Sonu Sood: సౌదీ అరేబియా నుంచి మృతదేహం తీసుకురావడానికి హైదరాబాద్ ఫ్యామిలీకి సోనూసూద్ సాయం
Sonu Sood: కోవిడ్-19 సమయంలో వేలాది మంది వలస కార్మికులు స్వగ్రామాలకి వెళ్లడానికి సాయం చేసిన సోనూసూద్ ఆ తర్వాత కూడా తన సాయంపరంపరని కొనసాగిస్తున్నారు.
Sonu Sood helps Hyderabad family: సౌదీ అరేబియాలో గుండెపోటుతో ఇటీవల మరణించిన హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో బాధిత కుటుంబానికి నటుడు సోనూసూద్ సాయం చేశారు. ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ఆ కుటుంబానికి సోనూసూద్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సౌదీ సిమెంట్ హోఫుఫ్ ప్లాంట్‌లో పనిచేస్తున్న తన మామ గుండెపోటుతో చనిపోయారని @bravo7781 అనే నెటిజన్ ఆగస్టు 2న ఎక్స్‌లో షేర్ చేశారు. అయితే మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావాల్సి ఉందని.. దానికి సాయం చేయాల్సిందిగా సోనూసూద్‌ను ఆ నెటిజన్ అభ్యర్థించారు.
సౌదీ నుంచి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు సాయం చేసిన సోనూసూద్ ఆ వ్యక్తి ఐడీ కార్డును మంగళవారం షేర్ చేస్తూ ‘‘ సాయంత్రం 4.35 గంటలకు పార్థివదేహం హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకోనుంది. సహాయం చేసినందుకు ధన్యవాదాలు గిరీశ్ పంత్ భాయ్. మరోసారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'’ అని సోనూసూద్ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఈ క్రమంలో తనకి సాయపడిన గిరీశ్ పంత్‌ని కూడా సోనూసూద్ ట్యాగ్ చేశారు.
ఆగస్టు 2న @bravo7781 అనే నెటిజన్ సోనూసూద్‌ని ట్యాగ్ చేస్తూ మృతి చెందిన వ్యక్తి వివరాలను ఎక్స్‌లో తెలియజేశారు. ‘‘ప్రియమైన సోనూసూద్ సర్, సౌదీ సిమెంట్ హోఫుఫ్ కర్మాగారంలో పనిచేస్తున్న మా మామయ్య గుండెపోటుతో చనిపోయారు. ప్రస్తుతం ఆయన మృతదేహం సౌదీ అరేబియాలోని కింగ్ ఫైజల్ జనరల్ ఆసుపత్రిలో ఉంది. ఆయన మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరుతున్నాను. దయచేసి మాకు సహాయం చేయండి సార్’’ అని అభ్యర్థించారు. దాంతో స్పందించిన సోనూసూద్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని సమాధానం ఇచ్చారు.
కరోనా నుంచి సోనూసూద్ సాయం
కోవిడ్ -19 మహమ్మారి సమయంలో వేలాది మంది వలస కార్మికులను వారి స్వగ్రామాలకి సోనూసూద్ చేర్చారు. 2020లో మొదటి లాక్డౌన్ ప్రకటించినప్పుడు చిక్కుకుపోయిన వలస కార్మికుల కోసం చార్టర్డ్ విమానాలు, బస్సులను సోనూసూద్ బుక్ చేశారు. అప్పటి నుంచి నిత్యం ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తూనే ఉన్నారు.
ఇటీవల బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన తోటి భారతీయులను రక్షించడానికి సహాయం చేయాలని సోనూసూద్‌కి ఎక్స్ ద్వారా కొంత మంది భారత పౌరులు విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్‌లో తన లాంటి వారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉందంటూ ఓ భారతీయ మహిళ బాధను వ్యక్తం చేస్తున్న వీడియోను కూడా సోనూసూద్ షేర్ చేశారు.
‘‘బంగ్లాదేశ్ నుంచి మన తోటి భారతీయులందరినీ స్వదేశానికి రప్పించడానికి మీ వంతు సాయం చేయండి. తద్వారా వారికి ఇక్కడ మంచి జీవితం లభిస్తుంది. ఇది కేవలం మన ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, మనందరి బాధ్యత కూడా. జై హింద్’’ అని సోనూసూద్ రాసుకొచ్చారు.
ఫతేతో ప్రేక్షకుల ముందుకు సోనూ
స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫతే సినిమా ద్వారా 2025 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు సోనూసూద్ రానున్నారు. ఈ మూవీలో నసీరుద్దీన్ షా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో కలిసి సోనూసూద్ నటించారు. సైబర్ క్రైమ్ ఘటనల ఆధారంగా తీస్తున్న చిత్రమిది. జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ పతాకాలపై ఈ సినిమా రూపొందుతోంది.