Sunny Leone: సినిమా రిపోర్టర్‌కి సన్నీ లియోన్ వార్నింగ్.. ఉద్యోగాలు ఉండవ్!-actress sunny leone urges media to stop using the term objectification for item songs ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sunny Leone: సినిమా రిపోర్టర్‌కి సన్నీ లియోన్ వార్నింగ్.. ఉద్యోగాలు ఉండవ్!

Sunny Leone: సినిమా రిపోర్టర్‌కి సన్నీ లియోన్ వార్నింగ్.. ఉద్యోగాలు ఉండవ్!

Galeti Rajendra HT Telugu
Sep 11, 2024 02:29 PM IST

Sunny Leone Item songs: బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్‌తో సన్నీ లియోన్ బిజీగా ఉంది. ఐటెం సాంగ్స్ మాత్రమే కాదు.. కొన్ని సినిమాల్లోనూ ఈ భామ నటిస్తోంది. తాజాగా కేరళలో ఓ సినిమా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి సన్నీ ఘాటుగా బదులిచ్చింది.

సన్నీ లియోన్
సన్నీ లియోన్ (Nitin Lawate)

మత్తెక్కించే ఐటం సాంగ్స్‌తో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అభిమానుల్ని ఉర్రూతలూగించిన సన్నీ లియోన్.. ఐటెం సాంగ్స్ చేయడాన్ని సమర్థించుకుంది. ప్రభుదేవా, వేదిక ప్రధాన పాత్రల్లో ఎస్.జె.శీను దర్శకత్వంలో తమిళ చిత్రం 'పేట రాప్' ప్రమోషన్ కోసం సన్నీ లియోన్ ఇటీవల కొచ్చికి వెళ్లింది.

'పేట రాప్' మూవీలో సన్నీ స్పెషల్ అప్పియరెన్స్‌ ఇవ్వనుండగా.. ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో 'ఐటమ్ సాంగ్స్' గురించి సన్నీ లియోన్‌కి జర్నలిస్ట్ నుంచి ప్రశ్న ఎదురైంది. దాంతో ఆ ప్రశ్నకి కాస్త ఘాటుగా సమాధానమిచ్చిన సన్నీ లియోన్.. ఆఖరిలో నవ్వుతూ వార్నింగ్ కూడా ఇచ్చింది.

మనకి ఉద్యోగాలు ఉండవు

‘‘మీరు డ్యాన్స్ చేసిన ఐటెం సాంగ్స్ మహిళలను కించపరిచేలా ఉన్నాయని కొందరు అనుకుంటున్నారు. ఆ పాటలన్నీ మీ అంగాంగ ప్రదర్శనకే పెద్ద పీట వేశారనే మరో అభిప్రాయం కూడా ఉంది’’ అంటూ రిపోర్టర్ ఇంకా ఏదో చెప్పబోగా.. సన్నీ లియోన్ అడ్డుపడింది. అంగాంగ ప్రదర్శన అని మీ మీడియా వాళ్లు మాత్రమే అంటున్నారని సన్నీ లియోన్ కౌంటర్ ఇచ్చింది.

ఐటెం సాంగ్స్‌ను ఆస్వాదించడానికి చాలా మంది థియేటర్లకు వస్తారని, కేరళ ప్రజలు తన పాటలకు డ్యాన్స్ చేసిన వీడియోలను చూశానని సన్నీ లియోన్ చెప్పుకొచ్చింది. ఒకప్పుడు కేరళలోని ప్రజలు స్టేజ్‌పై డ్యాన్స్ చేయడం తనకి ఇంకా గుర్తుందని సన్నీ లియోన్ ఫన్నీగా బదులిచ్చింది.

అంగాంగ ప్రదర్శన అనే పదాన్ని ఉపయోగించడం వల్ల ఏదో ఒక రోజు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని.. ఆ పదం కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్ పదం వాడాలని సన్నీ లియోన్ సూచించింది.

"అది అంగాంగ ప్రదర్శన కాదు, అది ఆనందం. అది ఎంటర్‌టైన్‌మెంట్, ఆడియన్స్ కోసం అలా చేస్తున్నాం. మనం ఆ పదాన్ని ఉపయోగించడం మానేసి.. సినిమా గురించి మాట్లాడుకుందాం. మనమందరం కలిసి పనిచేయాలి.. లేకపోతే మనలో ఎవరికీ ఉద్యోగాలు ఉండవు’’ అని సన్నీ లియోన్ ఫన్నీ కాస్త ఘాటుగానే సమాధానమిచ్చింది.

సన్నీ లియోన్ కెరీర్‌లో ఆనా లైఫ్, శేషమ్మ, ట్రిప్పీ ట్రిప్పీ, డియో డియో వంటి స్పెషల్ సాంగ్స్‌లో నటించింది. త్వరలో మలయాళ మూవీస్ రంగీలా, షేరో, తమిళ చిత్రాలు వీరమదేవి, కొటేషన్ గ్యాంగ్ పార్ట్ 1, కన్నడ చిత్రం యుఐ, హిందీ చిత్రాలు కోకా కోలా, హెలెన్‌లలో సన్నీ లియోన్ మెరవనుంది.

పేటా ర్యాప్ గురించి

వివేక్ ప్రసన్న, భగవతి పెరుమాళ్, కళాభవన్ షాజాన్ కూడా పేట రాప్‌లో నటించారు. యాక్షన్ హీరోగా, పాప్ సింగర్‌గా ఎదగాలనుకునే ఓ జంట కథే ఈ సినిమా. ఇదే ప్రెస్ మీట్ లో దర్శకుడు శీను మాట్లాడుతూ తమిళంలో ఈ సినిమాను తెరకెక్కించి ప్రభుదేవాతో నటింపజేయాలని మొదట్లోనే నిర్ణయించుకున్నాం.

సినిమాలో కథ పరంగా చాలా 'డాన్స్ మూవ్స్' అవసరం. కానీ.. కేరళలో కంప్లీట్ డాన్స్ మ్యూజికల్‌లో భాగం అయ్యే నటుడు దొరకడం అంత సులువు కాదని భావించి ప్రభుదేవాను తీసుకున్నామని శీను వెల్లడించాడు.