Bold Movie Rerelease: ఈమధ్యకాలంలో రీరిలీజ్ అవుతున్న సినిమాల్లో భారీ బడ్జెట్, బ్లాక్‌బస్టర్ సినిమాలే కాదు.. కొన్ని చిన్న సినిమాలు కూడా ఉంటున్నాయి. అలా హిందీలో ఇప్పుడు మరో సూపర్ హిట్ బోల్డ్ అడల్ట్ కామెడీ సినిమా రిలీజ్ కాబోతోంది. తెలుగులో బాలకృష్ణతో కలిసి నటించిన బాలీవుడ్ నటి రాధికా ఆప్టే నటించిన మూవీ కావడం విశేషం.
బాలీవుడ్ లో 2015లో రిలీజైన మూవీ హంటర్ (Hunterrr). ఈ అడల్ట్ కామెడీ సినిమాలో గుల్షన్ దేవయ్య, సయీ తమన్కర్, రాధికా ఆప్టే నటించారు. ఈ సినిమా పదేళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. జాట్, సికందర్ లాంటి సినిమాలతో పోటీ పడుతూ.. ఏప్రిల్ 4న ఈ హంటర్ థియేటర్లలో విడుదల కానుంది.
2015లో వచ్చిన ఈ చిత్రం పలు కారణాలతో చర్చనీయాంశంగా మారింది. సినిమాలోని బోల్డ్ కంటెంట్ అప్పట్లో ప్రేక్షకులను ఆకర్షించింది. సెక్స్‌కు బానిసైన ఓ వ్యక్తి పాత్రలో ఈ సినిమాలో గుల్షన్ నటించాడు. బాలీవుడ్ లో మార్చి 30న సికందర్, ఏప్రిల్ 10న జాట్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటి మధ్యలో ఈ బోల్డ్ సినిమా రీరిలీజ్ కానుండటం విశేషం.
అమ్మాయి, ఆంటీ అనే తేడా లేకుండా కనిపించిన ప్రతి మహిళతోనూ ప్రేమలో పడే ఓ వ్యక్తి కథే ఈ హంటర్. ఈ సినిమా 2015లో రిలీజై సంచలన విజయం సాధించింది. రూ.11 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర రూ.13 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇప్పుడు తొలిసారి రిలీజై పదేళ్లు పూర్తయిన సందర్భంగా రీరిలీజ్ కాబోతోంది.
ఈ హంటర్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం హిందీ ఆడియోతోనే అందుబాటులో ఉంది. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో సినిమాను చూడొచ్చు. ఈ మూవీ తనకు మంచి పేరు తెచ్చి పెట్టిందని రీరిలీజ్ సందర్భంగా గుల్షన్ దేవయ్య అన్నాడు.
అటు రాధికా ఆప్టే మాట్లాడుతూ.. తన అత్యంత హాస్యభరిత చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని అన్నారు. ''ఈ స్క్రిప్ట్ నా దగ్గరకు రాగానే ఈ సినిమా చేయాలని వెంటనే నిర్ణయించుకున్నాను. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు నా నిర్ణయం కరెక్ట్ అనిపిస్తోంది. ఈ సినిమాకు జనాల్లో కల్ట్ స్టేటస్ వచ్చింది. ఇప్పుడు నిర్మాతలు మరోసారి థియేటర్లలో రీరిలీజ్ చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది" అని రాధిక చెప్పింది.
సంబంధిత కథనం