Bastar Trailer: ది కేరళ స్టోరీ మేకర్స్ నుంచి మరో కాంట్రవర్షియల్ మూవీ.. బస్తర్ ట్రైలర్ రిలీజ్
Bastar Trailer: ది కేరళ స్టోరీ మూవీ మేకర్స్ ఈసారి నక్సల్స్ ఘాతుకాలపై ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సినిమా బస్తర్. ఈ వివాదాస్పద మూవీ ట్రైలర్ ను మంగళవారం (మార్చి 5) రిలీజ్ చేశారు.
Bastar Trailer: అదా శర్మ, సుదీప్తో సేన్ కాంబినేషన్ లో గతేడాది వచ్చిన ది కేరళ స్టోరీ మూవీ ఎంత సంచలనం సృష్టించిందో అన్ని వివాదాలకూ కారణమైంది. ఇప్పుడీ కాంబినేషన్ లో బస్తర్ అనే మరో సినిమా వస్తోంది. నక్సలిజం చుట్టూ తిరిగే ఈ మూవీ నుంచి మంగళవారం (మార్చి 5) మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది చాలా ఆసక్తికరంగా సాగింది.

బస్తర్ ట్రైలర్
సుదీప్తో సేన్ డైరెక్షన్ లో అదా శర్మ గతేడాది ది కేరళ స్టోరీ అనే సినిమాలో నటించింది. కేరళలో అమాయక హిందూ యువతులను అక్కడి ముస్లిం యువకులు ఎలా లోబర్చుకొని, వాళ్ల మతం మార్చి సిరియాలోని ఐసిస్ లో ఎలా చేరుస్తున్నారో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. కేరళలో ఇలా వేల మంది అమాయక యువతులు బలవుతున్నారంటూ మేకర్స్ ఈ వివాదాస్పద సినిమా ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు.
ఇప్పుడు వాళ్లే బస్తర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో చత్తీస్‌గఢ్ లోని బస్తర్ లో వేళ్లూనుకుపోయిన నక్సల్స్, వాళ్లు చేస్తున్న హింస గురించి ప్రస్తావించారు. ప్రపంచంలో ఐసిస్, బోకొ హరాం తర్వాత మూడో అతిపెద్ద ఉగ్రవాద సంస్థ నక్సల్సే అంటూ ఈ ట్రైలర్ లో చెప్పడం గమనార్హం. మంగళవారం (మార్చి 5) బస్తర్ మూవీ ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఐపీఎస్ ఆఫీసర్‌గా అదా శర్మ
ది కేరళ స్టోరీలో ఓ బాధితురాలి పాత్ర పోషించిన అదా శర్మ.. ఈ బస్తర్ లో ఓ పవర్ ఫుల్ ఐపీఎస్ అధికారి పాత్రలో కనిపించనుంది. పాకిస్థాన్ తో జరిగిన నాలుగు యుద్ధాల్లో చనిపోయిన మన సైనికుల కంటే ఈ మావోయిస్టులు చంపిన సైనికుల సంఖ్యే రెట్టింపుగా ఉందని ఈ బస్తర్ ట్రైలర్ లో ఓ డైలాగ్ ఉంది. నక్సల్స్ లేని భారత్ ను చూడాలన్న ఆకాంక్షలో భాగంగా ఈ సినిమాను తీసుకొస్తున్న ట్రైలర్ రిలీజ్ సందర్భంగా మేకర్స్ చెప్పారు.
అడవుల్లో నక్సల్స్ సృష్టిస్తున్న హింసకు అడ్డుకట్ట వేయడానికి వచ్చిన ఐపీఎస్ అధికారి పాత్రలో అదా శర్మ కనిపించనుంది. ఈ సినిమా మార్చి 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం తాము ఎంతో పరిశోధించి స్క్రిప్ట్ రాసుకున్నట్లు డైరెక్టర్ సుదీప్తో సేన్ వెల్లడించాడు. ది కేరళ స్టోరీకి వచ్చిన రెస్పాన్సే ఈ బస్తర్ కు కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
గతేడాది థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించింది ది కేరళ స్టోరీ మూవీ. సుమారు 10 నెలల తర్వాత ఈ మధ్యే జీ5 ఓటీటీలోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించినట్లే ఓటీటీలోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడీ బస్తర్ మూవీ కూడా తమకు అలాంటి విజయాన్నే సాధించి పెడుతుందని అదాశర్మతోపాటు ఇతర మేకర్స్ అందరూ ఆశతో ఉన్నారు. ఈ సినిమాపై రిలీజ్ కు ముందే వస్తున్న విమర్శలను కూడా అదా శర్మ ఈ మధ్య తిప్పికొట్టింది. మరి ప్రేక్షకులు ఈ బస్తర్ మూవీని ఎంత మేర ఆదరిస్తారో చూడాలి.