ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ తన విద్యార్హతను ప్రశ్నిస్తూ తన తెలివితేటలను కించపరిచిన ఒక ట్రోల్‌కు గట్టిగా సమాధానం ఇచ్చింది. ఎక్స్ వేదికగా ఆమె చేసిన ఒక రాజకీయ పోస్ట్‌పై ఓ వ్యక్తి స్పందిస్తూ.. ఆ ట్రోల్ ఆమె ChatGPTని ఉపయోగించి 'వ్యంగ్య ట్వీట్‌లు' చేస్తోందని కూడా ఆరోపించాడు. దీనికి ఆమె గట్టిగానే బదులిచ్చింది.
ఖుష్బూ సుందర్ ఇటీవల తన అభిప్రాయాన్ని పంచుకుంటూ ఎక్స్ లో ఒక రాజకీయ పోస్ట్ చేసింది. దానికి స్పందించిన ఒక వ్యక్తి ఇలా రాశాడు. "నిజంగానే వ్యంగ్య ట్వీట్‌లు చేయగలరా లేక దీనికి chatgptని ఉపయోగిస్తున్నారా.. లాఫింగ్ ఔట్ లౌడ్‌లీ (నవ్వుతున్న ఎమోజీ) మీ 8వ తరగతి చదువు మాకు తెలుసు" అని రిప్లై ఇచ్చాడు.
ఈ కామెంట్‌ను ఖుష్బూ తిరిగి ట్వీట్ చేస్తూ.. ప్రముఖ కార్యకర్త, రాజకీయ నాయకుడు కుమారస్వామి కామరాజ్ కూడా నాలుగో తరగతికి మించి చదువుకోలేదని గుర్తు చేసింది.
"తెలివితేటలు అనేవి మీ అకాడమిక్ రిపోర్ట్ కార్డు ఫలితాల గురించి కాదు. తెలివితేటలు అంటే జీవితం మీకు ఏమి నేర్పిస్తుందనే దాని గురించి. కామరాజర్ లాంటి గొప్ప రాజనీతిజ్ఞుడు కూడా నాలుగో తరగతి కంటే ఎక్కువగా చదువుకోలేకపోయారు బ్రదర్. కాబట్టి ప్రశాంతంగా ఉండండి. నా ఆలోచనలను వ్యక్తం చేయడానికి నాకు chatgpt అవసరం లేదు" అని ఖుష్బూ స్పందించింది.
నటి, రాజకీయ నాయకురాలు అయిన ఖుష్బూ.. ముంబైలోని స్వామి ముక్తానంద హైస్కూల్‌లో చదివింది. కానీ తన చదువును పూర్తి చేయడం కంటే నటనపై దృష్టి పెట్టవలసి వచ్చింది. 1980లో వచ్చిన 'బర్నింగ్ ట్రైన్' సినిమాలో 10 ఏళ్ల వయసులో నటనను ప్రారంభించిన తర్వాత ఆమె 'నసీబ్', 'లావారిస్', 'కాలియా', 'దర్ద్ కా రిష్తా' 'బేమిసాల్' వంటి సినిమాలలో నటించింది.
పెద్దయ్యాక ఆమె అరంగేట్రం 1985లో వచ్చిన 'మేరీ జంగ్' లో అనిల్ కపూర్ చెల్లెలిగా, అదే సంవత్సరం 'జాను' లో జాకీ ష్రాఫ్ సరసన నటించింది. ఆ తర్వాత ఆమె తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో అనేక చిత్రాలలో నటించింది. చివరికి ఖుష్బూ దక్షిణాదిలో పాపులర్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఆమె అభిమానులు ఆమె గౌరవార్థం ఒక గుడిని కూడా నిర్మించారు. ఆమె 2000వ సంవత్సరంలో దర్శకుడు, నటుడు సుందర్ ని పెళ్లి చేసుకుంది. వారికి అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ఖుష్బూ 2010లో రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఆమె చివరిసారిగా తమిళ చిత్రం 'నెసిప్పాయ' లో నటించింది. ప్రస్తుతం తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షురాలిగా ఉంది.
సంబంధిత కథనం