Kanguva Trailer: కంగువా రిలీజ్ ట్రైలర్ విడుదల.. ఎదురిస్తా.. ఎదురు ఇస్తానంటూ సూర్య మాస్ వార్నింగ్
Suriya in Kanguva: కంగువా రిలీజ్ ముంగిట ఆ సినిమా నుంచి మరో ట్రైలర్ రిలీజైంది. తమిళ్ బాహుబలిగా అభివర్ణిస్తున్న ఈ సినిమాపై ఈ ట్రైలర్‌తో అంచనాలు రెట్టింపయ్యాయి.
కంగువా సినిమా రిలీజ్ ముంగిట చిత్ర యూనిట్.. రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసింది. శివ దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో సూర్య, బాబీ డియోల్, దిశా పటానీ తదితరులు నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది.
ఇప్పటికే కంగువా సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కానీ.. ఆదివారం మరో ట్రైలర్‌ను రిలీజ్ ట్రైలర్ పేరిట విడుదల చేసి.. సినిమాపై అంచనాల్ని మరింత పెంచింది. ఈ సినిమా రెండు టైమ్ లైన్లలో జరుగుతుందని తెలుస్తోంది.
వాస్తవానికి ఈ ట్రైలర్‌ను ఆదివారం సాయంత్రం విడుదల చేయాలని భావించారు. కానీ.. వాయిదాల తర్వాత ఎట్టకేలకు రాత్రి విడుదలైంది. 1 నిమిషం 30 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో పెద్దగా సీక్రెట్స్ రివీల్ చేయలేదు. కానీ.. సూర్య యోధుడిగా, సామాన్యుడిగా రెండు పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సూర్య పీటీఐతో మాట్లాడుతూ ‘‘కంగువా' సినిమా తీయడం వెనుక స్ఫూర్తి బ్రేవ్హార్ట్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, అపోకలిప్టో వంటి సినిమాలు. వాటిని చాలా సార్లు చూశా. అలానే ఆస్వాదించాను. ఇప్పుడు అలాంటి సినిమా చేశాం’’ అని చెప్పుకొచ్చాడు.
ఈ సినిమాలో ఇంకా జగపతి బాబు, నటరాజన్ సుబ్రమణ్యం, యోగిబాబు, కోవై సరళ, ఆనందరాజ్, కేఎస్ రవికుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
వాస్తవానికి ఈ సినిమా గురించి నాలుగేళ్ల నుంచి చర్చ జరుగుతోంది. అప్పట్లో కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఆగిపోయిన ఈ చిత్రం 2022లో మళ్లీ తెరపైకి వచ్చి 2024లో థియేటర్లలోకి వస్తోంది.
కంగువా మూవీపై తెలుగులోనూ భారీగా అంచనాలు ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. తెలుగులో బాహుబలి ఎలానో.. తమిళ్‌లో కంగువా కూడా బాహుబలి లాంటి సినిమా అని అక్కడి మీడియా ప్రచారం చేస్తోంది. ఈ సినిమా కనీసం రూ.1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని కంగువా ప్రొడ్యూసర్ జోస్యం చెప్తున్నారు.