Nayanthara Letter: ధనుష్‌తో వివాదంలో నయనతారకి టాప్ హీరోయిన్స్ మద్దతు, లైక్ కొట్టి మరీ సపోర్ట్, ట్విస్ట్ ఏంటంటే?
Netflix OTT: ధనుష్‌పై ఘాటుగా ఓపెన్ లెటర్‌ను నయనతార సంధిస్తే.. ఆ లెటర్‌కి గతంలో ధనుష్‌తో కలిసి నటించిన చాలా మంది హీరోయిన్స్ లైక్ కొట్టి నయన్‌కి మద్దతుగా నిలిచారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార, హీరో ధనుష్ మధ్య వివాదం రాజుకుంది. నయనతార పెళ్లితో పాటు ఆమె జర్నీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాల్ని 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే డాక్యుమెంటరీ రూపంలో రాబోతోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ మరో రెండు రోజుల్లో ఈ డాక్యుమెంటరీని స్ట్రీమింగ్‌కి ఉంచబోతోంది.
నయనతారకి నోటీసులు పంపిన ధనుష్
ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన ‘నేనూ రౌడీనే’ సినిమాలోని పాటలు, కొన్ని క్లిప్పింగ్‌ను వాడుకున్నారు. అయితే.. వాటిని డాక్యుమెంటరీలో ఉపయోగించడానికి అనుమతి ఇవ్వనందున.. అనుమతిలేకుండా వాటిని వినియోగించుకున్నందుకు రూ.10 కోట్లు పరహారం ఇవ్వాలని ధనుష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నయనతారకి నోటీసులు పంపారు.
వాస్తవానికి ఈ వ్యవహారం వివాదంగా మారకముందే సర్దుబాటు చేసుకుని ఉండాల్సింది. కానీ.. ఎక్కడో తేడా కొట్టింది. దాంతో ధనుష్‌ని లక్ష్యంగా చేసుకుని నయనతార ఒక బహిరంగ లేఖని విడుదల చేసింది. అంతేకాదు ఆ నోటీసులపై చట్టపరంగా తేల్చుకుంటానని కూడా క్లారిటీ ఇచ్చేసింది.
డాక్యుమెంటరీ కోసం వెయిటింగ్
‘‘ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా సింగిల్ ఉమెన్‌గా ఇండస్ట్రీకి వచ్చి.. ఛాలెంజింగ్‌గా హార్డ్ వర్క్, నిజాయితీతో కూడిన డెడికేషన్‌తో ఈ రోజు నేను ఉన్న స్థితికి చేరుకున్నాను. నా పాజిటివ్ జర్నీ గురించి నా అభిమానులకు, నన్ను ప్రేమించే సినీ వర్గాలకు బాగా తెలుసు. నాలానే అభిమానులు, శ్రేయోభిలాషులు నెట్‌ఫ్లిక్స్‌లో 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీ విడుదల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు’’ అని నయనతార అందులో రాసుకొచ్చింది.
‘‘ప్రేమ, పెళ్లితో సహా నా జీవితంలోని అత్యంత సంతోషకరమైన క్షణాలను చూపించే ఈ డాక్యుమెంటరీలో 'నేనూ రౌడీనే' సినిమా ప్రస్తావన గురించి ఎక్కువగా లేకపోవడం చాలా బాధాకరం. ఆ మూవీలోని విజువల్స్ , పాటలు, ఫొటోలను ఉపయోగించుకునేందుకు మీ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) కోసం రెండేళ్లు ఎదురుచూశాం. కానీ.. మాకు నిరాశే ఎదురైంది’’ అని నయనతార బాధను వ్యక్తం చేసింది.
3 సెకన్ల వీడియోకి రూ.10 కోట్లా?
‘‘ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో ఉపయోగించిన 3 సెకన్ల వీడియోపై లీగల్ నోటీసులు పంపడం షాకింగ్‌గా ఉంది. ప్రైవేట్‌గా తీసిన వీడియోకి సన్నివేశానికి రూ.10 కోట్లు డిమాండ్ చేయడం కూడా చాలా విచిత్రం. మీ అమాయక అభిమానుల కోసం వేదికపై మాట్లాడిన విధంగా మీరు ఒక శాతం కూడా ప్రవర్తించలేరని నాకు, నా భర్తకు బాగా తెలుసు. మీ చట్టపరమైన చర్యలను న్యాయపరంగా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము’’ అని నయనతార క్లారిటీ ఇచ్చింది.
నయన్‌కి టాప్ హీరోయిన్స్ మద్దతు
నయనతార పోస్టుకి సౌత్ నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. మరీ ముఖ్యంగా.. ధనుష్‌తో కలిసి గతంలో నటించిన పలువురు నటీమణులు నయనతార పోస్ట్‌కు లైకులు కొడుతుండటం ఇక్కడ ఊహించని ట్విస్ట్. ఈ జాబితాలో శ్రుతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, పార్వతి, ఐశ్వర్య రాజేష్ తదితరులు ఉండటం గమనార్హం.
నజ్రియా, కోడిలో ధనుష్‌తో అనుపమ పరమేశ్వరన్ నటించగా.. 3లో ధనుష్‌తో కలిసి శ్రుతిహాసన్ యాక్ట్ చేసింది. మరియన్ లో ధనుష్ తో కలిసి నటించిన పార్వతి, వడచెన్నైలో ధనుష్ తో కలిసి నటించిన ఐశ్వర్య రాజేష్‌లు కూడా నయనతార పోస్టుకి లైక్‌లు కొట్టారు. వీరితో పాటు ఐశ్వర్య లక్ష్మి, గౌరీ కిషన్, రియా, అంజు కురియన్, మంజిమా మోహన్, గాయత్రి శంకర్ కూడా నయనతార పోస్ట్‌కి లైక్‌లు కొట్టినవారిలో ఉన్నారు.