Naga Chaitanya Sobhita wedding Date: నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి తేదీ, వేదికపై క్లారిటీ, అతిథులు జాబితా సిద్ధం
Naga Chaitanya wedding Date: నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల రెండేళ్లు డేటింగ్‌లో ఉండి.. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి వివాహం తేదీ, వేదికపై తాజాగా క్లారిటీ వచ్చేసింది.
అక్కినేని ఇంట మళ్లీ పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఇటీవల నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకోగా.. ఈ జంట త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ మేరకు అక్కినేని, ధూళిపాళ్ల ఫ్యామిలీలు పెళ్లి తేదీ, వివాహ వేదికపై కూడా ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.
నిశ్చితార్థం తర్వాత పెళ్లి తేదీ ప్రకటన కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 4న ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ముహూర్తంతో పాటు వేదిక కూడా ఖరారైనప్పటికీ అధికారికంగా ప్రకటించడం లేదని తెలుస్తోంది. డిసెంబరు 4న ఉదయం లేదా సాయంత్రం వివాహం జరిగే అవకాశం ఉందని సమాచారం.
చైతన్య, శోభితల వివాహం తొలుత రాజస్థాన్‌లో జరుగుతుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత విదేశాల్లో జరపబోతున్నారని కూడా ఊహాగానాలు వినిపించాయి. ఇలా నాలుగైదు లొకేషన్స్‌ను పరిశీలించిన తర్వాత చివరికి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
నాగచైతన్య, శోభితల పెళ్లిని చాలా నిరాడంబరంగా నిర్వహించాలని అక్కినేని ఫ్యామిలీ భావిస్తోందట. శోభిత కుటుంబ సభ్యులతో పాటు అక్కినేని, దగ్గుబాటి కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉండగా, అతిథుల జాబితాను వీలైనంత వరకు తగ్గించి తమకు అత్యంత సన్నిహితులను మాత్రమే చేర్చుకోవాలని ఈ జంట యోచిస్తున్నట్లు సమాచారం.
సమంతతో నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత శోభితతో డేటింగ్‌లో ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ.. రెండేళ్ల పాటు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించని ఈ జంట.. ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకుని అందరికీ క్లారిటీ ఇచ్చింది. ఇటీవల జరిగిన ఏఎన్నార్ అవార్డ్స్ వేడుకలోనూ తొలిసారి బహిరంగంగా జంటగా అభిమానులకి కనిపించింది.
పెళ్లి పనులు కూడా ఇటీవల ప్రారంభమయ్యాయి. శోభిత తన ఇంట్లో గోధుమరాయి పసుపు దంచుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఒకవేళ ఎన్-కన్వెన్షన్ ఉండి ఉంటే.. అందులోనే చైతన్య, శోభితల వివాహం జరిగేది.
ఎంతో మంది సెలెబ్రిటీల వివాహానికి ఆతిథ్యమిచ్చిన ఎన్-కన్వెన్షన్ ఇప్పుడు లేకపోవడంతో.. అన్నపూర్ణ స్టూడియోలోనే సెట్‌ను ఏర్పాటు చేసి అందులో వివాహం చేయబోతున్నారు. ఈ మేరకు ఆర్ట్ డైరెక్టర్‌కి అక్కినేని నాగార్జున బాధ్యతలు అప్పగించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
అక్టోబరు 7, 2017న నాగచైతన్య, సమంతల వివాహం గోవాలోని వెగాటర్ బీచ్‌లోని డబ్ల్యూ రిసార్ట్‌లో అప్పట్లో వైభవంగా జరిగింది. కానీ.. నాలుగేళ్లలోనే ఈ జంట విడిపోయింది. ఇప్పుడు సమంత తాను ఒంటరిగా ఉంటానంటూ ప్రకటిస్తుండగా.. మూడేళ్ల వ్యవధిలో నాగచైతన్య మళ్లీ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నాడు.