Maharaj OTT Release Date: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆమిర్ ఖాన్ తనయుడి తొలి సినిమా.. ఎక్కడ చూడాలంటే?
Maharaj OTT Release Date: ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ నటించిన తొలి సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలినీ పాండే ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా నటించింది.
Maharaj OTT Release Date: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అతడు నటించిన తొలి సినిమా మహరాజ్. ఈ పీరియడ్ డ్రామాకు సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వం వహించగా.. ఆదిత్య చోప్రాకు చెందిన వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్మెంట్ మూవీని నిర్మించింది. ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది.
ఓటీటీలోకి మహరాజ్
జునైద్ ఖాన్ నటించిన ఈ మహరాజ్ మూవీ రిలీజ్ డేట్ ను బుధవారం (మే 29) నెట్‌ఫ్లిక్స్ ఇండియా, వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా అనౌన్స్ చేశాయి. ఈ సందర్భంగా మూవీ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ప్రముఖ నటుడు జైదీప్ అహ్లావత్ కూడా నటించాడు. ఈ పోస్టర్ లో అతడు ఓ పండితుడి పాత్రలో నటించినట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది.
మూవీ రిలీజ్ డేట్ ను నెట్‌ఫ్లిక్స్ ఇండియా అనౌన్స్ చేసింది. "ఓ శక్తివంతమైన వ్యక్తి, ఓ భయం లేని జర్నలిస్ట్ మధ్య నిజం కోసం జరిగే పోరాటం. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన మహరాజ్ జూన్ 14న రిలీజ్ కాబోతోంది. కేవలం నెట్‌ఫ్లిక్స్ లోనే" అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా సినిమా కథ గురించి కూడా వెల్లడించింది.
మహరాజ్ మూవీ ఏంటంటే?
మహరాజ్ మూవీ ఓ పీరియడ్ డ్రామాగా తెరకెక్కింది. ఇది 19వ శతాబ్దంలో జరిగిన కథగా చూపించారు. మేకర్స్ చెప్పిన సారాంశం ప్రకారం.. "1862లో ఇండియాలో కేవలం మూడు యూనివర్సిటీలు మాత్రమే ఉన్న సమయం.. అప్పటికి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏడాది వయసు మాత్రమే.. 1857 సిపాయిల తిరుగుబాటు మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చరిత్రలో నిలిచిపోయే న్యాయ పోరాటంలో ఓ వ్యక్తి ధైర్యంగా నిల్చొన్నాడు. ఆ నిజమైన స్టోరీ ఇప్పుడు 160 ఏళ్ల తర్వాత మహరాజ్ రూపంలో వెలుగులోకి వస్తోంది" అని మూవీ గురించి మేకర్స్ చెప్పారు.
"కర్సన్‌దాస్ మూల్జీ స్టోరీ ఇది. ఆయనో జర్నలిస్ట్, సంఘ సంస్కర్త. ముంబైలోని ఎల్ఫిన్‌స్టోన్ కాలేజ్ లో విద్యార్థి. అణగారిన వర్గాల తరఫున తన గళం వినిపించిన వ్యక్తి. చరిత్రలో నిలిచిపోయే న్యాయ పోరాటాల్లో ఒకటిగా భావించే 1862లోని మహరాజ్ లైబెల్ కేస్ ద్వారా ఈ కర్సన్‌దాస్ పేరుగాంచారు" అని తమ మూవీ గురించి మేకర్స్ చెబుతూ వెళ్లారు.
ఎవరీ జునైద్ ఖాన్?
జునైద్ ఖాన్.. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తనయుడు. అతని తొలి భార్య రీనా దత్తాకు కలిగిన సంతానం. జునైద్ 1994లో జన్మించాడు. మహరాజ్ అతని కెరీర్లో తొలి సినిమా. ఇప్పటికే అతడు మరో రెండు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. అంతేకాదు ప్రీతమ్ ప్యారే మూవీ ద్వారా ప్రొడ్యూసర్ గానూ మారనున్నాడు. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ అతిథి పాత్ర పోషించనున్నాడు.
ఇక ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తూ సాయి పల్లవి నటిస్తున్న మరో సినిమాలోనూ జునైద్ నటించనున్నాడు. ఆమిర్ ఖాన్ కు తొలి భార్య ద్వారానే ఓ కూతురు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఆమె పేరు ఇరా ఖాన్. ఈ మధ్యే ఆమె పెళ్లి జరిగింది.