బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన ‘సితారే జమీన్ పర్’ సినిమా జూన్ 20వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ స్పోర్డ్స్ కామెడీ డ్రామా చిత్రానికి ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. ఈ మూవీని హీరో ఆమిర్ ఖాన్‍తో పాటు అపర్ణ పురోహిత్ నిర్మించారు. ఈ సినిమాకు మంచి హైప్ ఉంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి వచ్చిన ఓ భారీ ఓటీటీ డీల్‍ను ఆమిర్ వద్దనుకున్నారన్న రూమర్లు బయటికి వచ్చాయి.
సితారే జమీన్ పర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ఏకంగా రూ.120కోట్ల డీల్‍ను ఆఫర్ చేసిందని సమాచారం బయటికి వచ్చింది. కానీ ఆమిర్ ఖాన్ ఆ ఆఫర్ తిరస్కరించారని, ఎక్కువ రోజులు థియేటర్లలో సినిమాను నడిపేందుకు ఓటీటీ డీల్ వద్దనుకున్నారని టాక్.
ఓటీటీలోకి సితారే జమీన్ పర్ సినిమాను త్వరగా తీసుకురాకుండా ఉండేందుకు ఆమిర్ ఖాన్ ఆ నిర్ణయం తీసుకున్నారని ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నహ్తా పేర్కొన్నారు. “ప్రజలు అతిత్వరగా ఇంట్లో కూర్చొని చూసే ఆప్షన్ ఇవ్వకుండా.. వాళ్లు బిగ్‍స్క్రీన్‍పై ఈ మూవీని అనుభూతి చెందాలనే ఆలోచతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు” అని సంబంధిత వర్గాల నుంచి సమాచారం వెల్లడైంది. ఈ మూవీకి చాలా ఓటీటీ డీల్స్ వస్తున్నాయని, కానీ తాను ఏదీ అంగీకరించలేదని ఇప్పటికే ఆమిర్ ఓ సందర్భంలో చెప్పారు.
థియేటర్ల బిజినెస్‍ను మళ్లీ కళకళలాడేలా చేయాలనేది తన ప్రస్తుత లక్ష్యమని ఇటీవల ఓ కార్యక్రమంలో ఆమిర్ ఖాన్ అన్నారు. “ప్రస్తుతం థియేటర్ల బిజినెస్ చాలా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకప్పటి వైభవాన్ని మళ్లీ తీసుకురావాలని నేను అనుకుంటున్నా. థియేటర్లు ఇంకా సజీవంగానే ఉన్నాయి. అయితే మనం మంచి సినిమాలు తీయాలి. మరిన్ని స్క్రీన్స్ ఏర్పాటు చేయాలి. ఇండియాలో మరిన్ని స్క్రీన్స్ ఉండాలి” అని ఆమిర్ చెప్పారు.
సితారే జమీన్ పర్ చిత్రాన్ని అసలు ఏ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍కు ఇవ్వకూడదని ఆమిర్ ఖాన్ అనుకుంటున్నారని తెలుస్తోంది. లాంగ్ థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమాను యూట్యూబ్‍లో పే పర్ వ్యూ (డబ్బు చెల్లించి చూసేలా) పద్ధతిలో అందుబాటులోకి తెస్తారని తెలుస్తోంది. దీనిపై ఆమిర్ ఇటీవల హింట్ కూడా ఇచ్చారు.
సితారే జమీన్ పర్ చిత్రం.. స్పానిష్ మూవీ ఛాంపియన్స్ స్టోరీ ఆధారంగా రూపొందింది. ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. ఆమిర్ ఖాన్‍తో పాటు జెనీలియా, అరోశ్ దత్తా, గోపీ కృష్ణన్, వేదాంత్ శర్మ, నమన్ మిశ్రా ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. విభిన్న ప్రాతిభావంతులైన కొందరిని బాస్కెట్ బాల్ టోర్నీ కోసం ఓ కోచ్ సిద్ధం చేయడం చుట్టూ ఈ సితారే జమీన్ పర్ మూవీ సాగుతుంది. తారే జమీన్ పర్ (2007) మూవీకి సక్సెసర్‌గా వేరే కథతో వస్తోంది.
సంబంధిత కథనం