బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’లో మెరిశాడు. గురువారం (జులై 3) మేకర్స్ ఆమిర్ ఖాన్ పాత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా, అది అప్పుడే సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో దహాగా అతడు కనిపించనున్నాడు.
లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ కాంబినేషన్ అంటేనే ఓ రేంజ్ క్రేజ్ నెలకొంది. ఇందులోకి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కూడా వచ్చి చేరాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ క్రేజ్ మరో లెవెల్ కు వెళ్లింది. ఈ మూవీ మేకర్స్ అయిన సన్ పిక్చర్స్.. తమ అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో ఆమిర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఇందులో అతనిని 'దహా' అనే పాత్రలో పరిచయం చేశారు.
ఆ లుక్‌లో ఆమిర్ ఖాన్ ఓ రఫ్, ఇంటెన్స్ లుక్స్, నల్లటి వెస్ట్ వేసుకొని, ఓ పైప్‌ను ప్రశాంతంగా కాలుస్తూ కనిపిస్తున్నాడు. అతని డిఫరెంట్ లుక్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మూవీలో ఆమిర్ ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఆ పాత్ర మూవీలో ఓ కీలకమైన ట్విస్ట్ గా ఉందనుందని సమాచారం.
ఆమిర్ లుక్ చూసి అభిమానులు అబ్బురపడ్డారు. సోషల్ మీడియాలో ఉత్సాహంతో కూడిన కామెంట్స్‌తో ముంచెత్తారు. ఒక యూజర్ స్పందిస్తూ.. "మోస్ట్ అవేటెడ్ క్యారెక్టర్ (ఫైర్ ఎమోజి)" అని రాశారు. మరొక అభిమాని స్పందిస్తూ.. "మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ లోకేష్ కనగరాజ్ ఫ్రేమ్‌లో. డ్రీమ్ కాంబో" అని కామెంట్ చేశారు.
దక్షిణాది, ఉత్తరాది నటులు ఒకచోట చేరడంపై ఒక అభిమాని ప్రశంసలు కురిపిస్తూ, "సౌత్, నార్త్ రికార్డు సృష్టించే స్టార్లు కలుస్తున్నారు. తలైవా ఇండస్ట్రీని కాపాడటానికి వస్తున్నాడు" అని రాశారు. నిజంగానే ఈ కాంబో ఇటు సౌత్, అటు నార్త్ లో ఎంతగానో ఆసక్తి రేపుతోంది.
రజనీకాంత్ తోపాటు ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ వంటి పవర్‌ఫుల్ స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి స్టైలిష్, గ్రిట్టీ యాక్షన్ సినిమాలకు పేరుగాంచిన లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో అంటే దాదాపు రూ.375 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇది 2025లో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలవనుంది.
ఈ సినిమా ఇండిపెండెన్స్ డేకు ఒక రోజు ముందు అంటే ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. 'కూలీ' తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతుంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ నటించిన ‘వార్ 2’తో ఈ సినిమా నేరుగా పోటీపడనుంది. ఇది ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాక్సాఫీస్ క్లాష్‌లలో ఒకటిగా మారనుంది.
సంబంధిత కథనం