున్నారు.
ఈ వెబ్ సిరీస్‌లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటి వరకూ పెద్ద హిట్ అందుకోని రాజ్ తరుణ్ ఈ సిరీస్ హిట్ అవడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఈ పార్టీకి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ప్రస్తుతం లావణ్య త్రిపాఠీ, రాజా చెంబోలు జీ5లోనే మరో వెబ్ షో చేస్తున్నారు. రచయిత కోన వెంకట్ ఈ సిరీస్‌ను కోనా ఫిల్మ్ కార్ప్ బ్యానర్‌పై క్రియేట్ చేస్తున్నాడు.
అహ నా పెళ్లంట ఎలా ఉందంటే..
ఈ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి. మొదటి ఎపిసోడ్ 40 నిమిషాలు మినహా మిగిలినవన్నీ అరగంట లోపే ఉన్నాయి. మొదటి ఎపిసోడ్‌తోనే ప్రేక్షకులు కథలోకి వెళ్లిపోతారు. పెళ్లి చెడిపోవడం వరకు మొదటి ఎపిసోడ్‌లోనే ఉండటం వల్ల ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా హర్షవర్ధన్, రాజ్ తరుణ్ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. అయితే రెండో ఎపిసోడ్ మాత్రం కాస్త నిదానంగా సాగుతుంది. కథ కొంచెం రొటీన్‌గానే ఉందని ఈ ఎపిసోడ్‌తోనే అర్థమవుతుంది. అయితే హీరో ఎప్పుడైతే హైదరాబాద్‌కు వెళ్తాడో అక్కడ నుంచి సిరీస్ ఆసక్తికరంగా మారుతుంది. హీరోయిన్‌ను కిడ్నాప్ చేయడం, ఆ ఉదంతం నుంచి బయటపడటం, ఆమెతో కలిసి ఒకే ఫ్లాట్‌లో ఉండటం ఇవన్నీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని ఇస్తాయి. హీరో స్నేహితుల మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి.
మూడు ఎపిసోడ్ మధ్య నుంచి 4, 5 ఎపిసోడ్‌లు ఫన్నీగా సాగుతాయి. ఆరో ఎపిసోడ్‌ను స్టోరీలో ఎమోషనల్ టచ్ మొదలవుతుంది. మహా ఫ్యామిలీకి వచ్చిన సమస్యను తీర్చేందుకు శ్రీను సాయపడటం ఆ సీన్లన్నీ బాగుంటాయి. వినోదంతో పాటు ఎమోషన్స్ కూడా ఫర్వాలేదనిపించాయి. అయితే మధ్య మధ్యలో కొన్ని రొటీన్ సన్నివేశాల కారణంగా కాస్త సాగదీసినట్లు ఉంటుంది. ఇలాంటి కథకు కామెడీని జోడించడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నమైతే చేశారు. రొటీన్ కథను.. స్కీన్ ప్లే సాయంతో డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేసినట్లు అనిపిస్తుంది. ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. క్లైమాక్స్ కూడా కాస్త డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ నమ్మశక్యంగా అనిపంచదు. ఎయిర్‌పోర్టులో బాంబ్ అనే సీరియస్ విషయాన్ని చాలా ఫన్నీ తేల్చేశారు. ఈ విషయంలో కొన్ని లాజిక్స్ పట్టించుకుని ఉంటే బాగుండేదనిపిస్తుంది.