Bigg Boss Soniya Eliminated: మణికి ఆరుగురు: సోనియాకు ముగ్గురే.. హౌస్ నుంచి ఆమె ఔట్.. నిఖిల్ కన్నీరు.. ఓ ట్విస్ట్ రివీల్
Bigg Boss Soniya eliminated: బిగ్‍బాస్ హౌస్ నుంచి సోనియా ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకులతో పాటు హౌస్‍మేట్స్ కూడా ఆమెకు తక్కువ ఓటింగ్ ఇచ్చారు. హౌస్‍లో మణికంఠ ఉండాలని ఆరుగురు అనుకుంటే.. సోనియాకు ముగ్గురే సపోర్ట్ చేశారు. సోనియా వెళ్లిపోవటంతో నిఖిల్ కన్నీరు పెట్టుకున్నారు.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో నాలుగో వారం ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది. సినీ నటి సోనియా ఆకుల హౌస్ నుంచి బయటికి వచ్చేశారు. ముందు నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్‍గా అనుకున్న ఆమె నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయిపోయారు. ప్రేక్షకుల ఓటింగ్‍తో పాటు హౌస్‍లోని ఎక్కువ మంది కూడా సోనియా వెళ్లిపోవాలనే అభిప్రాయాన్ని చెప్పారు. దీంతో హౌస్ నుంచి నేడు (సెప్టెంబర్ 29) ఆమె ఔట్ అయ్యారు. హోస్ట్ కింగ్ నాగార్జున ఇచ్చిన గేమ్‍ను బట్టి బయటికి వెళుతూ ఎవరు ఏ ఆహార పదార్థంలా ఉంటారో సోనియా చెప్పారు. వచ్చే వారం ఎలిమినేషన్ గురించి నాగ్ ఓ ట్విస్ట్ రివీల్ చేశారు. ఇది ఎలా జరిగిందో ఇక్కడ చూడండి.
ఆదివారం కావటంతో నేటి ఎపిసోడ్‍లో కంటెస్టెంట్లతో ఫన్ గేమ్స్ ఆడించారు నాగార్జున. మీకే అంకితం అంటూ చిటీలను తీసి.. దాంట్లో ఉన్న వాటిని ఓ హౌస్‍మేట్‍కు అంకితం చేయాలని చెప్పారు. హౌస్‍మేట్స్ మధ్య ఇది సరదాగా సాగింది. ట్యూన్‍ను గుర్తించి పాట చెప్పి డ్యాన్స్ చేసే గేమ్ హుషారుగా జరిగింది. ఈ క్రమంలోనే ఎలిమినేషన్ ప్రక్రియ కూడా సాగింది. నాలుగో వారం నామినేషన్ నుంచి నబీల్ ఇప్పటికే సేవ్ అయ్యారు. ఆదిత్య, పృథ్వి, నైనిక కూడా నామినేషన్ నుంచి బయటపడ్డారు. సోనియా, డేంజర్ జోన్‍లో ఉన్న మణికంఠ మధ్య ఎలిమినేషన్ టెన్షన్ నెలకొంది.
సోనియాకు ముగ్గురు.. మణికి ఆరుగురు సపోర్ట్
సోనియా, మణికంఠ ఎలిమినేషన్ అంచున నిలిచారు. ప్రేక్షకుల ఓటింగ్‍తో పాటు హౌస్‍మేట్స్ నిర్ణయాన్ని కూడా తీసుకునేందుకు నాగార్జున డిసైడ్ అయ్యారు. హౌస్‍లో మణికంఠ ఉండాలని ఎంత మంది.. సోనియా ఉండాలని ఎంత మంది అనుకుంటున్నారని అడిగారు.
మణికంఠనే హౌస్‍లో ఉండాలని ఆదిత్య ఓం, నబీల్ ఆఫ్రిది, విష్ణుప్రియ, ప్రేరణ, యష్మి, సీత లేచి నిలబడ్డారు. సోనియా ఉండాలని నిఖిల్, పృథ్వి, నైనిక చెప్పారు. మణికంఠకు ఆరుగురు, సోనియాకు ముగ్గురే మద్దతు తెలిపారు.
ప్రేక్షకులతో పాటు హౌస్‍మేట్స్ కూడా..
సోనియాకు ఈ వారం ప్రేక్షకుల నుంచి ఓటింగ్ తక్కువగా వచ్చింది. హౌస్‍లో ఆరుగురు కూడా ఆమెనే వెళ్లిపోవాలని చెప్పారు. దీంతో హౌస్ నుంచి సోనియా నామినేట్ అయ్యారు. “ప్రేక్షకుల నిర్ణయం, హౌస్‍మేట్స్ డెసిషన్ ప్రకారం సోనియా నువ్వు ఎలిమినేటెడ్” అని నాగార్జున చెప్పారు.
జైలుకు మణి
డేంజర్ జోన్‍లో ఉన్నందుకు మణికంఠను జైలులోకి పంపనున్నట్టు నాగార్జున చెప్పారు. చీఫ్ నిఖిల్ అతడిని జైలులోకి తీసుకెళ్లాలని అన్నారు. జైలును ఎప్పుడు బయటికి రావాలన్నది బిగ్‍బాస్ నిర్ణయిస్తారని తెలిపారు. ఈ సీజన్‍లో జైలులోకి వెళ్లనున్న తొలి కంటెస్టెంట్‍గా మణి నిలిచారు.
