Major review : మేజర్ రివ్యూ....సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ ఎలా ఉందంటే...-adivi sesh major movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Adivi Sesh Major Movie Review

Major review : మేజర్ రివ్యూ....సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ ఎలా ఉందంటే...

HT Telugu Desk HT Telugu
Jun 03, 2022 05:57 PM IST

అడివిశేష్ హీరోగా న‌టించిన తాజా చిత్రం మేజ‌ర్‌.ముంబై ఉగ్ర‌దాడుల్లో అమ‌రుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి శ‌శికిర‌ణ్ తిక్కా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దేశ‌భ‌క్తి ప్ర‌ధానంగా తెర‌కెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే...

అడివిశేష్‌
అడివిశేష్‌ (twitter)

టాలీవుడ్ లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశాల‌తో సినిమాలు చేస్తూ వ‌రుస విజ‌యాల్ని అందుకుంటున్నాడు అడివిశేష్‌. గూఢ‌చారి, ఎవ‌రు, క్ష‌ణం సినిమాల‌తో కథానాయకుడిగా వైవిధ్య‌త‌ను చాటుకున్నాడు. అడివిశేష్ హీరోగా న‌టించిన తాజా చిత్రం మేజ‌ర్‌. ముంబై ఉగ్ర‌దాడుల్లో క‌న్నుమూసిన మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది. గూఢ‌చారి ఫేమ్ శ‌శికిర‌ణ్ తిక్కా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అనురాగ్‌రెడ్డి, శ‌ర‌త్‌చంద్ర‌ల‌తో క‌లిసి టాలీవుడ్ అగ్ర‌హీరో మ‌హేష్‌బాబు ఈ సినిమాను నిర్మించారు. శుక్ర‌వారం ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. 

మేజర్ సందీప్ జీవితం

నేవీలో చేరాలన్నది సందీప్ ఉన్నికృష్ణ‌న్ (అడివి శేష్) కల. కానీ కుటుంబ‌స‌భ్యుల‌కు అత‌డు నేవీలో చేర‌డం ఇష్టం ఉండ‌దు.  త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌కుండా నేవీకి అప్లికేష‌న్ పంపిస్తాడు సందీప్.  కానీ అత‌డి అప్లికేష‌న్ రిజెక్ట్ అవుతుంది. నేవీతో మాత్రమే కాకుండా ఆర్మీ ద్వారా  కూడా దేశానికి సేవ చేయ‌వ‌చ్చున‌ని ప్రియురాలు ఇషా అత‌డికి స‌ల‌హా ఇస్తుంది. ఆమె మాట‌తో ఆర్మీలో చేరిన సందీప్ ఎన్ ఎస్ జీ క‌మాండోగా శిక్ష‌ణ తీసుకుంటాడు.  ముంబై హోట‌ల్‌పై ఉగ్ర‌వాదులు ఎటాక్ చేస్తారు. ఆ దాడుల‌ను ఎదుర్కొనే ఆప‌రేష‌న్‌ను సందీప్ చేప‌డుతాడు?  ఈ ఆప‌రేష‌న్‌లో సందీప్‌కు ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి?  ప్రాణాల‌కు తెగించి అత‌డు ఎలాంటి పోరాటం చేశాడు? అన్న‌దే ఈ చిత్ర క‌థ‌. 

