Aamir Khan Sitare Zameen Par: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఏడాది గ్యాప్ తర్వాత తన నెక్ట్స్ మూవీ అనౌన్స్ చేశాడు. న్యూస్ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మూవీ టైటిల్ ను సితారే జమీన్ పర్ అని చెప్పడం విశేషం. 2007లో అతడే నటించిన తారే జమీన్ పర్ థీమ్ తోనే ఈ కొత్త సినిమా కూడా ఉండబోతోందని ఆమిర్ చెప్పాడు.
ఈ సినిమా గురించి తాను ఎక్కువగా చెప్పనని, అయితే టైటిల్ మాత్రం రివీల్ చేస్తానని ఈ ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ చెప్పాడు. "ఈ సినిమా గురించి పబ్లిగ్గా నేను మాట్లాడలేదు. ఇప్పుడు కూడా కూడా ఎక్కువగా చెప్పను. టైటిల్ మాత్రం చెబుతాను. ఈ సినిమా టైటిల్ సితారే జమీన్ పర్. నా మూవీ తారే జమీన్ పర్ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా పేరు సితారే జమీన్ పర్. ఎందుకంటే అదే థీమ్ కంటే మేము పది అడుగులు ముందుకు వేస్తున్నాం. తారే జమీన్ పర్ ఎమోషనల్ మూవీ. కానీ ఇది మాత్రం మిమ్మల్ని నవ్విస్తుంది. ఆ సినిమా మిమ్మల్ని ఏడిపించింది. ఇది మీకు వినోదాన్ని పంచుతుంది" అని ఆమిర్ అన్నాడు.
థీమ్ అదే కావడంతో టైటిల్ అలాగే పెట్టినట్లు కూడా ఆమిర్ ఖాన్ తెలిపాడు. "మనందరిలోనూ లోపాలు ఉన్నాయి. బలహీనతలు ఉన్నాయి. కానీ మనలోనూ ఓ ప్రత్యేకత ఉంటుంది. అదే థీమ్ ను ముందుకు తీసుకెళ్లబోతున్నాం. తారే జమీన్ పర్ లో ఇషాన్ అనే ప్రత్యేకమైన పిల్లాడికి నేను సాయం చేస్తాను. కానీ ఈ కొత్త సినిమాలో అలాంటి 9 మంది పిల్లలు నాకు సాయం చేస్తారు" అని ఆమిర్ చెప్పాడు.
సితారే జమీన్ పర్ సినిమాను ఆమిర్ ఖానే నిర్మించనున్నాడు. ఈ మూవీతోపాటు అతని మాజీ భార్య కిరణ్ రావ్ డైరెక్ట్ చేయనున్న లాపతా లేడీస్ మూవీని, రాజ్ కుమార్ సంతోషి, సన్నీ డియోల్ కాంబినేషన్ లో వస్తున్న లాహోర్ 1947 మూవీని కూడా ఆమిర్ ఖానే నిర్మిస్తున్నాడు. ఈ సినిమాల గురించి తాను ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు ఈ సందర్భంగా ఆమిర్ చెప్పాడు.
2007లో వచ్చిన తారే జమీన్ పర్ మూవీని ఆమిర్ ఖానే డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాలో ఆమిర్ తోపాటు దర్శీల్ సఫారీ, తనయ్ ఛేడా, విపిన్ శర్మ, టిస్కా చోప్రా నటించారు. ఆ సినిమాలో ఆర్ట్ టీచర్ గా ఆమిర్ నటించగా.. డిస్లెక్సియాతో బాధ పడుతున్న చిన్నారికి సాయం చేసే పాత్ర అతనిది. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది.
టాపిక్