Aarya 3 Review: సుష్మితా సేన్ ఆఖరి పోరాటం ఆకట్టుకుందా?: ‘ఆర్య 3: అంతిమ్ వార్’ రివ్యూ
Aarya Season 3 Antim Vaar Review: సుష్మితా సేన్ ప్రధాన పాత్ర పోషించిన ఆర్య వెబ్ సిరీస్‍లో మూడో సీజన్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. 2020లో తొలి సీజన్ రాగా.. ఇప్పుడు 2024లో అంతిమ్ వార్ పేరుతో సిరీస్‍లో ఆఖరిదైన మూడో సీజన్ వచ్చింది. ఈ యాక్షన్ సిరీస్‍లో ఆఖరి పోరాటం ఎలా ఉందో ఈ రివ్యూలో చూడండి.
వెబ్ సిరీస్: ఆర్య సీజన్ 3: అంతిమ్ వార్; స్ట్రీమింగ్: డిస్నీ+ హాట్‍స్టార్; ప్రధాన నటీనటులు: సుష్మితా సేన్, ఐలా అర్జున్, అరుషీ బజాజ్, విరేన్ వజిరాణి, ప్రత్యక్ష్ పన్వర్, వికాస్ కుమార్, గీతాంజలి కులకర్ణి తదితరులు; దర్శకులు: రామ్ మధ్వానీ, సందీప్ మోదీ, వినోద్ రావత్
బాలీవుడ్ సీనియర్ నటి సుష్మితా సేన్ ప్రధాన పాత్ర పోషించిన ఆర్య వెబ్ సిరీస్‍లో తొలి రెండు సీజన్‍లు (2020, 2021) సూపర్ పాపులర్ అయ్యాయి. దీంతో మూడో సీజన్‍పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘ఆర్య అంతిమ్ వార్’ పేరుతో ఆర్య సీజన్ 3 నేడు (ఫిబ్రవరి 9) డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సిరీస్‍కు ఇది ఆఖరి సీజన్. ఈ మూడో సీజన్ అంచనాలను అందుకుందా, ఆకట్టుకుందా అనే విషయాలను ఈ రివ్యూలో చూడండి.
స్టోరీ బ్యాక్‍డ్రాప్
డ్రగ్స్ మాఫియాలో ఉండే భర్త తేజ్ చనిపోయాక తనను, తన పిల్లలను రక్షించుకునేందుకు ఆర్య సరీన్ (సుష్మితా సేన్) గ్యాంగ్‍స్టర్‌గా మారుతుంది. తన పిల్లలను ప్రాణాలను తీసేందుకు వచ్చే వారిని ఎదుర్కొంటూ ఉంటుంది. ఆర్య తన పోరాటాన్ని కొనసాగించడమే ‘ఆర్య 3: అంతిమ్ వార్’లో ఉంది. తన గ్యాంగ్‍లోని చాలా మంది మోసం చేసినా ఆర్య యుద్ధం కొనసాగిస్తారు. మరి రష్యన్లు, పోలీస్ ఆఫీసర్ ఖాన్ నుంచి తన పిల్లలను ఆర్య కాపాడుకుందా? తన భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకుందా? అనేదే ఆర్య 3 అంతిమ్ వార్ ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
కథనం ఎలా ఉందంటే..
ఆర్య ఫస్ట్ సీజన్, రెండో సీజన్ చాలా గ్రిప్పింగ్‍గా ఉత్కంఠకరంగా ఉంటూ ఆకట్టుకున్నాయి. భార్య, తల్లిగా ఉండే ఆర్య (సుష్మితా సేన్) గ్యాంగ్‍స్టర్‌గా మారి పోరాడడం ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే, ఆర్యకు మద్దతిచ్చేవారు, విలన్ల క్యారెక్టర్లు ఇంట్రెస్టింగ్‍గా సాగాయి. ఇప్పుడు వచ్చిన మూడో సీజన్ కూడా ఆరంభంలో మెరుగ్గా అనిపిస్తుంది. తొలి నాలుగు ఎపిసోడ్లను దర్శకులు ఉత్కంఠకరంగా చూపించారు. ఆర్యను కొందరు మోసం చేయడం కూడా సస్పెన్స్ కలిగిస్తుంది.
అయితే, నాలుగో ఎపిసోడ్ తర్వాత ఈ ఆఖరి సీజన్ నెమ్మదిస్తుంది. కథనం కూడా ట్రాక్ తప్పిన భావన కలుగుతుంది. ముందటి సీజన్లతో పోలిస్తే చాలా లోపాలు కనిపిస్తాయి. గీతాంజలి కులకర్ణి పోషించిన సుశీల పాత్రను రివీల్ చేసిన విధానం అంతగా ఆకట్టుకోదు. ఐలా అరుణ్ పాత్ర కూడా ఈ సీజన్‍లో అంతగా మెప్పించదు. కొన్ని సీన్లు ఊహలకు తగ్గట్టే సాగుతున్నట్టు అనిపించడంతో ఆసక్తి మిస్ అవుతుంది. అయితే, చివరి ఎపిసోడ్ కాస్త మెరుగ్గా అనిపిస్తుంది. అయితే, ముగింపు కూడా అసంతృప్తిగానే అనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
‘ఆర్య సీజన్ 3 అంతిమ్‍వార్’లో సుష్మితా సేన్ మరోసారి తన పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. గ్యాంగ్‍స్టర్‌గా సీరియస్ టోన్‍ను కొనసాగిస్తూనే.. పిల్లలను కాపాడుకునేందుకు పోరాడే తల్లిగా ఎమోషనల్‍గా మెప్పించారు. యాక్షన్ సీన్లలోనూ అదరగొట్టారు. దౌలత్ పాత్ర చేసిన సికందర్ ఖేర్ కూడా నటనతో ఆకట్టుకున్నారు. పోలీస్ ఆఫీసర్‌గా చేసిన వికాస్ కుమార్ కూడా మెప్పించారు. మిగిలిన నటీనటులు వారి పరిధి మేర నటించారు.
రేటింగ్: 2.5/5