Adipurush Legal Notice: రామాయణాన్ని ఇస్లామీకరిస్తారా.. ఆదిపురుష్‌కు లీగల్‌ నోటీసులు-adipurush makers in legal trouble as sarva brahmana mahasabha serves a legal notice ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Adipurush Makers In Legal Trouble As Sarva Brahmana Mahasabha Serves A Legal Notice

Adipurush Legal Notice: రామాయణాన్ని ఇస్లామీకరిస్తారా.. ఆదిపురుష్‌కు లీగల్‌ నోటీసులు

ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్
ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్

Adipurush Legal Notice: రామాయణాన్ని ఇస్లామీకరిస్తారా అంటూ ఆదిపురుష్‌ మేకర్స్‌కు లీగల్‌ నోటీసులు పంపించింది సర్వ బ్రాహ్మణ మహాసభ. దీంతో ఈ మూవీ మేకర్స్‌ మరిన్ని చిక్కుల్లో పడ్డారు.

Adipurush Legal Notice: ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్‌ మూవీకి రోజుకో కష్టం ఎదురవుతోంది. ఎప్పుడైతే ఆ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ రిలీజ్‌ అయ్యాయో అప్పటి నుంచే మేకర్స్‌కు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇన్నాళ్లూ ఈ లుక్‌, టీజర్లపై ట్రోల్స్‌, విమర్శలే వచ్చాయి. కానీ ఇప్పుడు లీగల్‌ కష్టాలు కూడా మొదలయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

ఈ ఆదిపురుష్‌ ద్వారా రామాయణం ఇస్లామీకరణ జరుగుతోందంటూ సర్వ బ్రాహ్మణ మహాసభ తీవ్రంగా మండిపడింది. ఈ మూవీ డైరెక్టర్‌ ఓం రౌత్‌కు లీగల్‌ నోటీసులు కూడా పంపించింది. వారం రోజుల్లోగా ఇందులోని వివాదాస్పద సీన్లను తొలగించి, పబ్లిగ్గా క్షమాపణ చెబుతావా లేదంటే లీగల్ యాక్షన్‌ తీసుకోమంటావా అంటూ అందులో ఓంరౌత్‌ను హెచ్చరించింది.

"ఈ సినిమాలో హిందూ దేవుళ్లు, దేవతలను అభ్యంతరకరంగా చూపించారు. వాళ్లు తోలు దుస్తులు వేసుకున్నట్లుగా, అసభ్యకరంగా మాట్లాడినట్లు చిత్రీకరించారు. ఇందులో మరీ తక్కువ స్థాయి భాషను ఉపయోగించారు. ఇది మతపరమైన సెంటిమెంట్‌ను దెబ్బతీయడమే అవుతుంది. రామాయణం మా చరిత్ర. మా స్ఫూర్తి. కానీ ఆదిపురుష్‌లో హన్మంతుడిని మొఘల్‌లాగా చూపించారు. ఇందులో హనుమాన్‌ని చూపించినట్లు ఏ హిందువుకు మీసం లేకుండా గడ్డం ఉంటుంది?

ఈ సినిమా మొత్తం రామాయణాన్ని, రాముడు, సీత, హనుమాన్‌లను ఇస్లామీకరించినట్లుగా ఉంది. ఇందులో రావణుడిగా నటించిన సైఫ్‌ అలీ ఖాన్‌ కూడా తైమూర్‌ లేదా ఖిల్జీలాగా కనిపిస్తున్నాడు. ఈ సినిమా దేశంలో ఒక వర్గం వారి సెంటిమెంట్లను దెబ్బతీసి వాళ్లలో విద్వేషాన్ని వ్యాప్తి చేసేలా ఉంది" అని ఆ లీగల్‌ నోటీస్‌లో సర్వ బ్రాహ్మణ సభ స్పష్టం చేసింది.

ఆదిపురుష్‌ టీజర్‌ రిలీజైనప్పటి నుంచే మేకర్స్‌ను ట్రోల్‌ చేయడం మొదలైంది. ఇందులో ఉపయోగించిన వీఎఫ్‌ఎక్స్‌ నుంచి క్యారెక్టర్లను చిత్రీకరించిన తీరు వరకూ అన్నింటిపైనా విమర్శలు వచ్చాయి. అయోధ్య రామమందిర ప్రధాన పూజారి కూడా ఈ సినిమాను వెంటనే నిషేధించాలని డిమాండ్‌ చేశారు. కొంతమంది రాజకీయ నాయకులు, నటులు కూడా ఈ టీజర్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు.

WhatsApp channel