Ghaati Glimpse: బస్ అద్దంలో చూస్తూ కసిగా మనిషి తల తెంపిన అనుష్క శెట్టి.. ఆ తలతో తాపీగా వెళ్లి భాంగ్ తాగుతూ రిలాక్స్
Anushka Shetty Ghaati Glimpse: అరుంధతి, భాగమతిలో అనుష్క శెట్టి పవర్‌ఫుల్ రోల్స్ చేసింది. కానీ.. ఘాటీ గ్లింప్స్‌లో చూస్తుంటే ఈ సినిమాలో అంతకు మించి అనేలా ఉంది.
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి చాలా రోజుల తర్వాత మళ్లీ పవర్‌ఫుల్ లేడీ ఓరియెంటెడ్ మూవీతో వస్తోంది. ఈరోజు (నవంబరు 7) అనుష్క శెట్టి పుట్టిన రోజు సందర్భంగా.. ఆమె నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఘాటి’ నుంచి గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజుతో షూటింగ్ కూడా పూర్తి చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
చేతుల నిండా రక్తం
గ్లింప్స్‌లో అనుష్క శెట్టి ఇప్పటి వరకూ చూడనిరీతిలో చాలా క్రూరంగా కనిపించింది. పాడేరు బ్యాక్‌డ్రాప్‌లో సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీలో అనుష్క శెట్టి అత్యంత క్రూరంగా ఒక మనిషి తలని.. అది కూడా బస్ మిర్రర్‌లో చూస్తూ కసిగా కోయడం గ్లింప్స్‌లో కనిపించింది. ఆ తర్వాత ఆ తలని చేత్తో తీసుకెళ్లి.. ఒక చోట పెట్టి తాపీగా భాంగ్ తాగుతూ రిలాక్స్ అవుతున్నట్లు గ్లింప్స్‌లో చూపించారు. ఆ భాంగ్ తాగే సమయంలో అనుష్క శెట్టి చేతుల నిండా రక్తం ఉంది.
రెండోసారి క్రిష్‌తో అనుష్క సినిమా
ఈరోజు ఉదయం వదిలిన పోస్టర్‌లో విక్టిమ్...క్రిమినల్...లెజెండ్ అంటూ అనుష్క శెట్టి క్యారెక్టర్‌ను పరిచయం చేసినక్రిష్.. గ్లింప్స్‌లో అనుష్క శెట్టి క్యారెక్టర్ మూవీలో ఎలా ఉండబోతోందో స్పష్టంగా చెప్పేశాడు. గతంలో క్రిష్ దర్శకత్వంలో అనుష్క శెట్టి వేదం సినిమాలో నటించింది. ఆ సినిమాలో వేశ్య పాత్రలో నటించి మెప్పించిన అనుష్క శెట్టి.. అరుంధతి, భాగమతి తర్వాత ఆ తరహాలో పవర్‌ఫుల్ రోల్‌ను ఘాటీలో చేస్తోంది. దాంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
ఘాటీపైనే గంపెడాశలు
వాస్తవానికి అనుష్క శెట్టికి ఇప్పుడు సౌత్‌లో సాలిడ్ హిట్ కావాలి. గత నాలుగేళ్లలో ఆమెకి చెప్పుకోదగ్గ హిట్ రాలేదు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా విమర్శకుల్ని మెప్పించినా.. ఆశించిన మేర వసూళ్లు మాత్రం రాలేదు. దాంతో ఈ ఘాటీపై ఈ ముద్దుగుమ్మ గంపెడాశలు పెట్టుకుంది. మరోవైపు క్రిష్‌కి కూడా ఈ సినిమా హిట్ కావడం చాలా అవసరం. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న హరిహర వీరమల్లు మూవీ సడన్‌గా చేజారింది. దాంతో ఇప్పుడు ఈ ఘాటీతో కమ్ బ్యాక్ చేయాలని క్రిష్ ఆశిస్తున్నాడు.