Aay Twitter Review: ‘ఆయ్’ అదిరింది!: ఎన్టీఆర్ బావమరిది మూవీకి నెటిజన్ల రెస్పాన్స్ ఎలా ఉందంటే..-aay movie x twitter review narne nithin comedy entertainer getting positive response from netizens ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aay Twitter Review: ‘ఆయ్’ అదిరింది!: ఎన్టీఆర్ బావమరిది మూవీకి నెటిజన్ల రెస్పాన్స్ ఎలా ఉందంటే..

Aay Twitter Review: ‘ఆయ్’ అదిరింది!: ఎన్టీఆర్ బావమరిది మూవీకి నెటిజన్ల రెస్పాన్స్ ఎలా ఉందంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 15, 2024 10:18 PM IST

Aay Movie Twitter Review: నార్నే నితిన్ హీరోగా నటించిన ఆయ్ సినిమా ప్రీమియర్ షోలు నేడు (ఆగస్టు 15) పడ్డాయి. ఈ చిత్రం రేపు రిలీజ్ కానుంది. ప్రీమియర్ షోలు చూసిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎక్కువగా పాజిటివ్ స్పందనే వస్తోంది.

Aay Twitter Review: ‘ఆయ్’ అదిరింది!: ఎన్టీఆర్ బావమరిది మూవీకి నెటిజన్ల రెస్పాన్స్ ఎలా ఉందంటే..
Aay Twitter Review: ‘ఆయ్’ అదిరింది!: ఎన్టీఆర్ బావమరిది మూవీకి నెటిజన్ల రెస్పాన్స్ ఎలా ఉందంటే..

ఇండిపెండెన్స్ డే సందర్భంగా టాలీవుడ్‍లో మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు నేడు (ఆగస్టు 15) రిలీజ్ అయ్యాయి. తంగలాన్ తెలుగు డబ్బింగ్‍లోనూ వచ్చింది. అయితే, ఆయ్ సినిమాపై కూడా క్యూరియాసిటీ బాగానే నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది, మ్యాడ్ మూవీ ఫేమ్ నార్నే నితిన్ ఈ చిత్రంలో హీరోగా నటించారు.

రేపు (ఆగస్టు 16) ఆయ్ మూవీ రిలీజ్ కానుండగా.. నేటి సాయంత్రం పెయిడ్ ప్రీమియర్ షోలను మూవీ టీమ్ ప్రదర్శించింది. ఈ షోలకు బుకింగ్స్ బాగానే జరిగాయి. గోదావరి విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఆయ్ మూవీని తెరకెక్కించారు కొత్త దర్శకుడు అంజి కే మణిపుత్ర. ప్రీమియర్ షోల తర్వాత ఈ చిత్రానికి రెస్పాన్స్ ఎలా ఉందంటే..

కామెడీ అదుర్స్

ఆయ్ సినిమాలో కామెడీ అదిరిపోయిందని ఈ సినిమాను చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చాలా చోట్ల కామెడీ సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టులు చేస్తున్నారు. హీరో నార్నే నితిన్ యాక్టింగ్ బాగుందని అంటున్నారు. మ్యాడ్‍తో పోలిస్తే అతడి నటనలో పరిణితి మరింత పెరిగిందని ప్రశంసిస్తున్నారు. ఆయ్ చిత్రంలో గోదావరి గ్రామీణ వాతావరణాన్ని, వెటకారాన్ని, స్నేహితుల మధ్య రిలేషన్‍ను రియలిస్టిక్‍గా, రిలేట్ అయ్యేలా డైరెక్టర్ అంజి చూపించారని నెటిజన్లు అంటున్నారు. లవ్ స్టోరీ కూడా మెప్పించిందని అభిప్రాయపడుతున్నారు. ఆయ్ కథ కొత్తగా లేకపోయినా.. ఆయన తెరకెక్కించిన విధానం, ఎంటర్‌టైన్‍మెంట్ అదిరిపోయానని చెబుతున్నారు.

విజువల్స్, ఎమోషన్లు కూడా..

కామెడీ, ఎమోషన్లు, స్టన్నింగ్ విజువల్స్ కలగలిసిన మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆయ్ అంటూ చాలా మంది పోస్టులు చేస్తున్నారు. గోదావరి అందాలను కథలో భాగంగా బాగా చూపించారని అంటున్నారు. నార్నే నితిన్‍తో పాటు హీరోయిన్ నయన్ సారిక కూడా నటనతో మెప్పించారని పోస్టులు చేస్తున్నారు. ఫస్టాఫ్, సెకండ్ హాఫ్ సినిమా అంతా ఎంటర్‌టైనింగ్‍గా సాగిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్వెల్‍కు ముందు కాస్త డ్రాస్ చేసినట్టు అనిపించినా.. పెద్దగా బోర్ కొట్టదని, మిగిలిన సినిమా మొత్తం ఆకట్టుకుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. కామెడీతో పాటు ఎమోషన్ కూడా బాగా పండిందని అభిప్రాయపడుతున్నారు.

రాజ్‍కుమార్ కసిరెడ్డి హైలైట్!

ఆయ్ చిత్రంలో హీరో నార్నే నితిన్ స్నేహితుడిగా రాజ్‍కుమార్ కసిరెడ్డి నటించారు. ఈ సినిమాలో ఆయన ఓ హైలైట్‍గా నిలిచారని, ఆయన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ కడుపుబ్బా నవ్వించాయని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. చాలా చిత్రాల్లో రాజ్‍కుమార్‌కు ఛాన్సులు వచ్చేస్తాయని అంటున్నారు. అంకిత్ కొయ్యా కూడా యాక్టింగ్ అదరగొట్టారని అభిప్రాయపడుతున్నారు.

హీరో, హీరోయిన్ మధ్య గొడవలను డైరెక్టర్ అంజి మరింత మెరుగ్గా చూపించి ఉండాల్సిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. హీరో తండ్రికి సంబంధించిన ట్విస్ట్ బాగానే ఉన్నా.. ఆ అంశాన్ని ఏదో త్వరగా ముగించేసిన ఫీలింగ్ వస్తుందని అంటున్నారు. కొన్ని చిన్న మైనస్‍లు మినహా ఆయ్ మూవీ ఆసాంతం ఆకట్టుకుంటుందని ఎక్కువ మంది నెటిజన్లు అంటున్నారు. తప్పకుండా చూడాల్సిన ఎంటర్‌టైనింగ్ మూవీ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

మ్యూజిక్ కూడా..

ఆయ్ చిత్రానికి రామ్ మిర్యాల అందించిన మ్యూజిక్ పెద్ద ప్లస్ అయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పాటలతో పాటు బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా సెట్ అయిందని అంటున్నారు. మూవీ ఆసాంతం అన్ని అంశాల్లో సంగీతం ఆకట్టుకుంటుందని అంటున్నారు.

మొత్తంగా, ఆయ్ చిత్రానికి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మ్యాడ్ సినిమా తర్వాత నార్నే నితిన్ మరో హిట్ కొట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తక్కువ బడ్జెట్ సినిమా అయినా క్వాలిటీతో దర్శకుడు అంజి తెరకెక్కించారని చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఆయ్ సినిమాను జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి సంయుక్తంగా నిర్మించారు.