ప్రకాష్ రాజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో

ముంబై ఉగ్ర‌దాడుల్లో మరణించిన సందీప్ ఉన్ని కృష్ణ‌న్ బయోపిక్ ఇది.  సందీప్ జీవితంలో జ‌రిగిన కీల‌క ఘ‌ట్టాల‌కు కొంత సినిమాటిక్ లిబ‌ర్టీని జోడిస్తూ ఈ క‌థ రాసుకున్నారు. ప్ర‌కాష్‌రాజ్ దృక్కోణం నుంచి ఈ సినిమా సాగుతుంది.  అతి భ‌య‌స్తుడిగా ఉన్న సందీప్ ఎలా ధైర్య‌వంతుడిగా మారాడు? త‌ల్లిదండ్రుల‌తో అత‌డికి ఉన్న అనుబంధంతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ కు స‌మాంత‌రంగా ఇషా అనే అమ్మాయితో  సందీప్ ప్రేమ‌క‌థ‌ను నడిపించారు దర్శకుడు.  సెకండ్ హాఫ్‌లో  ఉగ్ర‌వాదుల ఎటాక్స్‌లో అమాయ‌కుల ప్రాణాల‌ను కాపాడ‌టానికి మేజర్ సందీప్ చేసే ప్ర‌య‌త్నాలు యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ఉత్కంఠ‌ను పంచుతాయి. క్లైమాక్స్‌లో ప్ర‌కాష్‌రాజ్ యాక్టింగ్ ఈ సినిమాకు బ‌లంగా నిలుస్తుంది. అత‌డు చెప్పిన డైలాగ్స్ భావోద్వేగానికి లోనుచేస్తాయి. 

పాత కథ

26 11 ఉగ్ర‌దాడుల నేప‌థ్యంలో వివిధ భాష‌ల్లో ప‌లు సినిమాలు, సిరీస్‌లు రూపొందాయి. వాటి ఛాయ‌ల‌తోనే మేజ‌ర్ సినిమా సాగుతుంది. కథలో ఎలాంటి కొత్తదనం కనిపించదు.  ప్ర‌థ‌మార్థంలో వ‌చ్చే సందీప్‌, ఇషా ల‌వ్‌స్టోరీ నిదానంగా సాగుతుంది.

సందీప్ పాత్రలో..

సందీప్ ఉన్ని కృష్ణ‌న్ పాత్ర‌లో అడివిశేష్ జీవించాడు. సందీప్ క్యారెక్ట‌ర్‌ను పూర్తిగా అడాప్ట్ చేసుకొని న‌టించాడు. చ‌క్క‌టి ఎమోష‌న్స్ పండించాడు. సందీప్ త‌ల్లిదండ్రులుగా ప్ర‌కాష్‌రాజ్‌, రేవ‌తి పాత్ర‌లు ఈ సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి. వారిద్ద‌రు క‌నిపించేది  సినిమాలో కొద్ది స‌మ‌య‌మే అయినా త‌మ న‌ట‌నానుభ‌వంతో పాత్ర‌ల‌ను ర‌క్తిక‌ట్టించారు. స‌యీ మంజ్రేక‌ర్‌, శోభితా తమ నటనతో ఆకట్టుకున్నారు. 

రైటర్ గా శేష్ మెప్పించాడు

హీరోగానే కాకుండా స్ర్కీన్‌ప్లేరైట‌ర్‌గా అడివిశేష్ ఈ సినిమాతో  మెప్పించాడు. ద‌ర్శ‌కుడు శ‌శికిర‌ణ్ తిక్కాతో క‌లిసి క‌థ‌, కథనాల్ని ఆస‌క్తిక‌రంగా రాసుకున్నాడు. త‌క్కువ నిడివిలోనే సందీప్ జీవితాన్ని స్ఫూర్తిదాయ‌కంగా సినిమాలో చూపించారు ద‌ర్శ‌కుడు శ‌శికిర‌ణ్‌. శ్రీచ‌ర‌ణ్ పాకాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, అబ్బూరి ర‌వి డైలాగ్స్ బాగున్నాయి. 

కమర్షియల్ హంగుల కోసం కాకుండా

మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ పోరాటాన్ని స్ఫూర్తిదాయ‌కంగా ఆవిష్క‌రించిన చిత్ర‌మిది. క‌మ‌ర్షియ‌ల్ లెక్క‌లు, హంగుల కోసం ఆలోచించ‌కుండా థియేట‌ర్‌లో అడుగుపెడితే చ‌క్క‌టి అనుభూతిని పంచుతుంది.

రేటింగ్: 3/ 5

IPL_Entry_Point

టాపిక్