సోషల్ మీడియా సెలబ్రిటీ ఊర్ఫీ జావేద్ 'ది ట్రైటర్స్' రియాలిటీ షో గెలిచిన తర్వాత తన మొదటి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను షేర్ చేసింది. బిగ్‌బాస్ ఓటీటీ (2021) నుండి వారం రోజుల్లోనే వెళ్లిపోయినప్పటి నుంచి ఇప్పుడు 'ది ట్రైటర్స్' విజేతగా నిలవడం వరకు తన ప్రస్థానం గురించి ఆమె ఈ పోస్ట్‌లో పంచుకుంది. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న ద్వేషం ఎలాంటిదో తెలిపింది.
ది ట్రైటర్స్ సీజన్ 1 గెలిచిన తర్వాత శుక్రవారం (జులై 4) తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఊర్ఫీ జావెద్ ఓ పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె ఓ వీడియో షేర్ చేసింది. బిగ్ బాస్ నుంచి తనను బయటకు పంపే సీన్ తో మొదలై.. ట్రైటర్స్ లో తాను గెలిచినట్లు ప్రకటించడంతో ఊర్ఫి గట్టిగా అరవడం అందులో చూడొచ్చు.
ఈ వీడియోను షేర్ చేస్తూ, గత నాలుగు సంవత్సరాలుగా తన ప్రయాణం ఎంత కష్టమైందో ఊర్ఫీ గుర్తుచేసుకుంది. తాను చాలాసార్లు ఏడ్చానని, బెదిరింపులు, ద్వేషాన్ని ఎదుర్కొన్నానని చెప్పారు. బిగ్‌బాస్ ఇంట్లోకి వెళ్ళడానికి కూడా దుస్తులను అప్పుగా తీసుకోవాల్సి వచ్చిందని కూడా ఆమె వెల్లడించింది.
గత కొన్ని సంవత్సరాలుగా తన ప్రయాణం గురించి ఆమె మనసు విప్పి మాట్లాడింది. "బిగ్‌బాస్‌లో ఓడిపోయి (మొదటగా ఎలిమినేట్ అయిన వ్యక్తిగా) 'ది ట్రైటర్స్' గెలిచే వరకు. ఈ ప్రయాణం అంత తేలికైనది కాదు. నేను ఎన్నిసార్లు ఏడ్చాను, ఎన్నిసార్లు బాధపడ్డాను, వదిలేసి పారిపోవాలని అనిపించింది. నన్ను దారుణంగా అవమానించారు. చంపేస్తామని, రేప్ చేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఆన్‌లైన్ ద్వేషం, ఆఫ్‌లైన్ ద్వేషం.. కానీ నేను ఎప్పుడూ ఆగలేదు. బహుశా ప్రపంచానికి నేను అవసరమని తెలిసి ఉంటుంది," అని ఆమె రాసింది.
బిగ్‌బాస్ నుండి బయటపడిన తర్వాత తనకు "మంచి జీవితం" ఉంటుందా అని ఆలోచించినట్లు ఊర్ఫీ వెల్లడించింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. "బిగ్‌బాస్‌లో ఓడిపోయినప్పుడు, విజయానికి లేదా మంచి జీవితానికి నాకున్న చివరి అవకాశాన్ని కోల్పోయానని అనుకున్నాను. బిగ్‌బాస్‌లో ధరించడానికి స్నేహితుల నుండి దుస్తులు అప్పుగా తీసుకున్నాను. ఆ సమయంలో, ఆ అప్పును తిరిగి చెల్లించగలనా అని కూడా నాకు తెలియదు" అని తన కష్టాలను గుర్తుచేసుకుంది.
"అందరూ నన్ను ఎప్పుడూ అనుమానించారు, ఇప్పుడూ అంతే, కానీ ఇది నన్ను ఆపలేదు. ద్వేషం ఎప్పుడూ నన్ను ఆపలేదు, ఆపలేదు. నేను ముగ్గురు ట్రైటర్స్ ను బయటపెట్టాను, అది అదృష్టం కాకూడదు. చివరి క్షణం వరకు నేను వదులుకోలేదు. వ్యూహాలు రచించాను" అని తన పోస్ట్‌ను ముగించింది.
'ది ట్రైటర్స్' ఫైనల్ ఎపిసోడ్ గురువారం (జులై 3) ప్రసారమైంది. ఊర్ఫీ జావేద్, నిఖిత లూథర్ సీజన్ వన్ విజేతలుగా నిలిచి, ట్రోఫీతో పాటు రూ.70 లక్షల ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. మైండ్ గేమ్స్, వెన్నుపోట్లకు పేరుగాంచిన ఈ షో.. ఊర్ఫీ, నిఖితా ఇద్దరూ 'నిర్దోషులైన' ప్లేయర్స్ – 'ట్రైటర్స్' అయిన హర్ష్ గుజ్రాల్, పురవ్ ఝాలను అధిగమించడంతో ముగిసింది.
బాలీవుడ్, టెలివిజన్, సోషల్ మీడియా నుండి 20 మంది సెలబ్రిటీలతో ఈ షో ఒక గ్రాండ్ ప్యాలెస్‌లో ప్రారంభమైంది. ఇందులో మహీప్ కపూర్, అన్షులా కపూర్, రాజ్ కుంద్రా, ఆశిష్ విద్యార్థి, కరణ్ కుంద్ర, లక్ష్మీ మంచు, అపూర్వ మఖిజా, రఫ్తార్, ముఖేష్ ఛబ్రా, సుధాంశు పాండే, సూఫీ మోతివాలా, సాహిల్ సలాతియా, జన్నత్ జుబైర్, ఎల్నాజ్ నౌరోజీ, హర్ష్ గుజ్రాల్, జాన్వి గౌర్, ఊర్ఫీ, నిఖిత, పురవ్ వంటి వారు పాల్గొన్నారు.
సంబంధిత కథనం