Abhay Naveen: బిగ్‌బాస్ విన్నర్ నిఖిల్ హీరోగా నా డైరెక్షన్‌లో సినిమా - అభయ్ నవీన్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
Abhay Naveen Interview: పెళ్లిచూపులు ఫేమ్ అభయ్ నవీన్ ప్రస్తుతం నటుడిగా, డైరెక్టర్‌గా రెండు పడవల ప్రయాణాన్ని కొనసాగిస్తోన్నారు. బిగ్‌బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న అభియ్ నవీన్ ప్రస్తుతం డైరెక్టర్‌గా లవ్ మూవీ చేస్తోన్నాడు.

Abhay Naveen Interview: ఏ లక్ష్యంతోనైతే బిగ్‌బాస్‌లో అడుగుపెట్టానో అది నెరవేరిందని అన్నాడు నటుడు అభయ్ నవీన్. నటుడిగా నాపై ఉన్న అపోహలు తొలగిపోవడానికి బిగ్‌బాస్ హెల్పయిందని చెప్పాడు. పెళ్లిచూపులు మూవీతో నటుడిగా అభయ్ నవీన్ ప్రయాణం మొదలైంది. హీరోగా, కమెడియన్‌గా తెలుగులో పలు సినిమాలు చేశాడు. రామన్న యూత్ మూవీతో డైరెక్టర్‌గా మారాడు. బిగ్‌బాస్ తర్వాత తన సినీ జర్నీ గురించి అభియ్ నవీన్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగుతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆయన ఏం అన్నారంటే...
యాక్టింగ్ మానేశానని...
బిగ్‌బాస్ తర్వాత కెరీర్ హ్యాపీగా సాగుతోంది. ప్రస్తుతం యాక్టర్‌గా మూడు సినిమాలు చేస్తోన్నా. డైరెక్టర్‌గా నేను చేస్తోన్న లవ్ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇంతకుముందు డైరెక్టర్‌గా రామన్న యూత్ సినిమా చేశా. ఆ టైమ్‌లో నేను యాక్టింగ్ మానేసి డైరెక్షన్ వైపు వెళ్లిపోయానని అందరూ అనుకున్నారు. ఆ అపోహల కారణంగా యాక్టింగ్ అవకాశాలు చేజారాయి. బిగ్‌బాస్ కారణంగా ఆ అపోహలకు పుల్‌స్టాప్ పడింది.
లవ్ స్టోరీనే ఎందుకు చేయాలి....
యాక్టర్‌గా నేను ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతోనే రామన్నయూత్ మూవీతో డైరెక్టర్‌గా మారా.డైరెక్టర్‌గా ఫస్ట్ సినిమా అంటే లవ్ స్టోరీతోనే ఎందుకు చేయాలి? పాటలు, కామెడీ లేకుండా సినిమా చేయలేమా? అనే ఆలోచనతో వైవిధ్యంగా ప్రయత్నం చేశాం. కానీ నేను అనుకున్న రిజల్ట్ రాలేదు. మన పైత్యం సినిమాలపై చూడకూడదనే విషయం రామన్న యూత్‌తో అర్థమైంది.
సినిమా చూడటానికి థియేటర్‌కు వచ్చే ఆడియెన్ రెండు గంటలు ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకుంటాడనేది తెలిసింది. ఫస్ట్ సినిమాగా రొమాంటిక్ కామెడీ అయితే బాగుంటుందని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సలహా ఇచ్చినా పట్టించుకోలేదు. రెండో సినిమాకు మాత్రం ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నా.
లైఫ్ ఆఫ్ విష్ణు అండ్ ఈషా...
నా డైరెక్షన్‌లో వస్తోన్న లవ్ మూవీ షూటింగ్ తొంభై శాతం పూర్తయింది. ఈ మూవీలో నేను హీరోగా కనిపిస్తా. విష్ణు, ఈషా అనే జంట ప్రేమకథతో ఈ మూవీ తెరకెక్కుతోంది. లైఫ్ ఆఫ్ విష్ణు అండ్ ఈషా అని కలిసివచ్చేలా మూవీకి లవ్ అనే పేరు పెట్టా. వాలెంటైన్స్ డే రోజు ఈ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. లవ్ ప్రాపర్ రొమాంటిక్ కామెడీ మూవీ. తెలంగాణ స్టైల్ కామెడీ ప్రారంభం నుంచి ముగింపు వరకు నవ్విస్తుంది.
పెళ్లి చూపులు హిట్టయినా....
పెళ్లి చూపులు పెద్ద హిట్టయిన నాకు సరైన స్థాయిలో గుర్తింపు, అవకాశాలు రాలేదు. అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ అర్థం కాలేదు. హార్డ్‌వర్క్‌తో పాటు లక్ కూడా కలిసి రావాలి. యాక్టర్‌గా పేరు, హిట్టు వచ్చే వరకు ఇండస్ట్రీలో కష్టాలు తప్పవు. నా లైఫ్ టర్న్ అయ్యే రోజు కోసం వెయిట్ చేస్తున్నా. వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో వస్తోన్న ఛాంపియన్ మూవీలో మంచి రోల్ చేస్తున్నా. నేను ప్రియదర్శి కలిసి చాలా రోజుల తర్వాత మళ్లీ మరో సినిమా చేయబోతున్నాం.ఈ రెండు సినిమాలు నన్ను తిరిగి ఇండస్ట్రీలో నిలబెడతాయనే నమ్మకముంది.
బిగ్‌బాస్ వల్లే...
అభయ్ యాక్టింగ్ మానేయలేదు....సినిమాలు చేస్తున్నాడనే నిజం అందరికి బిగ్‌బాస్ వల్లే తెలిసింది. నాపై ఉన్న అపోహలు, అనుమానాలు పోవడానికి బిగ్‌బాస్ హెల్పయ్యింది. బిగ్‌బాస్ తర్వాతే నాకు రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. నేను ఏ టార్గెట్‌తోనైతే బిగ్‌బాస్‌లో అడుగుపెట్టానో అది జరిగింది.
బిగ్‌బాస్ విన్నర్ నిఖిల్ హీరోగా...
బిగ్‌బాస్ విన్నర్ నిఖిల్ హీరోగా నా డైరెక్షన్‌లో ఓ సినిమాకు ప్లాన్ జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో సినిమా ఉంటుంది. బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు నిఖిల్, నేను ఈ సినిమా గురించి మాట్లాడుకున్నాం. బిగ్‌బాస్ పూర్తయిన తర్వాత నిఖిల్‌కు కథ చెప్పా. అతడికి నచ్చింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. బిగ్‌బాస్ తో నిఖిల్, సోనియా, ప్రేరణ రూపంలో మంచి ఫ్రెండ్స్ దొరికారు. పృథ్వీ టచ్‌లో ఉన్నాడు. గౌతమ్‌తో అంతగా రిలేషన్ లేదు.
సంబంధిత కథనం