Aadujeevitham day 8 box office: మంజుమ్మెల్ బాయ్స్ రికార్డు బ్రేక్ చేసిన ఆడుజీవితం బాక్సాఫీస్ కలెక్షన్లు
Aadujeevitham day 8 box office: మరో మలయాళ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఈ మధ్యే వచ్చిన ఆడుజీవితం ది గోట్ లైఫ్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ ను వెనక్కి నెట్టింది.
Aadujeevitham day 8 box office: ఓ మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ మరో సర్వైవల్ థ్రిల్లర్ మూవీ రికార్డులను బ్రేక్ చేస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆడుజీవితం ది గోట్ లైఫ్ మూవీ తొలి వారంలో రికార్డు కలెక్షన్లు సాధించింది. ఈ ఏడాదే రిలీజై అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం మూవీగా నిలిచిన మంజుమ్మెల్ బాయ్స్ రికార్డును అధిగమించింది.
ఆడుజీవితం బాక్సాఫీస్
కేరళకు చెందిన వలస కూలీ నజీబ్ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ ఆడుజీవితం. ది గోట్ లైఫ్ అని కూడా పిలుస్తున్న ఈ సినిమా తొలి వారంలో అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుండటం విశేషం. మార్చి 28న రిలీజైన ఈ మూవీ 8 రోజులలో ప్రపంచవ్యాప్తంగా రూ.93.6 కోట్లు వసూలు చేసింది. ఇక కేవలం మలయాళంలోనే రూ.40 కోట్లు రాబట్టింది.
8వ రోజు ఈ సినిమా ఇండియాలో రూ.3.15 కోట్లు వసూలు చేసింది. మలయాళం తప్ప మిగతా భాషల్లో ఈ సినిమాకు అంత మంచి రెస్పాన్స్ రాలేదు. అయితే ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమాను బాగానే ఆదరిస్తున్నారు. ఇప్పటి వరకూ విదేశాల నుంచి ఈ సినిమాకు రూ.39.5 కోట్లు వచ్చాయి. ఈ క్రమంలో మంజుమ్మెల్ బాయ్స్ రికార్డును ఆడుజీవితం బ్రేక్ చేసింది.
ప్రస్తుతం అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా నిలిచిన మంజుమ్మెల్ బాయ్స్ తొలి 8 రోజుల్లో ఇండియాలో రూ.26.35 కోట్లు వసూలు చేసింది. కానీ ఆడుజీవితం మాత్రం ఏకంగా రూ.47 కోట్లతో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా మలయాళ ప్రేక్షకులకు తప్ప మిగతా భాషల వారికి పెద్దగా నచ్చకపోవడంతో వాటిలో పెద్దగా కలెక్షన్లు రాలేదు.
ఓవరాల్ రికార్డు బ్రేక్ చేస్తుందా?
సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మంజుమ్మెల్ బాయ్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.230 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇప్పుడు శనివారం (ఏప్రిల్ 6) నుంచి తెలుగులోనూ రిలీజ్ కానుంది. దీంతో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడా ఓవరాల్ రికార్డును ఈ ఆడుజీవితం బ్రేక్ చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుగులో ఈ సినిమాకు చాలా వరకు నెగటివ్ రివ్యూలే వచ్చాయి. అయితే కేరళ ప్రేక్షకులను మాత్రం బాగా ఆకట్టుకుంది. దీంతో రెండో వారంలోనూ సినిమా కలెక్షన్లు బాగానే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ.100 కోట్లపై ఈ సినిమా కన్నేసింది. మలయాళంలో ఈ వారంలో పెద్దగా సినిమాలేవీ లేకపోవడంతో ఆడుజీవితం మూవీ ఇలాగే దూసుకెళ్లొచ్చని అంచనా వేస్తున్నారు.
మంజుమ్మెల్ బాయ్స్ మూవీ ఇప్పటి వరకూ ఇండియాలో రూ.126 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది ఇప్పటికే మలయాళం ఇండస్ట్రీ నుంచి ప్రేమలు మూవీ కూడా రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. ఇవే కాకుండా అన్వేషిప్పిన్ కండెతుమ్, భ్రమయుగంలాంటి ఇతర మలయాళ సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఆడుజీవితం కూడా రూ.100 కోట్ల క్లబ్ లో చేరుతుందని రిలీజ్ కు ముందే ఊహించారు.