Sai Pallavi: నాగ చైతన్య అలా పిలవగానే తండేల్ ప్రెస్‌మీట్‌లో సిగ్గుపడిపోయిన సాయి పల్లవి, కేరింతలతో మార్మోగిన ఆడిటోరియం
Naga Chaitanya in Thandel Press Meet: నాగచైతన్య, సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ మూవీ తర్వాత.. తండేల్ కోసం మరోసారి జతకట్టారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ఈరోజు చిత్ర యూనిట్ ప్రకటించింది.
అక్కినేని నాగచైతన్య , సాయి పల్లవి జంటగా నటిస్తున్న తండేల్ మూవీ రిలీజ్ డేట్‌ని అధికారికంగా మంగళవారం (నవంబరు 5)న చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సాయి పల్లవి గురించి మాట్లాడిన నాగచైతన్య ప్రశంసల వర్షం కురిపించాడు.
చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ తండేల్ మూవీని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. 2025, ఫిబ్రవరి 7వ తేదీని తండేల్ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ ప్రెస్‌మీట్‌లో నాగచైతన్య మాట్లాడుతూ సాయి పల్లవితో డ్యాన్స్ చేయడం చాలా కష్టమని.. సినిమాలో తన సీన్స్ గురించే కాకుండా అందరి సీన్స్, వారి గురించి కూడా మాట్లాడేదని గుర్తు చేసుకున్నాడు.
బాక్సాఫీస్ క్వీన్
‘‘బన్నీ వాసుతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. తండేల్ కథ వాసు దగ్గర ఉందని తెలిసి.. నేనే చొరవ తీసుకుని అడిగాను. కొన్ని నెలల తర్వాత దర్శకుడు చందుతో కలిసి వాసు నా దగ్గరికి వచ్చాడు. తండేల్ సినిమా షూటింగ్‌కి ముందు శ్రీకాకుళంకి వెళ్లి మత్స్యకారులతో కొన్ని రోజులు సమయం గడిపాం’’ అని నాగచైతన్య గుర్తు చేసుకున్నాడు.
‘‘మన బాక్సాఫీస్ క్వీన్ సాయి పల్లవి.. ఎన్నోసార్లు నాకు ఫోన్ చేసి సినిమాలో క్యారెక్టర్స్ గురించి చర్చించేది. పల్లవితో డ్యాన్స్ చేయాలంటే నాకు కొంచెం భయం. అయితే ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటూ నాకు డ్యాన్స్ విషయంలో సాయం చేసింది’’ అని నాగచైతన్య చెప్పుకొచ్చాడు. బాక్సాఫీస్ క్వీన్ అని నాగచైతన్య సంభోదించగానే వేదికపై సాయి పల్లవి సిగ్గుపడిపోగా.. ఆడిటోరియం కేరింతలతో మార్మోగిపోయింది.
టీజ్ చేస్తున్నారన్న సాయి పల్లవి
సాయి పల్లవి మాట్లాడుతూ ‘‘నాగచైతన్య గత ఏడాది డిసెంబరు నుంచి ఇప్పటి వరకు తండేల్ ప్రాజెక్ట్ మీదే ఉన్నారు. కనీసం వేరే ప్రాజెక్ట్ గురించి కూడా ఆలోచించడం లేదు. ఈ ఏడాది వ్యవధిలో లుక్ కూడా మార్చుకోలేదు. తండేల్ సినిమాపై అతనికి ఉన్న నమ్మకం ఇది. 4 సినిమాలు చేస్తే వచ్చే పేరు.. ఈ తండేల్ సినిమాతో చైతన్యకి వస్తుంది. నేనేమీ బాక్సాఫీస్ క్వీన్ కాదు.. వీళ్లు నన్ను టీజ్ చేస్తున్నారు. స్క్రిప్ట్, క్యారెక్టర్ బాగా ఉండి.. ప్రేక్షకులకి నచ్చితేనే బాక్సాఫీస్ మాటలన్నీ’’ అని చెప్పుకొచ్చింది.
సాయి పల్లవి నటించిన అమరన్ మూవీ దీపావళి రోజున విడుదలై సూపర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రిలీజైన 5 రోజుల్లో రూ.140 కోట్లకిపైగా ఈ మూవీ వసూళ్లని రాబట్టింది. ప్రస్తుతం హిందీలోనూ సాయి పల్లవి సినిమాలు చేస్తోంది.