Chaitanya, Sobhita Wedding Date: నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల పెళ్లి తేదీ ఖరారు, వివాహ వేదిక కూడా ఫిక్స్
Naga Chaitanya, Sobhita Dhulipala wedding: అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశితార్థం చేసుకున్నప్పటి నుంచి వారి పెళ్లి తేదీ, వివాహ వేదిక గురించి జోరుగా చర్చ జరుగుతూనే ఉంది. ఎట్టకేలకి మంగళవారం క్లారిటీ వచ్చేసింది.
హీరో అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహానికి వేదికతో పాటు ముహూర్తాన్ని కూడా కుటుంబ సభ్యులు ఖరారు చేశారు. దాదాపు రెండేళ్లు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఈ ఏడాది ఆగస్టు 9న హైదరాబాద్‌లో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి పెళ్లి తేదీ, వేదికపై జోరుగా చర్చ జరుగుతూనే ఉంది.
నిశ్చితార్థం విషయాన్ని ఆఖరి నిమిషం వరకూ గోప్యంగా ఉంచిన అక్కినేని, దూళిపాళ్ల కుటుంబ సభ్యులు, వివాహ వేదికపై కూడా గోప్యత పాటిస్తూ వచ్చారు. కానీ.. ఎట్టకేలకి తేదీ, ప్లేస్ వార్త వెలుగులోకి వచ్చేసింది.
వేదికను ఫిక్స్ చేసిన నాగార్జున
వాస్తవానికి నాగచైతన్య, శోభితా వివాహం తెలంగాణలోని ఓ ప్రముఖ దేవాలయంలో జరగబోతున్నట్లు వార్తలు వచ్చాయి. శోభితా కూడా ఆ మేరకు సంకేతాలిచ్చింది. ఆ తర్వాత డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు కూడా రూమర్స్ వినిపించాయి. కానీ.. అన్నింటికీ చెక్ చెబుతూ డిసెంబరు 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహం చేయాలని అక్కినేని నాగార్జున నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అక్కినేని ఫ్యామిలీకి అన్నపూర్ణ స్టూడియోస్ సెంటిమెంట్‌గా వస్తోంది. ఇప్పటికే ఆ స్టూడియోస్‌లో ఏఎన్నార్‌కి నివాళిగా విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి చేసుకుంటే తాత ఆశీస్సులు కూడా లభిస్తాయని అక్కినేని నాగచైతన్య చెప్పినట్లు తెలుస్తోంది.
డిసెంబరు 4న ముహూర్తం కూడా ఖరారైంది. కానీ.. వివాహ ముహూర్తం ఉదయమా లేదా సాయంత్రమా అనేది మాత్రం అధికారికంగా ఇంకా వెల్లడించలేదు.
సమంతతో విడిపోయిన తర్వాత
సమంత, నాగచైతన్య 2017లో వివాహం చేసుకోగా.. భేదాభిప్రాయాలతో 2021లో విడిపోయారు. ఆ తర్వాత 2022 నుంచి శోభితతో నాగ చైతన్య డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి. ఈ ఇద్దరూ వెకేషన్స్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. కానీ.. డేటింగ్ విషయాన్ని మాత్రం ఈ జంట గోప్యంగా ఉంచుతూ వచ్చింది.
నిశ్చితార్థం తర్వాత తొలిసారి ఇటీవల జరిగిన ఏఎన్నార్ అవార్డుల వేడుకలో ఇద్దరూ సందడి చేశారు. చందూ మొండేటి దర్శకత్వంలో సాయిపల్లవితో కలిసి తండేల్ సినిమాలో నాగచైతన్య ప్రస్తుతం నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న పాన్ ఇండియా మూవీగా రిలీజ్‌కానుంది.