Amaran Success Meet: అమరన్ రిలీజ్ రోజు టాలీవుడ్ నుంచి నాకు చాలా కాల్స్ వచ్చాయి.. అందరూ ఒకటే మాట చెప్పారన్న సాయిపల్లవి
Sivakarthikeyan: తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ మౌత్ టాక్‌తో అమరన్ మూవీ థియేటర్లలో దూసుకెళ్తోంది. క, లక్కీ భాస్కర్ నుంచి పోటీ ఉన్నా.. ఇప్పటికే ఆరు రోజుల్లో ఓవరాల్‌గా రూ.155 కోట్లని వసూలు చేసింది.
దీపావళి కానుకగా విడుదలైన అమరన్ మూవీ హిట్ అవ్వడంతో బుధవారం ఆ చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాకి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించగా.. ఆర్.మహేంద్రన్, వివేక్ కృష్ణానితో కలిసి సీనియర్ నటుడు కమల్‌హాసన్ సంయుక్తంగా నిర్మించారు. ఆరు రోజుల్లోనే అమరన్ మూవీ రూ.155 కోట్ల వరకు వసూళ్లని రాబట్టింది. ఈ సక్సెస్ మీట్‌కి చీఫ్ గెస్ట్‌గా హీరో నితిన్ వచ్చాడు.
అమరన్‌ని అక్కున చేర్చుకున్నారు
ఈ సక్సెస్ మీట్‌లో సాయి పల్లవి మాట్లాడుతూ ‘‘అమరన్ ఇంతటి విజయాన్ని ఇచ్చిన తెలుగు ఆడియెన్స్‌కి థ్యాంక్స్. తమిళ్ సినిమాని ఒక తెలుగు సినిమాలా మీరు అక్కున చేర్చుకున్నారు. అమరన్ రిలీజ్ రోజున చాలా మంది టాలీవుడ్ యాక్టర్లు, డైరెక్టర్లు నాకు కాల్ చేశారు. మల్టీప్లెక్స్‌లోనే కాదు.. సింగిల్ థియేటర్స్‌లోనూ ప్రేక్షకుల స్పందనని నాకు చెబుతూ అభినందించారు. నేను ప్రేక్షకుల హావభావాల్ని చూడలేకపోయాను. కానీ.. ఫోన్‌లో వాళ్లు చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. లాంగ్వేజ్ ఏదైనా.. సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటారు’’ అని చెప్పుకొచ్చింది.
భానుమతి.. వెన్నెల.. ఇప్పుడు ఇందు
‘‘ఇన్నాళ్లు భానుమతి, వెన్నెల.. ఇప్పుడు ఇందు రెబెకా వర్గీస్ అనగానే తెలుగు వారు పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు. నాకు ఈ అభినందనలు దక్కడానికి కారణం డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి. తను 7 ఏళ్ల తర్వాత ఈ సినిమా చేశారు. ఈ ఏడేళ్లు పడిన కష్టానికి తగిన ఫలితం దక్కింది. నాకు చాలా మంది టాలీవుడ్ నుంచి కాల్ చేసి.. సినిమా చాలా బాగా తీశాడని డైరెక్టర్‌ని అభినందించి.. ఆ విషయం డైరెక్టర్‌కి చెప్పమని చెప్పారు. ఈ అభినందనలకి డైరెక్టర్ అర్హుడు ’’ అని సాయి పల్లవి గుర్తు చేసుకుంది.
‘‘శివ కార్తికేయన్‌ని తెలుగింటి అబ్బాయిగా అభిమానులు స్వీకరించారు. శివ కార్తికేయన్ అంటున్నాడు నాతో నీకు తమిళ్‌లో పెద్ద బ్లాక్‌బాస్టర్ వచ్చిందని.. నేను ఇప్పుడు అంటున్నాను.. నాతో శివ కార్తికేయన్‌కి తెలుగులో బ్లాక్‌బాస్టర్ వచ్చింది’’ అంటూ సాయి పల్లవి నవ్వేసింది.
మా నాన్న కూడా డ్యూటీలోనే చనిపోయారు
శివ కార్తికేయన్ మాట్లాడుతూ ‘‘అమరన్ మూవీని తెలుగు వాళ్లు చాలా ప్రేమా స్వీకరించారు. థియేటర్లలో ఎమోషనల్ అయ్యి.. కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలను నేను చూశాను. అమరన్ మూవీలో ముకుంద్ క్యారెక్టర్ చేయడానికి కారణం.. మా నాన్న. ఆయన కూడా పోలీస్ ఆఫీసర్.. డ్యూటీలోనే చనిపోయారు. సినిమా రిలీజ్ రోజు నుంచి నితిన్ ప్రతిరోజూ కాల్ చేసి అప్‌డేట్స్ చెప్తున్నారు’’ అని వెల్లడించాడు.
సాయి పల్లవితో డ్యాన్స్ చేయాలనుంది
హీరో నితిన్ మాట్లాడుతూ ‘‘తమిళ్ డబ్బింగ్ సినిమాలా కాకుండా.. అమరన్‌ని స్ట్రయిట్ తెలుగు సినిమాలా చూశారు. సాయి పల్లవి, కమల్ హాసన్ (ప్రొడ్యూసర్) కోసం ఈ సినిమాని మా నాన్న (సుధాకర్ రెడ్డి) తీసుకున్నారు. క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీన్స్ చాలా హార్ట్ టచింగ్‌గా ఉన్నాయి. సాయి పల్లవి డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెతో కలిసి సినిమాలో డ్యాన్స్ చేయాలనుంది. గత నాలుగేళ్లుగా కార్తికేయన్‌తో ఫోన్‌లో టచ్‌లో ఉన్నా.. కానీ నేరుగా కలవలేకపోయాను. ఎట్టకేలకు ఇప్పటికి కుదిరింది’’ అని చెప్పుకొచ్చాడు.