నేను మార్చుకోను
ఆ తర్వాత హౌస్ నుంచి బిగ్‍బాస్ స్టేజీ మీదకు వచ్చేశారు సోనియా. ఆ తర్వాత హౌస్‍లో సోనియా జర్నీ వీడియోను నాగార్జున చూపించారు. షాక్‍లో ఉన్నావా అని అడిగారు. ఉదయం నుంచి ఒంటరి అని అనిపించిందని చెప్పారు. తాను ఏ విషయమైన నేరుగా చెప్పేస్తానని, దాన్ని మార్చుకోనని సోనియా అన్నారు. చెప్పే పద్ధతి మార్చుకోవాలని అనుకుంటూనే ఉన్నానని తెలిపారు.
నా మాట వినరు.. కానీ
నిఖిల్, పృథ్వి అసలు తన మాట వినరని సోనియా చెప్పారు. తాను వాళ్లకు సలహాలు మాత్రమే ఇచ్చానని, కానీ వాళ్లను ప్రభావితం చేశానని హౌస్‍మేట్స్ అనుకున్నారని సోనియా సమర్థించుకున్నారు. హౌస్‍లోని అమ్మాయిలే తనను ఒంటరి అని చూపించారని అన్నారు. నిఖిల్, పృథ్వి తనకు ప్రాధాన్యత ఇచ్చినందుకు తనను అలా చేశారంటూ సోనియా చెప్పారు.
విష్ణు ‘పులిహోర’.. నబీల్ ‘చపాతీ’
పెద్ద ప్లేట్‍లో ఆహార పదార్థాలు ఉన్న తాలీ ఫొటోలను చూపించి.. వాటిని హౌస్‍మేట్లకు డెడికేట్ చేయాలని సోనియాకు టాస్క్ ఇచ్చారు నాగార్జున. విష్ణుప్రియకు పులిహోర ఇచ్చారు సోనియా. నచ్చితే ఆమె ఎంతైనా పులిహోర కలుపుతారని, నచ్చకపోతే ఇక ఏం లేదని అన్నారు. అయితే, పృథ్వితో క్లోజ్ అవుతున్నందుకు విష్ణును సోనియా ఇలా అన్నారని అర్థమవుతోంది. కాకరకాయ వేపుడును సీతకు, అవకాయను నైనికకు సోనియా సెలెక్ట్ చేశారు. నబీల్‍కు రొట్టెను సోనియా ఇచ్చారు. చూడడానికి నబీల్ కఠినంగా కనిపించినా.. లోపల సాఫ్ట్ అని సోనియా చెప్పారు. నామినేషన్ అంటే అది ఆయన స్టైల్ అని చెప్పారు.
స్వీట్‍ను పృథ్వికి, అన్నింటి కంటే ముఖ్యమైన అన్నాన్ని నిఖిల్‍కు ఇచ్చారు సోనియా. నిఖిల్ లేకపోతే హౌస్‍లో ఏమీ లేదంటూ ఓ కామెంట్ చేశారు. యష్మికి చేపల వేపుడును సోనియా సెలెక్ట్ చేశారు. యష్మి ఎమోషనల్ అని, కానీ నామినేషన్లకు వస్తే తగ్గేదే లేదంటారని చెప్పారు. నైనికను అప్పడం అని అన్నారు సోనియా.
ఏడ్చేసిన నిఖిల్
సోనియాతో హౌస్‍మేట్లకు గుడ్‍బై చెప్పించారు నాగార్జున. ఆ తర్వాత నిఖిల్‍ను నిలబడాలని నాగార్జున అడిగారు. ఆ తర్వాత నిఖిల్ కన్నీరు పెట్టుకున్నారు. ఎమోషనల్ అయ్యారు. స్ట్రాంగ్‍గా ఉండాలని సోనియా చెప్పారు. మిస్ అవుతానని సోనియాతో నిఖిల్ చెప్పారు. ఆ తర్వాత స్టేజ్ నుంచి బయటికి వెళ్లిపోయారు సోనియా.
ఎలిమినేషన్ ట్విస్ట్ చెప్పిన నాగార్జున
వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ఎంత మంది రావాలో హోస్‍మేట్స్ చేతిలో ఉందని, ఎప్పుడు అనేది బిగ్‍బాస్ నిర్ణయం అని చెప్పారు. మణికంఠను జైలులో వేసేందుకు స్టోర్ రూమ్ నుంచి తాళం తీసుకురావాలని నైనికతో నాగార్జున చెప్పారు. అలాగే, ఈ ఐదో వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ట్విస్ట్ రివీల్ చేశారు. అంటే వారం మధ్యలోనే ఎలిమినేషన్ ఉండనుంది. అందుకే నామినేషన్లు అయిపోయిన వెంటనే ఫేవరెట్ కంటెస్టెంట్‍కు ఓటు వేయాలని ప్రేక్షకులకు నాగార్జున చెప్పారు.