Actor Siddharth: ఒక్క మహిళా వీధుల్లో లేదు ఎందుకు: ఆర్సీబీ విజయంపై నటుడు సిద్ధార్థ్ ట్వీట్ వివాదం
Actor Siddharth: ఆర్సీబీ టీమ్ వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024) టైటిల్ గెలిచిన తర్వాత నటుడు సిద్ధార్థ్ చేసిన ట్వీట్ వివాదానికి కారణమైంది. ఒక్క మహిళా వీధుల్లోకి వచ్చి ఎందుకు సెలబ్రేట్ చేసుకోవడం లేదంటూ అతడు ప్రశ్నించాడు.
Actor Siddharth: తమిళ నటుడు సిద్ధార్థ్ తరచూ తన తీరుతో ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటాడు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత నెటిజన్లు కూడా అతని వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024) గెలిచిన తర్వాత సిద్ధార్థ్ చేసిన ట్వీట్ కూడా దుమారానికి కారణమైంది.
ఆర్సీబీ గెలుపుపై సిద్ధార్థ్ ట్వీట్ ఇదీ
ఆర్సీబీ గెలిచిన తర్వాత బెంగళూరులోని అభిమానులు వీధుల్లోకి వచ్చిన పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. 16 ఏళ్లుగా ఐపీఎల్ గెలవకపోయినా.. రెండో సీజన్లోనే డబ్ల్యూపీఎల్ గెలవడంతో ఆ ఫ్యాన్స్ ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఇదే వీడియోను సిద్ధార్థ్ షేర్ చేస్తూ.. వాళ్లలో ఒక్క మహిళ కూడా ఎందుకు లేదని ప్రశ్నించాడు. దీనికి దేశంలోని పితృస్వామ్య వ్యవస్థే కారణమంటూ ఓ పెద్ద ఆరోపణ కూడా చేశాడు.
"ఓ మహిళల జట్టు టోర్నమెంట్ గెలిచింది కానీ వీధుల్లో సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక్క మహిళ కూడా లేదు. ఇండియాలోని సర్వోత్కృష్టమైన పితృస్వామ్య వ్యవస్థకు ఇది నిదర్శనం" అని సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. ఇది నెటిజన్లకు అసలు అంతుబట్టలేదు.. అసలు నీ ఉద్దేశం ఏంటి.. మహిళల విజయాన్ని పురుషులు సెలబ్రేట్ చేసుకోకూడదా అంటూ అతన్ని నిలదీశారు.
దీంతో సిద్ధార్థ్ తన మునుపటి ట్వీట్ పై స్పష్టత ఇస్తూ మరో ట్వీట్ చేశాడు. "పైన ఉన్న ట్వీట్ పై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. ఇండియాలోని పబ్లిక్ ప్లేస్ లలో మహిళలు స్వేచ్ఛగా తిరగలేరన్నది నా ఉద్దేశం. ముఖ్యంగా రాత్రి సమయాల్లో. ఓ మహిళల జట్టు గెలిచిన సందర్భంలోనూ పురుషుల్లాగే మహిళలు కూడా వీధుల్లో సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారన్నదే చెప్పాలనుకున్నాను" అని సిద్ధార్థ్ వివరణ ఇచ్చాడు.
ఆ తర్వాత కూడా చాలా మంది అభిమానులు సిద్ధార్థ్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. అసలు నువ్వు ఏం చెప్పాలనుకున్నావో ఇక్కడున్న ఎవరికీ అర్థం కాలేదని ఓ అభిమాని అనడంతో నేనేం చేయలేను అన్నట్లుగా ఎస్ఎంహెచ్ (షేకింగ్ మై హెడ్) అనే అక్షరాలను సిద్ధార్థ్ పోస్ట్ చేశాడు.
సిద్ధార్థ్ ఏం చేస్తున్నాడంటే..
సిద్ధార్థ్ ఈ మధ్య చాలా వరకూ సినిమాలకు దూరంగా ఉన్నాడు. గతేడాది చిన్నా అనే మూవీలో నటించాడు. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పిల్లలపై లైంగిక వేధింపుల చుట్టూ తిరిగే కథ ఇది. ఇక ఇప్పుడతడు కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2లోనూ కనిపించనున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.
మరోవైపు డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ లో ఆర్సీబీ 8 వికెట్లతో గెలిచిన విషయం తెలిసిందే. ఆదివారం (మార్చి 17) రాత్రి జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ను స్మృతి మంధానా నేతృత్వంలోని ఆర్సీబీ ఓడించింది. 2008లోనే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్సీబీ ఆ మెగా లీగ్ గెలవకపోయినా..మహిళల టీమ్ మాత్రం తమ ఫ్రాంఛైజీకి తొలి టైటిల్ సాధించి పెట్టింది.
టాపిక్