Nayanthara Controversies: నిత్యం వివాదాల్లో నయనతార, అప్పట్లో ముగ్గురు స్టార్ హీరోయిన్స్‌తో గొడవ, ఇద్దరు నటులతో బ్రేకప్
Nayanthara: Beyond The Fairytale: నయనతార డాక్యుమెంటరీ వివాదం ఇంకా కొనసాగుతోంది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీలో వాడిన 3 సెకన్ల క్లిప్‌ను తొలగించాలని హీరో ధనుష్ నోటీసుల పంపడంతో ఈ వివాదం రాజుకుంది.
లేడీ సూపర్ స్టార్ నయనతార చుట్టూ నిత్యం వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కెరీర్ ఆరంభం నుంచి హీరోలతోనే కాదు, హీరోయిన్స్, ప్రొడ్యూసర్స్‌తో కూడా నయనతారకి గొడవలైన సందర్భాలు ఉన్నాయి. గత నాలుగు రోజుల నుంచి తమిళ్ హీరో ధనుష్, నయనతార మధ్య ‘నేనూ రౌడీనే’ మూవీ క్లిప్పింగ్‌ని వినియోగించడంపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
3 సెకన్ల క్లిప్‌తో మొదలైన వివాదం
నెట్‌ఫ్లిక్స్‌లో సోమవారం నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీలో ఆ మూవీకి సంబంధించిన 3 సెకన్ల క్లిప్‌ను వాడినందుకు.. ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన ధనుష్ రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ నోటీసులు పంపారు. ఆ నోటీసులపై ఘాటుగా బహిరంగ లేఖతో స్పందించిన నయనతార పెద్ద వివాదంగా మార్చేసింది. ఎంతలా అంటే? ఇప్పుడు సౌత్‌లోని చాలా మంది హీరోయిన్స్ రెండు వర్గాలుగా విడిపోయి మరీ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు.
ముగ్గురు హీరోయిన్స్‌తో గొడవ
వాస్తవానికి నయనతారకి వివాదాలు ఏమీ కొత్త కాదు. గతంలో అజిత్‌తో కలిసి బిల్లా సినిమా చేసే సమయంలో.. హీరోయిన్ నమితతో గొడవపడింది. దాంతో ఇద్దరూ కలిసి కొన్ని సీన్స్ చేసినా కనీసం సెట్స్‌లో మాట్లాడుకోలేదని ఓ ఇంటర్వ్యూలో నయనతార స్వయంగా వెల్లడించింది. అలానే అప్పట్లో నయనతారతో నెం.1 స్థానం కోసం పోటీపడిన త్రిష, శ్రియతో కూడా విభేదాలు వచ్చినట్లు నయనతార చెప్పుకొచ్చింది.
శింబుతో ప్రేమయాణం
హీరోల విషయానికి వస్తే తొలుత శింబుతో ప్రేమాయణం నడిపిన నయనతార.. అతనికి చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యింది. ఈ మేరకు కొన్ని పర్సనల్ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ.. ఆ తర్వాత భేదాభిప్రాయాలతో ఇద్దరూ విడిపోయారు.
ప్రభుదేవాతో పెళ్లి వరకూ?
శింబుతో విడిపోయిన కొన్నాళ్లకే ప్రభుదేవాతో నయనతార డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ.. ప్రభుదేవా భార్య లీగల్ ఇష్యూస్‌ని తెరపైకి తీసుకురావడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది.
ప్రొడ్యూసర్స్ ఫిర్యాదులు
సినిమాల కోసం సౌత్‌లో భారీగా రెమ్యూనరేషన్ తీసుకునే నయనతార.. మూవీ ప్రమోషన్స్‌కి మాత్రం హాజరవదు. ఈ విషయంలో ఇప్పటికీ నిర్మాతలు ఆమెపై ఫిర్యాదు చేస్తుంటారు. ‘నేనూ రౌడీనే’ సినిమా ప్రొడ్యూసరైన ధనుష్ కూడా అప్పట్లో ఆ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోవడానికి కారణం నయనతార అని ఆరోపించారు. ఇప్పుడు నయనతార ఆ మూవీ క్లిప్పింగ్‌నే ధనుష్ అనుమతి లేకుండా వాడటం ద్వారా వివాదానికి తెరదీసింది.