Suriya Crush: హీరో సూర్యకి ఆ హీరోయిన్‌పై క్రష్, బాలకృష్ణ అడగ్గానే అన్న సీక్రెట్ చెప్పేసిన కార్తీ
Unstoppable with NBK: నందమూరి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకి వెంట వెంటనే సమాధానం చెప్పిన సూర్య.. ఒక ప్రశ్నకి మాత్రం సిగ్గుపడిపోతూ సమాధానం దాటవేశారు. దాంతో బాలయ్య తెలివిగా కార్తీకి ఫోన్ చేసి సమాధానం రాబట్టేశారు.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న‘అన్ స్టాప్ విత్ ఎన్‌బీకే’ టాక్ షోకి ఇటీవల వచ్చిన హీరో సూర్య.. తనకి ఇష్టమైన ఆహారం నుంచి ఫేవరెట్ సినిమా వరకూ అన్ని విషయాల్ని షేర్ చేసుకున్నారు. కానీ.. బాలయ్య అడిగిన ఒక్క ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పేందుకు సూర్య నిరాకరించారు. దాంతో ఆ ప్రశ్నకి సమాధానం కోసం సూర్య తమ్ముడు కార్తీకి ఫోన్ చేసిన బాలకృష్ణ ఎట్టకేలకి సూర్య దాచిన విషయాన్ని తెలుసుకోగలిగారు.
సూర్య తనకు ఇష్టమైన ఆహారం బిర్యానీ అని, తన నటనను చూసి గర్వపడుతున్నానని షోలో సూర్య చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మీ మొదటి క్రష్ ఏ వయసులో? ఆమె ఎవరు? అని బాలయ్య అడగ్గా సూర్య తటపటాయించాడు. బాలయ్య పట్టుబట్టినా పేరు చెప్పడానికి సూర్య నిరాకరించాడు.
కార్తీకి ఫోన్ చేసిన బాలయ్య.. సూర్య ఫస్ట్ క్రష్ ఎవరు అని అడగ్గా.. కార్తీ సమాధానమిస్తూ.. ‘‘ ఒక నటి అంటే చాలా ఇష్టం. చికుబుకు రైలే అనే పాట ఉంది కదా సార్..’’ అని కార్తీ ఆపేశాడు. దాంతో బాలయ్య ఆ సాంగ్‌ని హమ్ చేస్తూ ‘‘గౌతమినా?" అని అడిగాడు. దానికి కార్తీ అవును సార్ అని సమాధానమిచ్చారు. దాంతో బాలయ్య చాలు.. చాలు.. ఇది చాలు.. రేపు న్యూస్ పేపర్స్ ఈ న్యూస్‌తో అదిరిపోయాత్ అంటూ సూర్యని బెదరగొట్టారు. తన సీక్రెట్ రివీల్ కావడంతో సూర్య సరదాగా కోప్పడుతూ ‘‘నువ్వు కత్తిరా.. కార్తీ కాదు’’ అంటూ కోప్పడ్డారు.
1993లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన జెంటిల్‌మెన్ సినిమాలో చికుబుకు రైలే అనే స్పెషల్ సాంగ్‌లో గౌతమి, ప్రభుదేవా నటించారు. అప్పట్లో ఈ స్పెషల్ సాంగ్ దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపేసింది.
సూర్య నటించిన కంగువా మూవీ నవంబరు 14న థియేటర్లలో రిలీజ్‌కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో సూర్య బిజిబిజీగా ఉన్నాడు. బాబీ డియోల్, దిశా పటానీ తదితర స్టార్‌లు నటించిన ఈ సినిమాకి శివ దర్శకత్వం వహించాడు. తమిళ్ బాహుబలిగా కంగువా సినిమాని అక్కడి మీడియా అభివర్ణిస్తోంది. కనీసం రూ.1000 కోట్లని ఈ సినిమా వసూలు చేస్తుందని ఆ చిత్ర యూనిట్ చెప్తోంది.