Actress Trisha: త్రిషను ఆ మాట అన్న ఆ పార్టీ లీడర్ ఓ ఇడియట్, నరకానికి వెళ్తాడు: నటుడు విశాల్ సీరియస్.. అసలేం జరిగింది?
Actress Trisha: నటి త్రిషను ఓ రిసార్టుకు తీసుకెళ్లామన్న ఏఐఏడీఎంకే పార్టీ నేత ఓ ఇడియట్, నరకానికి వెళ్తాడంటూ నటుడు విశాల్ సీరియస్ అయ్యాడు. అటు త్రిష కూడా ఆ నేతపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చింది.
Actress Trisha: తెలుగు, తమిళ నటి త్రిషపై తమిళనాడులోని ఏఐఏడీఎంకే పార్టీ లీడర్ ఏవీ రాజు నోరు పారేసుకున్న వివాదం ముదురుతోంది. తాజాగా ఈ వివాదంలో త్రిషకు మద్దతుగా నిలిచాడు నటుడు విశాల్. త్రిషను ఆ మాట అన్న అతడు ఓ ఇడియట్, స్టుపిడ్ అని, నరకానికి వెళ్తాడని అనడం గమనార్హం. వివాదం ముదురుతుండటంతో సదరు నేత క్షమాపణ చెప్పాడు.
త్రిషకు విశాల్ మద్దతు
ఆ మధ్య లియో మూవీ రిలీజ్ సందర్భంగా విలన్ పాత్ర పోషించిన మన్సూర్ అలీ ఖాన్.. మూవీలో ఆమెతో రేప్ సీన్ వస్తుందేమో అనుకున్నా అంటూ నోరు పారేసుకున్న విషయం తెలుసు కదా. తాజాగా ఏఐఏడీఎంకే నేత ఏవీ రాజు కూడా అలాంటి కామెంట్సే చేశాడు. ఓ ఎమ్మెల్యే అడిగితే కొంత మొత్తానికి త్రిషను రిసార్టుకు తీసుకెళ్లానని అతడు అన్నాడు.
ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. నటుడు విశాల్ దీనిపై స్పందిస్తూ ట్వీట్ చేశాడు. "ఓ పొలిటికల్ పార్టీకి చెందిన ఓ స్టుపిడ్ ఇడియట్ మా సినిమా ఇండస్ట్రీలోని ఓ వ్యక్తి గురించి దారుణంగా మాట్లాడాడని నాకు ఇప్పుడే తెలిసింది. నేను నీ పేరు, లేదంటే నువ్వు టార్గెట్ చేసిన ఆ వ్యక్తి పేరు చెప్పను. ఎందుకంటే ఇదంతా నువ్వు పబ్లిసిటీ కోసం చేస్తున్నావు.
మా ఫిల్మ్స్ ఇండస్ట్రీల వాళ్ల పేర్లు అసలే చెప్పను. మేమంతా మంచి ఫ్రెండ్స్. పరస్పరం గౌరవించుకుంటాం. నువ్వు చేసింది చాలా మురికి పని. ఆ మాటలు ఇక్కడ చెప్పలేను. నీ కామెంట్స్ ను నేను ఖండిస్తున్నా అని చెప్పను. ఎందుకంటే అది చాలా చిన్న మాట అవుతుంది. కానీ నువ్వు నరకానికి వెళ్తావ్" అని విశాల్ ట్వీట్ చేశాడు.
ఏవీ రాజు క్షమాపణ
ఇక త్రిషపై నోరు జారిన ఏఐఏడీఎంకే నేత ఏవీ రాజు క్షమాపణ చెప్పాడు. ప్రత్యేకంగా ఓ ప్రెస్ మీట్ పెట్టి తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నాడు. "ఏఐఏడీఎంకే నేతలను విలన్లు చూపించే ప్రయత్నం ఇది. త్రిష లాంటి యువ నటీమణులు అని అన్నాను తప్ప ఆమెనే అనలేదు. నేను త్రిషతోపాటు ఫిల్మ్ ఇండస్ట్రీలోని అందరికీ క్షమాపణ చెబుతున్నాను" అని ఏవీ రాజు అన్నాడు.
అసలేం జరిగిందంటే?
ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన ఏవీ రాజు చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఓ ఎమ్మెల్యే అడిగితే కొంత డబ్బుకు మాట్లాడుకొని త్రిషను ఓ రిసార్టుకు తీసుకొచ్చామని అతడు అన్నాడు. దీనిపై త్రిష వెంటనే స్పందించి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చింది.
"పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారడానికి ఇలాంటి పనులు చేస్తున్న మనుషులను చూస్తుంటే అసహ్యం వేస్తోంది. అతనిపై కఠిన చర్యలు తీసుకునేలా చేస్తాను. ఇక నుంచి చట్టపరమైన చర్యలే ఉంటాయి" అని త్రిష ట్వీట్ చేసింది.
గతంలో లియో మూవీలో విలన్ పాత్ర పోషించిన మన్సూర్ అలీ ఖాన్ కూడా త్రిషపై నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కశ్మీర్ లో తనకూ, త్రిషకు మధ్య ఓ రేప్ సీన్ ఉంటుందని తాను ఎంతో ఆశించినట్లు అతడు అనడం అప్పట్లో దుమారం రేపింది. దీనిపై మన్సూర్ అలీ ఖాన్ క్షమాపణ కూడా చెప్పాడు.
టాపిక్